ఇప్పుడు అర్జంటుగా టీఆరెస్‌కు మ‌ళ్లీ తెలంగాణ సెంటిమెంట్ కావాలి. పెరిగిన వ్య‌తిరేక‌త‌ను దీనికి మించిన మందు లేదు. ప్ర‌జ‌లు ఏ విష‌యంలో కేసీఆర్‌ను తిట్టుకున్నా.. సెంటిమెంట్ రాజేస్తే మాత్రం త‌న‌ను కాద‌ని ఎవ‌రి వైపూ చూడ‌రు. ఇప్ప‌టి వ‌ర‌కు తిట్టిన నోళ్లే.. ఆయ‌నను అనుకోకుండా కీర్తిస్తాయి. అదే కావాలిప్పుడు కేసీఆర్‌కు. మ‌ళ్లీ అధికారంలోకి రావాలి. సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ది అని ఎంత బాకా ఊదినా రానున్న ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్క‌డం క‌ష్ట‌మే. అది తేలిపోయింది.

రేపు హుజురాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాలు దిమ్మ‌దిరిగేలా ఉండ‌నున్నాయి. ఉన్న ప‌రువూ బ‌జారున పెట్టే ఫ‌లితాలే రానున్నాయి. కేసీఆర్ త‌న భ‌విష్య‌త్తు ఊహించాడు. ముందు జ‌ర‌గేది గ్ర‌హించాడు. అందుకే మొన్న ప్లీన‌రీలో ఆంధ్ర ఇష్యూ ఎత్తుకున్నాడు. అక్క‌డికి టీఆరెస్ రావాల‌ని ఆ ప్ర‌జ‌లు కోర‌కుంటున్నార‌ట‌. ఇక్క‌డి ప‌థ‌కాలు అద్బుత‌మ‌ని కొనియాడుతున్నారంట‌. వాళ్ల‌కు కాల‌దా మ‌రి. స‌మైక్య రాగ‌మందుకున్నారు అక్క‌డి అధికార పార్టీ నేత‌లు. వాళ్ల‌కు అంత‌కుమించి మాట్లాడ‌టం చేత‌కాదు.

కేసీఆర్ వేసిన ఎత్తుగడ‌లో చిత్తయ్యారు. ఇక్క‌డి పాల‌న‌లోపాలు ఎత్తి చూపొచ్చు. ఇక్క‌డి ప్ర‌జా వ్య‌తిరేక‌త ఎలా పెరుగుతూ వ‌స్తున్న‌దో చెప్ప‌వ‌చ్చు. కానీ అంత స‌బ్జెక్టులోకి పోవ‌డానికి ఆంధ్ర నేత‌ల‌కు స‌బ్జెక్టు ఉంటే క‌దా. ఒక్క‌టే ఈజీగా దొరికింది… స‌మైక్య రాష్ట్రంగా చేయ‌మనండి అని. ఇలాంటి తెలివిత‌క్కువ వాద‌న మాట‌లే వ‌స్తాయ‌ని కేసీఆర్ గ్ర‌హించాడు. అదే జ‌రిగింది. దీనికి తోడు సోయి లేని జ‌గ్గారెడ్డి.. నోటి వెంట కూడా ఇదే మాట‌న్నాడు. బ‌హుశా ఇది కూడా కేసీఆర్ వ్యూహ‌ర‌చ‌నే కావొచ్చు. కాద‌న‌లేం. రేవంత్‌కు ఏమ‌న్నా.. కొంచెమ‌న్నా.. బుద్ది ఉంటే.. వెంట‌నే జ‌గ్గారెడ్డి మీద చ‌ర్య‌లు తీసుకోవాలి. పార్టీ నుంచి బహిష్క‌రించాలి. అక్క‌డ అంత సీన్ లేదు. కాంగ్రెస్ ఎదిగే ఛాన్స్ లేదు.

ఇక కొంద‌రు త‌మ బూజు ప‌ట్టిన క‌లాల‌ను బ‌య‌ట‌కు తీశారు. కుట్ర‌లు అంటూ పిట్ట‌ల ర‌వీంద‌ర్ రాశాడు న‌మ‌స్తే తెలంగాణ‌లో. ఇప్ప‌డే అక‌స్మాత్తుగా ఈ కుట్ర‌లు ఎందుకు బ‌య‌లుదేరాయి.దీనికి వెనుక ఉద్దేశ్య‌మేమిటీ? మొన్న‌టి వ‌ర‌కు మాది ఫ‌క్తు రాజ‌కీయ‌పార్టీ అన్న కేసీఆర్ అహంకారం దిగిందా..? త‌త్వం బోధ‌ప‌డ్డ‌దా..? మ‌ళ్లీ బ‌తికి బ‌ట్ట‌క‌ట్టాలంటే సెంటిమెంటే దిక్కా..? అందుకే ఇలా ప్లానింగ్ ప్ర‌కారం కుట్ర ల పేర ఎత్తుగ‌డ‌లు పారిస్తున్నారా..? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు తొంద‌ర‌లోనే దొర‌క‌నున్నాయి. మీరు తిట్టుకుంటే మీరిద్ద‌రు శ‌త్రుల‌నిమేం అనుకోవాలి.. మేం కూడా తిట్టాలి. మీరిద్ద‌రూ కౌగిలించుకుంటే.. జ‌గ‌న్ మా మిత్రుడే అని మేము మురిసిపోవాలి. జ‌గ‌న్ మా అన్న అని కీర్తించాలి. కేసీఆర్ ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకున్నా.. అది తెలంగాణ క్షేమం కోస‌మే అని గుడ్డిగా, గొర్రెల్లా న‌మ్మాలి. అంతే..

You missed