ఉద్యమకాలంలో తెలంగాణా అస్తిత్వ భావన బలోపేతం చేసే లక్ష్యంతో నేను చేసిన అనేక ఉపన్యాసాల్లో రామప్ప ప్రశస్తి ఒక భాగమై ఉండేది. కర్ణాటక లో హసన్ పట్టణానికి సమీపం లో ఉండే బేలూరు హళేబీడు దేవాలయాల శిల్పకళ మహోన్నతమైనది. అయితే ఈ దేవాలయాలు బలపపు రాయితో చెక్కబడ్డాయి. బలపం రాయి చెక్కణానికి అనువైనది. రామప్ప అంతా నల్లసరం బండ. నల్లసరంబండ అంత సులభంగా శిల్పానికి ఒదగదు. శిల్పి చాలా కష్ట పడాలి. రామప్ప స్తంభాల మీద అతి సూక్ష్మమైన వివరాలతో అద్భుతమైన డిజైన్లు చెక్కి ఉన్నాయి. ఇవి చెక్కే క్రమంలో ఎక్కడ చిన్న తేడా వచ్చినా మొత్తం స్తంభం పనికి రాకుండా పోతుంది. మళ్ళీ కొత్తగా ప్రారంభించాలి. అంటే ఆనాటి శిల్పులు ఎంత శ్రద్ధ, ఏకాగ్రతలతో చెక్కి ఉంటారో, ఎంత శ్రమించి ఉంటారో ఊహించవచ్చు. దాశరథి అగ్నిధార లో శిల్పి అనే శీర్శికతో అద్భుతమైన పద్యాలు ఉన్నయి. వాటికి ప్రేరణ రామప్పనే. కాకతీయుల కాలంలో జీవించిన వివిధ జాతుల స్త్రీ మూర్తుల విగ్రహాలు ఆనాటి కట్టుబొట్టు తీరుతో కనిపిస్తాయి. వాటి ముఖాల్లో కోపం,కొంటెతనం గంభీరత, కొన్ని శిల్పాల ముఖాల్లో ఏక కాలం లో అనేక భావాలు కదలాడేలా చిత్రించిన తీరు అమోఘం. గజాసురిని కడుపు చీల్చుకొని సాక్షాత్కరించే శివుని శిల్పం, త్రిపురాసురిని మీదకు దండెత్తి వెళ్తున్న మహాశివుని రథ చక్రాల సరభస గమనం శిల్పి ఊహాశాలితకు, దానిని రాతిలో అనువదించిన ఆతని కళానైపుణ్యానికి అద్భుత తార్కాణాలు. వారి జన్మాన్ని సాంతం అర్పణ చేస్తే అంతటి ప్రతిభ సాధ్యం కాదు. రేచర్ల రుద్రుడు నిర్మించిన రుద్రేశ్వరాలయం అందుకే శిల్పి పేరున రామప్ప దేవాలయంగా చరిత్రకెక్కింది. ఈ దేశం లో శిల్పి పేరున ఉన్న దేవాలయం ఒక్క రామప్పనేనేమో. మళ్ళా ఒకసారి రామప్పకు పోయి ఆనాటి శిల్పుల పాదాలను కళ్ళకద్దుకోవాలనిపిస్తున్నది.

Deshapathi Srinivas

You missed