దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

వయస్సు పెరిగే కొద్దీ చాదస్తం కూడా పెరుగుతుందంటారు..! సీనియర్లు కూడా అప్పడప్పుడు అల్పంగా ప్రవర్తిస్తారు…!! తమను తాము పెద్దగా ఊహించుకుంటారు. కొన్ని కండిషన్లు పెట్టుకుంటారు. గిరిగీసుకుని కూర్చుంటారు. అలాగే ఉంది మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి వ్యవహారం. ఇదే లాస్ట్‌ ఎన్నిక అంటూ ప్రతిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నాడీయన. తాజాగా చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగానే గెలిచాడు. ఆయన గెలుపుకు తోడు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఇక తనకు మంత్రి పదవి ఖాయంగా భావించాడు. గతంలో మంత్రిగా చేసిన అనుభవం, సీనియర్‌ నేత, సీఎం రేవంత్‌రెడ్డి  బంధువు.. ఇవన్నీ సుదర్శన్‌రెడ్డికి కలిసివచ్చే అంశాలుగా నిలిచాయి. ఇంకేముంది తనకు కేబినెట్‌ బెర్త్‌ ఖరారని తలచాడు. కానీ అవకాశం రాలేదు.

ఇక కేబినెట్ విస్తరణ ఎప్పుడుంటుంది..? తనను కేబినెట్‌లోకి ఎప్పుడు తీసుకుంటారు..? ఏ ఫోర్ట్‌ఫోలియో ఇస్తారు..? అనే విషయాలు గత కొంతకాలంగా సస్పెన్స్‌లో ఉండగా.. ఎవరికి వారే ఊహించుకుంటూ వస్తున్నారు. హోం మినిస్టర్‌ అవడం ఖాయంగా అంతా భావిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ .. ఆయన మొన్న జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో ఎక్కడా కనిపించలేదు. అంతకు ముందు ప్రమాణ స్వీకారానికి పరిమితమై ఆయన.. ఆ తరువాత అటు ఛాయలకు కూడా పోలేదు. ఎందుకబ్బా..? అని ఆరా ఆ పార్టీ శ్రేణులు ఆరా తీయగా.. తనకు మంత్రి పదవి వరించిన తరువాత అసెంబ్లీలో అడుగు పెడతానని అనుకుంటున్నాడట ఈ సీనియర్‌ నేత. అందుకే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టాడట. ఇప్పుడిది బోధన్‌లో ఆ పార్టీ వర్గాల్లోనే తీవ్ర చర్చకు తెరతీసింది.

ఇదిలా ఉంటే సీఎంఆర్‌ఎఫ్‌ కోసం ఎవరైనా వస్తే సార్‌ ఇంకా లెటర్‌ ప్యాడ్‌ తయారు చేయలేదు.. మంత్రి అయినాక రండి అని ఆయనగారి అనుచరులు తిప్పి పంపుతున్నారట. హవ్వా..! ఇదెక్కడి విడ్డూరం… ముక్కున వేలేసుకుంటున్నారట హస్తం నేతలు. సరే, ఇప్పుడు కొత్త ట్విస్ట్‌ ఒకటి చక్కర్లు కొడుతున్నది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలలో ఎవరికి మంత్రి పదవి రాకపోవడంతో రెడ్డి, వెలమ సామాజికవర్గాల్లో ఎవరికియ్యాలో అనే విషయంలో చర్చ జరుగుతున్నదట. ఇప్పటికే రెడ్డిలకు కేబినెట్‌లో సరిపడా మంత్రి పదవులే వచ్చాయట. ఇక కొత్తగా ఇచ్చేవి లేవని, వెలమలకు ఇస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఈ కుల సమీకరణలు మనసార్‌ కన్నకలలను ఏం చేస్తాయో ఏమో..? అనే కొత్త డౌట్లు చక్కర్లు కొడుతున్నాయిప్పుడు.

 

You missed