అంద‌రూ న‌న్ను మెచ్చుకోవాలె. శ‌భాష్ అనాలె. కీర్తించాలె. కాళ్ల‌పై తారాడాలె. పొగ‌డ్త‌ల మ‌త్తులో కేసీఆర్ మునిగితేలున్నారా? అదే కోరుకుంటున్నారా?

 

ప్ర‌శ్నిస్తే చిరాకు. వ్య‌తిరేకిస్తే  క‌సి. అంద‌రూ త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉండాలె. ఎవ‌రూ ప్ర‌తిప‌క్షంగా బ‌లంగా ఉండి ప్ర‌శ్నించొద్దు. అంతా నేను అనుకున్న‌ట్లే న‌డ‌వాలె. అధికారం ప‌ది కాల‌ల పాటు నా పాద‌దాసిగా ప‌డి ఉండాలె.

 

కేసీఆర్ ఇదే కోరుకుంటున్నాడా?

 

మాట్లాడితే దేశం మ‌న‌వైపే చూస్తుందంటాడు.

దేశంలో మ‌న‌మే నెంబ‌ర్ వ‌న్ అంటాడు.

అంతా మ‌న ప‌థ‌కాల్నే కాపీ కొడుతుందంటాడు.

శ‌భాష్ అని కీర్తిప‌తాకాలు క‌ప్పుతున్నార‌ని మురిసిపోతాడు.

 

ధ‌నిక రాష్ట్ర‌మంటూనే ఆదాయ వ‌న‌రులు చెప్ప‌డు. అదంతా ర‌హ‌స్యం. ఆయ‌న‌కే తెలుసు చిట్టాప‌ద్దుల‌న్ని.

సంక్షేమ ప‌థ‌కాల పేరుతో బ‌డ్జెక్ సంబంధం లేని, అంతుపొంతు లేని ఉచిత ప‌థ‌కాలు.

అవి ఇటు ప్ర‌భుత్వం ఆదాయం పెంచ‌వు. ప్ర‌జ‌ల ఆదాయాన్నీ పెంచ‌వు. నెల నెల‌కు వేచిచూసే అల‌వాటు చేయ‌డం త‌ప్ప‌.

 

జీవ‌న ప్ర‌మాణాలు పెంచ‌డంలోనూ అవి ఉప‌యోగ‌ప‌డ‌లేదు. ప‌డ‌వు. కుటీర ప‌రిశ్ర‌మ‌లు ఉండ‌వు. ఉపాధి మార్గాల అన్వేష‌ణ ఉండ‌దు. త‌మ కాళ్ల‌పై తాము బ‌తికే స్థితి ఉండ‌దు. ప‌థ‌కాలు ఇస్తున్నాం. తీసుకోండి. మెచ్చుకోండి. కీర్తించండి. మ‌ళ్లీ గెలిపిండండి. అధికారం ఇస్తే చాలు .. మీకేం కావాలో అది చేస్తాం.. ఇదే  ఇప్ప‌టి కేసీఆర్ రాజ‌కీయం. దీనికి ఆయ‌న పెట్టిన పేరు .. మాదీ ఫ‌క్తు రాజ‌కీయం. ఓట్ల కోసమే ప‌థ‌కాలని బాహాటంగా చెప్తాడు. అధికారం కోస‌మే ఇవ‌న్నీ అని ప‌రోక్షంగా ఒప్పుకుంటాడు. అదీ ఆయ‌నలోని గొప్ప‌తనం. ఆర్థిక వ‌న‌రుల అభివృద్దిలో, ఆదాయం పెంపులో మేథావుల‌తో ఎప్ప‌డూ చ‌ర్చించింది లేదు. ఆదాయంలోని డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డుతుంది కాబ‌ట్టి. ధ‌నిక రాష్ట్ర‌మ‌ని ముసుగు తొలిగితే ఇక ప్ర‌జ‌లను న‌మ్మించేందుకు అవ‌కాశం ఉండ‌దు కాబ‌ట్టి.  ప్ర‌చారంలో మ‌నంతా మేటి ఇంకెవ‌రూ ఉండ‌వు కావొచ్చు. కాశేశ్వ‌రం ప్రాజెక్టు యాడ్లు ప‌క్క‌రాష్ట్రాల ప‌త్రిక‌ల‌కూ ఇచ్చేంత కీర్తి కండూతి మ‌న‌ది. యూనివ‌ర్సిటీలు నిర్వీర్యం అవుతున్నా ప‌ట్టింపు ఉండ‌దు.

 

 

మాట్లాడితే దేశం మ‌న‌ల్నే చూడాల‌నే కోరిక‌.

అంతా మెచ్చుకోవాల‌నే యావ‌.

 

అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవాల‌నే తప‌న‌.

 

ఇందుకోస‌మే ఫ‌క్తు రాజ‌కీయం …

 

ఇది బంగారు తెలంగాణ కోస‌మే. అని మ‌న‌మంతా అనుకోవాలి. అంతే.

You missed