రాష్ట్ర బడ్జెట్‌పై పథకాల భారం ఎలా ఉంటుందో కేసీఆర్‌కు అవగతమైంది. చెప్పినంత సులువు కాదని తేలిపోయింది. కానీ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలకు మించి బీఆరెస్ పథకాలుండాలె కాబట్టి.. తనదైన మార్కు మేనిఫెస్టోను విడుదల చేశాడు కేసీఆర్. కొంచెం కొంచెంగా పెంచుతూ పోయే విధంగా ప్రణాళికలు వేసి.. ఐదేండ్ల వరకు ఇంత ఇస్తాం అని పెద్ద మొత్తంలో కనిపించేలా కనికట్టు ప్రయోగం చేసి అందరినీ నివ్వెరపరిచాడు. అంతా ఆసక్తిగా చూస్తున్నట్టుగానే బీఆరెస్ మేనిఫెస్టోలో పెంపు… అంతకు మించి అమలు చేస్తామనే హామీలు కనిపించాయి. ప్రధానంగా బీఆరెస్‌కు ఆసరా పింఛన్లు పెద్ద ఆసరాగానే చెప్పాలి.
వీటిపై ప్రధానంగా దృష్టి పెట్టాడు కేసీఆర్. ఆసరా పింఛన్‌ను క్రమ క్రమంగా పెంచేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పడిస్తున్న రెండు వేలకు మూడు వేలు చేసి.. ఆ తర్వాత ఏడాదికి ఐదొందల చొప్పున పెంచుతామన్నాడు. దివ్యాంగులకు ఇప్పుడిస్తున్న నాలుగు వేలకు ఐదు వేలు చేసి ప్రతీ ఏడాది మూడొందల చొప్పున పెంచుతామన్నాడు. రైతు బంధు పదివేలకు పన్నెండు వేలు చేసి ప్రతీ ఏడాది కొంచెం కొంచెంగా పెంచుతామన్నాడు.
సౌభాగ్యలక్ష్మీ పథకం కింద పేద మహిళలకు మూడు వేలు ఇస్తామని కాంగ్రెస్ మాదిరిగానే హామీ ఇచ్చాడు. పేదలకు నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్‌ను ఖంగుతినిపించాడు కేసీఆర్. దళితబంధు, బీసీ బంధు ఇవన్నీ అమలు అవుతాయని చెప్పిన కేసీఆర్… డబుల్ బెడ్ రూంల పై మాట్లాడలేదు. గృహ లక్ష్మీ స్కీం మూడు లక్షల జోలికి పోలేదు. కాంగ్రెస్ ఐదు లక్షలిస్తామన్నది. నిరుద్యోగ భృతీని యాది చేయలేదు. ఇది పెండింగ్ పథకంగానే అటకెక్కింది.
రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తామనడం చాలా మందికి నచ్చింది. దొడ్డు బియ్యం తినకుండా అమ్ముకుంటున్నారు. సన్నబియ్యం ఇస్తే పక్కదారి పట్టకుండా బహిరంగ మార్కెట్లో కొనలేని పరిస్థితి ఉన్న సన్నబియ్యాన్ని అందరూ తీసుకుని తినే అవకాశం ఉంది. ఇది పార్టీకి మైలేజీ ఇచ్చేదే. రేషన్ కార్డు కుటుంబాలకు ఐదు లక్షల బీమాను ఇవ్వడమూ ఆర్థికంగా ఆ కుటుంబాలకు రక్షణలాంటిదే.