దండుగుల శ్రీనివాస్ -వాస్తవం ప్రధాన ప్రతినిధి:
‘ ‘పది మెడికల్ కాలేజీలు పెట్టే బదులు ఓ వంద యూట్యూబ్ చానళ్లు పెట్టి ఉంటే బాగుండేది. గెలిచి ఉండేవాళ్లం..!’ ఓటమి పాలైన తరువాత కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. అంటే దీని అర్థం… యూట్యూబ్ చానళ్లు తమపై చేసిన ప్రచారం బాగా పనిచేసి అవతలివారి గెలుపుకు ఉపయోగపడిందని ఆయన ఒప్పుకున్నాడు. అదే సమయంలో తమ ఇంటి పేపర్ నమస్తే తెలంగాణ, టీన్యూస్ చానళ్లు తమ గెలుపుకు ఏమాత్రం ఉపయోగపడలేదనే విషయాన్నీ పరోక్షంగా ఒప్పుకున్నాడాయన. ఇప్పుడిదంతా ఎందుకంటే. కేటీఆర్ కూడా యూట్యూబ్ చానళ్ల వైపు ట్యూన్ అయ్యాడు. అవును మరి ట్రెండింగ్ అదే నడిస్తుంది మళ్ల. సోషల్ మీడియా అంత పవర్ ఫుల్ అయ్యింది.
బీఆరెస్ పత్రిక, చానళ్లు ఎంత మొత్తుకున్నా వాటిని జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే తెర వెనుక ఉండి కేటీఆర్ యూట్యూబ్ చానళ్ల ఏర్పాటుకు ఇతోధికంగా తోడ్పాటునందిస్తున్నాడు. దీని కోసం కొన్ని చానళ్ల నుంచి కొందరు సీనియర్ రిపోర్టర్లను బయటకు లాగి వారితో యూట్యూబ్ చానళ్లను ఏర్పాటు చేయిస్తున్నాడు. కానీ ఎక్కడా కేటీఆర్‌కు సంబంధం ఉన్నట్టు అవి కనిపించవు. కావాల్సిన సౌకర్యాలు, ఆర్థికపరమైన సపోర్టు కేటీఆర్ అందిస్తాడు. కావాల్సిన సమయంలో బీఆరెస్ పార్టీకి మేలు చేసే విధంగా ఆ యూట్యూబ్ చానళ్లు తమ స్టోరీలను ట్యూన్ చేస్తూ ఉంటాయి. ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటాయి.
తమ పార్టీకి మేలు జరిగే కథనాలే కాదు.. కాంగ్రెస్‌ను కుమ్మేసి కుదేసి నిలేసి మెలేసే కథనాలు కూడా బోలేడు వండి వార్చే కార్యక్రమాలు ఇందులో ఉంటాయన్న మాట. ఇవెన్ని పుట్టుకొస్తాయో తెలి్యదు. వేటి వెనుక రామన్న ఉన్నాడో కూడా ఇప్పటికైతే తెలియదు. ఆయా యూట్యూబ్ చానళ్ల కంటెంట్‌ను బట్టి మెల్లమెల్లగా జనాలకు వాటి స్థాండ్ అర్థమయిపోతుంది. తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదనకో..! మొత్తానికి ఇప్పుడు స్టేట్‌లో యూట్యూబర్ల హవా కొనసాగనుందన్నమాట..!