కేసీఆర్ సర్కార్‌లో ఉద్యోగులు సకాలంలో జీతాలు తీసుకున్నది లేదు. అలవాటైపోయిందలా. ఇగో ఇప్పటికీ రాలే వారికి జీతాలు. ప్రతీనెల టంచన్‌గా చెల్లించే ఈఎంఐలు, పాలు, రెంట్, ఆటో, స్కూల్ రెంట్లకు నానా తంటాలు పడే దురస్థకు అలవాటు పడిపోయారు ఉద్యోగులు. గత ప్రభుత్వంలో ప్రతీనెల 18 తేదీ నుంచి 25తేదీలోగా జీతాలు వచ్చేవి. అవి కూడా రొటేషన్ సిస్టమ్‌లో. ఈ అవస్థలు ఉద్యోగుల్లో గత సర్కార్‌పై తీవ్ర అసంతృప్తిని తెచ్చిపెట్టాయి. కేసీఆర్ సర్కార్ ఘోర పతనానికి ఇదో కీలక కారణం కూడా. అయితే ఇప్పుడున్న రేవంత్ సర్కార్ దీని నుంచి బయటపడాలని చూస్తున్నది. కొత్త ఏడాది నుంచి ఐదో తారీఖు నుంచి పదో తారీఖులోపలే జీతాలు వేసేలా ప్లాన్ చేస్తన్నది.
దీని కోసం ప్రత్యేకంగా ఈ -కుబేర్ అనే యాప్‌ను డెవలప్ చేస్తన్నది. పనులు పురోగతిలో ఉన్నాయి. జనవరి మాసంలో ఓ యాభై శాతం సక్సెసయినా.. ఫిబ్రవరి నుంచి అందరికీ ఐదో తారీఖులోపు జీతాలు వేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇది చేయాలంటే ప్రధాన ఆటంకం నిధులే. రాష్ట్ర ఖజానా ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఇప్పుడు రైతు బంధు వేయడానికే నిధులు లేవు. మరెలా..? దీని కోసం రెండు ఫార్మూలాలను పరిశీలిస్తున్నారు. అవసరమైతే ఈ రెండింటినీ అమలు చేసైనా సరే ఉద్యోగులకు కొత్త ఏడాది నుంచి జీతాలు త్వరగా చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది రేవంత్ సర్కార్. దాదాపు నలభైకి పైగా ఆదాయం వచ్చే శాఖల్లో నిధులు కొన్ని మిగిలి ఉంటాయి. వందల కోట్లు ఉన్న ఆ నిధులను ఈ జీతాలకు వాడుకునేందుకు ఆయా శాఖల నుంచి అడ్వాన్వులు స్వీకరించడం.. దీంతో పాటు ఒక నెల సర్కార్ ఉద్యోగులకు కావాల్సిన జీతభత్యాల ఎంతో అంత మేర అప్పు తెచ్చి ఇస్తే వచ్చే నెల నుంచి నిధుల అడ్జస్ట్ చేసుకుంటూ పోవచ్చనేది మరో ఆలోచన.
ఈ రెండు అవకాశాలపై సాధ్యసాధ్యాలను పరిశీలించిన సర్కార్.. ఇక కొత్త ఏడాది నుంచి మొదట ఉద్యోగులకు జీతాలు సరైన టైమ్‌కు వేస్తే అదే తొలి విజయంగా భావిస్తోంది. అందుకే దీనిపై సీరియస్‌గా కసరత్తు చేస్తన్నది. కేసీఆర్ సర్కార్‌లో ఉద్యోగుల సిబిల్ స్కోర్ ఘోరంగా దెబ్బతిన్నది. ఎలాంటి రుణాలు తీసుకోకుండా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవేళ ఈ సర్కార్ కూడా ప్రతీనెల ఐదో తారీఖు నుంచి పదో తారీఖు వరకు జీతాలిచ్చేలా వ్యవస్థను సెట్ చేసినా.. గతంలోని రొటేషన్ సిస్టం ఎత్తేయాలనేది ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌గా ఉన్నది. ఇలా చేస్తే దెబ్బతిన్న సిబిల్ స్కోర్ ఆరు నెలల కాలంలో మళ్లీ బాగుపడి.. ఉద్యోగులకు రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించినట్టవుతుంది.