దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి:

ఇందూరు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాల్లో ఏవీ అసాధ్యం కాదు. బళ్లు ఓడలు కావొచ్చు. ఓడలు బళ్లు కావొచ్చు. తాజాగా నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గ బీఆరెస్‌ కీలక నేతలు పార్టీ మారారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల సమక్షంలో వీరంతా చేరారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాకు వీరిలో చాలా ఆత్మీయులు, దగ్గరి నేతలు, అనుచరులు ఉండటం గమనార్హం. ఇప్పుడు ఇదే ఇందూరు రాజకీయాల్లో తీవ్ర చర్చకు తెర తీస్తున్నది. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా కూడా త్వరలోని కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని విస్తృత ప్రచారం జరుగుతోంది.

నిజామాబాద్‌ ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నారని, దీని కోసం కాంగ్రెస్‌ పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారని కూడా ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. వాస్తవానికి గణేశ్‌గుప్తాకు, ఎమ్మెల్సీ కవితకు మధ్య తీవ్ర అగాధం ఉంది. ఆమెను కాదని గణేశ్ గుప్తా అర్బన్‌లో తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైనా తనకు తెలియకుండా, తనను కాదని కవితను కలిస్తే ఇక వారి పని ఖతమే. అలా రాజకీయాలను పూర్తిగా తన ఆదీనంలోకి తెచ్చుకోవడంలో గణేశ్ గుప్తా సక్సెస్‌ అయ్యాడు. ఎమ్మెల్సీ కవిత నిమిత్త మాత్రురాలిలాగే ఉండిపోయింది. ఆనాడు మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ఒంటెత్తు పోకడలతో పోయిన బిగాల తీవ్రంగా దెబ్బతిన్నాడు. పార్టీని తీవ్రంగా నష్టపరిచాడు. అప్పటి నుంచి కవితకు బిగాల అంటే అగ్గిమీద గుగ్గిలం. ఇదిలా కొనసాగుతుండగా మూడోసారి ముచ్చటగా కేసీఆర్‌ సిట్టింగులకే టికెట్లిచ్చాడు. దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆమె బలవంతంగానైనా బిగాలకు సపోర్టు చేసింది. అయినా ఘోర పరాభవం చెందాడు బిగాల.

ఇక తనకు పార్టీలో నూకలు చెల్లాయని భావించాడు. కవిత జిల్లాను వదలనన్ని రోజులు తనకు బీఆరెస్‌లో ఉనికి లేదని, మళ్లీ పార్టీ తనను గుర్తించే వీలేలేదని డిసైడ్ అయ్యాడు. దీంతో కాంగ్రెస్‌లోకి పోయేందుకు రంగం సిద్దం చేసుకున్నాడు. అంతకు ముందు తన అనుచరగణాన్ని ఆ పార్టీలోకి సాగనంపాడు. ఇందులో మాజీ కార్పొరేటర్లు, కార్పొరేటర్లు అంతా ఉన్నారు. గతంలో నిజామాబాద్‌ ఎంపీగా పోటీ చేసిన అనుభవం బిగాల గణేశ్‌ గుప్తాకు ఉంది. తన రేంజ్ ఎంపీ రేంజ్అని ఆయన చాలా సభల్లో బహిరంగంగానే చెప్పుకొచ్చాడు. ఇప్పుడు చాన్స్‌ దొరికింది. బీఆరెస్‌ ఎలాగూ ఇవ్వదు.

తనకు రాజకీయ సమాధి చేసేందుకు అంతా పూనుకుంటున్నారని క్లారిటీ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి ఎంపీ టికెట్‌ ఆశించాలని భావిస్తున్నాడు బిగాల. కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువయ్యారు. జగిత్యాల జీవన్‌రెడ్డిని తెచ్చి పోటీ చేయించాలని చూస్తున్నారు. ఇదే మంచి తరుణంలా బిగాల.. తను ఖర్చు పెట్టుకుని పార్టీ తరుపున పోటీ చేసి గెలుస్తానని ధీమాను అధిష్టానంతో పంచుకుంటున్నాడు. అక్కడ ఓకే అనడమే తరువాయి కాంగ్రెస్‌ బరి నుంచి బిగాల పోటీ చేస్తానడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

 

DANDUGULA SRINIVAS

(SENIOR JOURNALIST)

8096677451

You missed