నిజామాబాద్:

రైతు నాయకుడు స్వర్గీయ సురేందర్ రెడ్డి లాగే మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రజలతో మమేకం అవుతున్నారని జడ్పీ చైర్మన్ విఠల్ రావు కొనియాడారు. అన్ని విధాలా జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్నారని అన్నారు. సీఎం కేసిఆర్ తగ్గట్టుగా కెటిఆర్ ఏ విధంగా పని చేస్తున్నారో.. స్వర్గీయ సురేందర్ రెడ్డి మార్గ నిర్దేశనంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి నడుస్తున్నారని కితాబిచ్చారు. ఉచిత కోచింగ్ సెంటర్ ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ కల్పించడం సంతోషకరం అన్నారు ఎమ్మెల్సి విజీ గౌడ్. రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అన్నారు.నిరుద్యోగులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఫ్రీ కోచింగ్ గురించి అడిగిన వెంటనే ఖర్చుకు వెనుకాడకుండా శిక్షణ అందించేందుకు ముందుకొచ్చారని సి పి నాగరాజు అన్నారు. స్టడీ మెటీరియల్,యాప్ ఉచితంగా అందించారని అన్నారు.

పోలీస్ ఉద్యోగాలు, గ్రూప్స్ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ తదితరుల సహకారంతో సుమారు మూడు నెలలకు పైగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించిన విషయం విదితమే. అభ్యర్థులకు నిష్ణాతులైన అధ్యాపకులతో బోధనను అందించడమే కాకుండా నాణ్యమైన స్టడీ మెటీరియల్ ను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఉపయుక్తంగా నిలిచేలా అన్ని అంశాలను క్రోఢీకరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను సైతం అందించారు. పోలీసు అధికారుల పర్యవేక్షణలో శారీరక దారుఢ్య శిక్షణ ఇప్పించారు. నిర్ణీత కాల వ్యవధి ముగిసిన నేపథ్యంలో సోమవారం స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ప్రీ కోచింగ్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్, ఎమ్మెల్సీ వీ.గంగాధర్ గౌడ్, నగర మేయర్ నీతూకిరణ్, పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

800 జీతంతో ప్రారంభించి టాప్ బిల్డ‌ర్‌గా మారాను…. వేముల ప్రశాంత్ రెడ్డి

ఈ సందర్భంగా తన ఎదుగుదల కోసం తాను కష్టపడిన తీరు గురించి మంత్రి ప్రశాంత్ రెడ్డి స్వానుభవాన్ని తెలియజేస్తూ, అభ్యర్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించే ప్రయత్నం చేశారు. ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసిన తరువాత తాను హైద్రాబాద్ లోని ఓ ఆర్కిటెక్ట్ కంపెనీలో కేవలం నెలకు 800 రూపాయల వేతనంతో కూడిన ప్రైవేట్ ఉద్యోగంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి పట్టుదలతో పనిచేస్తూ అంచెలంచెలుగా టాప్ బిల్డరుగా మారానని వివరించారు. ఇదే కోవలో ఆయా రంగాల్లో కింది స్థాయి నుండి కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారిని మార్గదర్శంగా తీసుకుని అభ్యర్థులు అంకితభావంతో లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విజయసాధన కోసం కష్టపడడం ఒక్కటే మార్గమని, ఎలాంటి అడ్డదారులు ఉండవని మంత్రి ప్రశాంత్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. ప్రస్తుత చివరి అంకంలో పట్టు సడలనివ్వకుండా మరింత గట్టిగా కష్టపడితే, మీ పాదాల చెంతనే ఉన్న ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోగలుగుతారని హితవు పలికారు.

తెలంగాణ యువత ఆకాంక్షను గుర్తెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసి దేశంలోనే మరెక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల్లో స్థానికత జీవో ను అమల్లోకి తెచ్చారని అన్నారు. ప్రస్తుతం ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో స్థానిక యువతకు ఇది వరంగా నిలువనుందని పేర్కొన్నారు. జిల్లాల ప్రతిపడిన 95 కొలువులు స్థానికులకే దక్కనున్నాయని ఇది ఎంతో గొప్ప విషయమని అన్నారు. అంతేకాకుండా ఏకకాలంలో 90 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం ఎంతో సాహసోపేత నిర్ణయమని కొనియాడారు. ఇప్పటికే 17 వేల పైచిలుకు ఉద్యోగాలకు ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.

నిరుద్యోగ యువకులు అన్ని పోటీ పరీక్షలు రాసేందుకు వీలుగా ఒకదానివెంట ఒకటి చొప్పున నిర్ణీత కాలవ్యవధిలో నోటిఫికేషన్లు జారీ చేసేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టిందని అన్నారు. దీనివల్ల అభ్యర్థులు ఒకటికి మించి పోటీ పరీక్షలు రాసేందుకు, తద్వారా ఏదో ఒక కొలువు దక్కించుకునేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. ఈ సువర్ణ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని, సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జిల్లాకు పేరు తేవాలని మంత్రి పిలుపునిచ్చారు.
మీ భవిష్యత్తుకు మీరే మార్గ నిర్దేశకులని, గట్టిగా కష్టపడితే కోరుకున్న ప్రభుత్వ కొలువును సొంతం చేసుకోవడం కష్టమైనా పనేమీ కాదని రాష్ట్ర రోడ్లు – భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉద్యోగార్థులకు సూచించారు.

కోచింగ్ కోసం సహకరించిన స్థానిక ఎమ్మెల్యే గణేష్ బిగాల కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ రోజు బువ్వ కుండ ద్వారా ఆకలి తీర్చిన ఎమ్మెల్సి కవితమ్మ కు జాగృతి సభ్యులకు ప్రత్యేక దన్యవాదాలు అన్నారు.

ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రెడ్ కో మాజీ చైర్మన్ ఎస్.ఏ.అలీం, డీసీపీ ఉషావిశ్వనాథ్, నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్, ప్రముఖ విద్యావేత్త మారయ్య గౌడ్, తారిఖ్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

You missed