దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

ఇందూరు రోడ్‌ షోలో కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎంపీ అర్వింద్‌పై విరుచుపడ్డారు. ఎంపీగా గెలిచి ఏమీ చేయలేకపోయాడని విమర్శించడమే కాదు.. చిత్తు చిత్తుగా అర్వింద్‌ను ఓడగొట్టేందుకు ఇదే మంచి తరుణమని కూడా ప్రజలకు పిలుపునిచ్చాడు. అర్వింద్‌ ఓ గలీజ్ ఎంపీ అని దుయ్యబట్టాడు. నోరు తెరిస్తే ఏం మాట్లాడుతాడో అతనికే తెలియదని, మోడీ పదిహేను లక్షలు ఒక్కొక్కరి ఖాతాల్లో వేస్తాడన్నాడని, ఇక్కడ అర్వింద్‌ 30 లక్షలు వేస్తాడని ఎద్దేవా చేశాడు కేసీఆర్‌.

మోసపోయి.. ఆగమాగమయి ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీని గెలిపించినట్టేనని అన్నాడు. మోడీ హవా మొత్తం పడిపోతూ వస్తున్నదని, వారి అంచనాలు తలకిందులవుతాయని, ఆశలు అడియాశలే అవుతాయన్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే చాన్స్‌ లేదని, ప్రాంతీయ లౌకిక పార్టీలదే కేంద్రంలో హవా ఉంటుందని కేసీఆర్‌ జోస్యం చెప్పాడు.

మోడీని ముప్పుతిప్పలు పెట్టినందుకే తన బిడ్డ కవితను జైలు పాలు చేశారని కేసీఆర్‌ అన్నాడు.అయినా మోడీకి లొంగలేదని, బెదరలేదని,తలవంచేదే లేదన్నాడు. తను బస్సు యాత్ర చేస్తున్నందుకే రేవంత్ రైతుబంధు వేస్తున్నాడని, అదీ ఐదెకరాల లోపే అన్నాడు. ఆరు ఎకరాలపై ఉన్న రైతు ఏం పాపం చేశాడని ప్రశ్నించాడు. దేశాన్ని మోడీ ఆగం చేశాడన్నాడు.

అచ్చేదిన్‌ కాదు జనం సచ్చేదిన్ వచ్చిందని ఎద్దేవా చేశాడు. తను బతికున్నంత వరకు ఇందూరును మరిచిపోలేనని, ఉద్యమ సమయంలో తనకు అండగా నిలిచిందని గుర్తు చేసుకున్నాడు కేసీఆర్‌. బీజేపీకి ఓటేస్తే వచ్చేదేమీ లేదని, ప్రజలు ఓ సారి ఈ విషయంలో పునరాలోచించుకోవాలని కేసీఆర్‌ కోరాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed