దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రతినిధి:
గతంలో అర్వింద్ ఆడిన డ్రామా ఇప్పుడు రిపీట్ కానుంది. కానీ అది అర్వింద్‌పైనే రివర్స్ అయ్యేలా ఉంది. గత పార్లమెంటు ఎన్నికల్లో అర్వింద్ పసుపుబోర్డు ఏర్పాటు ప్రయోగాన్ని కీలకంగా వాడుకున్నాడు. బాండు పేపర్ కూడా రాసిచ్చాడు. రైతులను రెచ్చగొట్టాడు. కవిత పసుపు బోర్డు కోసం ఏమీ చేయలేదని, తను గెలిచిన తరువాత ఐదు రోజుల్లో తీసుకొస్తానని నమ్మబలికాడు. దీంతో రైతులంతా నామినేషన్లు వేశారు. కవితను ఉక్కిరిబిక్కిర చేశారు. అర్వింద్‌కు ఇది బాగా కలిసివచ్చింది. ఎంపీగా బంపర్ మెజారిటీతో గెలిచాడు. ఇప్పుడు ఇదే ప్రయోగాన్ని కాంగ్రెస్ అర్వింద్‌పై చేస్తున్నది. పసుపుబోర్డు ఎక్కడ..? అని నిలదీస్తుంది. కవితను ఎలా ఆత్మసంరక్షణలో పడేసి ఓట్లు కాజేసాడో అదే పంథాను కాంగ్రెస్ కూడా అనుసరిస్తున్నది.
ప్రధాని మోడీ పసుపు బోర్డు హామీ ఇచ్చాడు కదా.. ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాయడం కలకలం రేపుతున్నది.దీని వెనుక అర్వింద్‌ను టార్గెట్ చేయడమే లక్ష్యంగా కనిపిస్తున్నది. నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు.. గత ఎంపీ ఎన్నికల్లో కవిత ఓటమికి కారణమై.. తన గెలుపుకు ఇతోధికంగా ఉపయోగపడ్డ పసుపుబోర్డు అస్త్రాన్ని ఇప్పుడు అర్వింద్‌పై ప్రయోగిస్తున్నది కాంగ్రెస్. నిజామాబాద్ పార్లమెంటు సీటును ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఈ అస్త్రాన్ని తీసింది కాంగ్రెస్. కాంగ్రెస్ సర్వేలో నిజామాబాద్‌లో బీజేపీ హవా ఉంది. కానీ అర్వింద్‌కు వ్యక్తిగతంగా బాగాలేదు. బీజేపీలోనే అర్వింద్‌కు వ్యతిరేకంగా పనిచేసే వాళ్లు చాలా మంది తయారయ్యారు.
అర్వింద్‌పై వ్యక్తిగతంగా వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ఇదెలా ఉన్నా.. బీజేపీ, మోడీ హవా మాత్రం కనిపిస్తున్నది. దీంతో ఇది అర్వింద్‌కు మళ్లీ కలిసి వచ్చే అంశంలాగే కాంగ్రెస్ చూస్తున్నది. దీంతో అర్వింద్, బీజేపీపై ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా పసుపుబోర్డు అంశాన్ని తీసుకొస్తున్నది. రైతులకు మరోసారి అర్వింద్ మోసాన్ని, అబద్దపు హామీని గుర్తు చేసి .. అవసరమైతే గతంలో మాదిరిగా అధికంగా నామినేషన్లు వేయించడం.. లేదా రైతులందరినీ అర్వింద్‌కు వ్యతిరేకంగా మోపు చేసి ప్రచారం చేయించడం లాంటి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈ దిశగా ఎత్తులు వేస్తోంది.