దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
ఎన్నో హామీలు. కేసీఆర్‌కు మించిన, బీఆరెస్‌ను ముంచిన పథకాలు. నీకంటే నేనెక్కువ అని ప్రజల ముందు కాంగ్రెస్ బోలెడు హామీలు. నెరవేరాలంటే, అమలు చేయాలంటే చాల సమయమే పడుతుంది. అవంత ఈజీ కాదని తేలిపోయింది. అయితే అమలు చేయాలంటే మాత్రం కాంగ్రెస్ ఏదో ఒక మెలిక పెడుతుంది కచ్చితంగా. ప్రతీ సర్కార్ పెట్టేదే ఇలాంటి నిబంధనలు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఆ కోవలోకి అంతే. మాజీ సీఎం కేసీఆర్ సన్నవడ్లకు బోనస్ ఇస్తానని చెప్పి రైతులను మోసం చేసిన విషయం మరిచేపోలేదు. ఇప్పుడు అదే టాపిక్ వచ్చింది మళ్లీ. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల లిస్టుల ఉన్నది వడ్లకు ఐదొందల బోనస్ ఇస్తామని. అప్పుడు సన్నవడ్లా, దొడ్డు వడ్లా అనేది లేదు.
ఇప్పుడు మాత్రం సన్నవడ్లకే అని ప్రకటించేసింది కేబినెట్. తరువాత తరువాత మెల్లగా దొడ్డు వడ్లకు ఇస్తారట బోనస్. ఇదన్నమాట కండిషన్. అంటే ఇక ప్రతీ పథకం అమలులో కాంగ్రెస్ కండిషన్స్ అప్లై అంటూ ఇలా కోతలు పెడుతూ వస్తుందన్నమాట. వడ్లతో ప్రారంభమైన ఈ కోతల హామీలు, నిబంధనలు వర్తిస్తాయి అని పెట్టే ఆంక్షలు మొత్తంగా పథకాలను అందరికీ దరిచేయనీవు. అందరూ అర్హులు కారు. అందరికీ ఇచ్చేందుకు ప్రభుత్వం దగ్గర స్తోమతా లేదు. అధికారంలోకి రావాలి అంతే. అందుకే ఆనాడు మ్యానిఫెస్టో అంత బరువుగా ఉంది. ఇప్పుడు ఆ బరువు దించుకునేందుకు ఇలా ఆంక్షల, కండిషన్ల, కోతల హామీల అమలు చేస్తారన్నమాట.
తరువాత వరుసగా అమలు చేసే ఇందిరమ్మ ఇళ్లు, పెంచుతామన్న నాలుగు వేల పింఛన్, మహిళలకు 2,500 ఆసరా, రైతుబంధు పెంపు, రైతుబీమా, కౌలుదారులకు రైతుబంధు, ఉద్యమకారులకు 200 గజాల జాగా… ఇలా చెబుతూ పోతే లిస్టు పెద్దగనే ఉంటుంది. కానీ ఇవన్నీ అందరి దరి చేరవు. అందరికీ అంటే.. అర్హులందరికీ అనే. అనర్హులదాకా కాదు. కేసీఆర్ దళితబంధు టైప్ అమలు చేయడమన్నమాట. కేసీఆర్ కూడా పేరుకు పెద్దగా చెప్పుకుని దేశంలో బీఆరెస్‌కు గొప్పలు ఆపాదించేందుకు ప్రవేశపెట్టిన పథకాల్లో దళితబంధు ఒకటి. అది ఆదిలోనే ఎటూ కాకుండా పోయింది.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రవేశపెట్టే పథకాలూ ఇలాగే ఉంటాయన్నమాట. కొంచెం అలా టచ్ చేసి , కండిషన్లు పెట్టి, కొందరికి ఇచ్చి పెండింగ్‌లో పెట్టి.. ఇచ్చామని చెప్పి.. అమలు చేశామని లిస్టులో భారం తగ్గించుకుని, కాలం గడిపి, ప్రజల ఆశలను ఇంకా ఏదో చేస్తారనే ఆశలపల్లికిలో ఊరేగించి.. ఎన్నికలు దాటవేసి… అలా కాలంతో పాటు ఇదీ కొనసాగుతూనే ఉంటుంది. మనం చూస్తూనే ఉంటాం.