ఇప్ప‌డంతా వ‌రి రాజ‌కీయం న‌డుస్తోంది. యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోమ‌ని కేంద్రం తెగేసి చెప్పిన నేప‌థ్యం.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఓ ర‌కంగా మేలు చేసిన‌ట్టే. కాగ‌ల కార్యం గంధ‌ర్వులే తీరుస్తున్నార‌న్న‌ట్టు కేసీఆర్ సంబ‌ర‌ప‌డ్డాడు. ఎందుకంటే.. ఏడాది కింద‌టే వ‌రి వేయొద్ద‌ని, మేం కొన‌బోమ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించాడు. ప్ర‌భుత్వం ఏమైనా బిజినెస్ చేస్తున్న‌దా..? మ‌ద్ద‌తు ధ‌ర ఇచ్చి ఎప్పుడూ మేమే కొనుగోలు చేయాలంటే కుద‌ర‌దు.

మీరు వేరే పంట‌లు వేసుకోండి… వ‌రి త‌గ్గించండి.. ఇక కొనుగోలు కేంద్రాలు ఉండ‌వు.. అని చెప్పేశాడు. అప్ప‌టికే అది త‌ల‌కు మించిన భార‌మ‌ని కేసీఆర్ గ్ర‌హించాడు. ఇబ్బ‌డిముబ్బ‌డిగా నీటి వ‌న‌రులు పెరిగాయి. ఈజీ పంట అయిన వ‌రికే అల‌వాటు ప‌డ్డ రైతు దీని వైపే మొగ్గు చూపాడు. ప‌ర్య‌వ‌సానంగా వ‌రి విస్తీర్ణం పెరిగింది. ప్ర‌భుత్వానికి భార‌మూ పెరిగింది. దీంతో కేసీఆర్ ఓ ద‌శ‌లో తెగేసి చెప్పేశాడు. ఇక వ‌డ్లు కొన‌బోమ‌ని, దీన్ని అప్ప‌టి మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బాహాటంగానే వ్య‌తిరేకించాడు. కొనుగోలు కేంద్రాలు పెట్టాల్సిందేన‌న్నాడు ఓ స‌భ‌లో. అప్ప‌ట్నుంచి వీరిద్ద‌రి మ‌ద్య అగాధం ఏర్ప‌డింది. ప్ర‌చ్ఛ‌న్న‌యుద్దం స్టార్ట్ అయ్యింది. అది వేరే విష‌యం.

కానీ ఇప్పుడు వ‌రి రైతే టీఆరెస్‌కు వ్య‌తిరేకంగా త‌యార‌య్యే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. దీన్ని కేసీఆర్ అస్స‌ల్ ఊహించ‌లేదు. స్టేట్ బీజేపీ మ‌రింత రెచ్చ‌గొడుతున్న‌ది. దీంతో అధికార పార్టే ఈ రోజు ఏకంగా దీక్ష‌ల‌కు దీగాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. కానీ ఈ రాజ‌కీయాలు ఎన్నో రోజులు మ‌న‌లేవు. అస‌లు నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. స‌రైన వ్య‌వ‌సాయ రంగ పాలసీ లేని ప్ర‌భుత్వం.. ఆప‌దొచ్చిన త‌ర్వాతే ఆద‌ర‌బాద‌రా ఉరుకులాడుతుంది త‌ప్పితే.. రైతుల‌కు స‌రైన అవ‌గాహ‌న క‌ల్పించి ఇత‌ర పంట‌ల వైపు తీసుకెళ్లే లాంగ్‌స్టాండ్ ప్ర‌ణాళిక లేదు.

వేరే పంట‌లు వేసుకోండి.. వ‌రి వేసుకుంటే మీ ఇష్టం.. మేం కొనం.. అని బాధ్య‌త‌రాహిత్యంగా చెప్పేస్తోంది.. మ‌రి ఏడాదిన్న‌ర కింద‌టే మేల్కొన్న కేసీఆర్.. అప్పట్నుంచే ఈ వైపుగా ఎందుకు దృష్టి పెట్ట‌లేదు. ఎందుకంటే.. రాజ‌కీయాలే అవ‌స‌రం. ఏదో ఒక ఎన్నిక‌. ఏదో ఒక అడ్డంకి.గ‌ట్టిగా చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇదిగో ఇలా చివ‌రికి వ‌రి స‌ర్కార్ పీక‌ల మీద‌కు వ‌చ్చి ప‌డ్డ‌ది. ఇప్పుడు కేంద్రాన్ని దొంగ‌ని చేసి త‌ప్పించుకుంటారు స‌రే.. మున్ముందు వానాకాలం పంట కూడా మీకు గుదిబండే అవుతుంది. ఎందుకంటే బాగా వేయండి.. మ‌న‌మే దేశానికి అన్నం పెడుతున్నాం..అని చెప్పిందీ మీరే.. ఇప్పుడు వ‌రి వేస్తే ఉరే అని భ‌య‌ప‌డుతున్న‌ది మీరే.. వ‌రి వేస్తే రైతుల‌కు ఉరి కాదు.. అది స‌ర్కార్ మెడ‌కే ఉరి. ఇది నిష్టుర స‌త్యం. అది కేసీఆర్‌కూ తెలుసు.

You missed