అంతా ఆమే…. షకీల్‌ లేకున్నా కార్యక్రమాల్లో సతీమణే

కేటీఆర్‌ పిలుపునిచ్చినా స్థానికంగా అందుబాటులో లేని ఎమ్మెల్యే…

రాజకీయ ఆరంగేట్రం కోసమేనా..?

ఆమెనే ఎమ్మెల్యే అభ్యర్థా..? మరి షకీల్‌ పయనం ఎటు..??

బోధన్‌లో ఇదే అంశం సర్వత్రా చర్చ..

బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ స్థానికంగా ఉండటం లేదు. ఇది కొత్త ముచ్చటేం కాదు. ఆయనకు అలవాటే. కానీ ఇది ఎన్నికల సీజన్‌. బీఆరెస్‌ పార్టీ అధిష్టానం అలర్ట్‌గా ఉంది. ఎమ్మెల్యేలకు ఏదో ఒక ప్రోగ్రం ఇచ్చి స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అధికార పక్షం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది. రోడ్డెక్కుతున్నది. ఉద్యమాలు చేస్తున్నది. మొన్నటి వరకు బీజేపీని వదల్లేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. అందుకు తగ్గట్టే రేవంత్‌ వ్యాఖ్యలు కూడా ఉంటున్నాయి. ఈ అవకాశాన్ని పార్టీ అధిష్టానం వదులుకోవడం లేదు. దీంతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అవకాశం దొరికితే చాలు ఏదో ఒక కార్యక్రమానికి,నిరసనలకు పిలుపునిస్తున్నాడు.

మొన్న రేవంత్‌ మూడు గంటల కరెంటు పై మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాడు. అప్పుడూ షకీల్‌ లేడు. ఏదో లోకల్‌ లీడర్లతో పని కానిచ్చేశారు. తాజాగా రేవంత్‌ అప్పటి కరెంటు కాల్పులకు కేసీఆర్ కారణమని చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ పది రోజుల పాటు రైతు సభలు పెట్టి వారితోనే మాట్లాడించాలని పిలుపునిచ్చారు. సోమవారం బోధన్‌లో ఆ కార్యక్రమాలేవీ జరగలేదు. మంగళవారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు కారణంగా చెప్పి వాయిదా వేసుకున్నారు. షకీల్‌ సతీమణి ఆయేషా .. అధికారికంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీలో పాల్గొంటున్నారు. పలు కార్యక్రమాలకూ హాజరవుతున్నారు.

కానీ ఎమ్మెల్యే మాత్రం రావడం లేదు.. సతీమణిని రాజకీయంగా ఎంట్రీ చేయించడానికి ఆమెనే కార్యక్రమాలకు పంపుతున్నారా…? తను బిజినెస్‌ పనుల పేరుతో లోకల్‌లో ఉండటం లేదా.?? ఒకవేళ అవకాశం ఇస్తే బోధన్‌ నుంచి ఎమ్మెల్యేగా నిలబెడతాడా..? మరి షకీల్‌ రాజకీయంగా ఎలాంటి పాత్ర పోషించబోతున్నాడు..? ఇప్పుడు ఇవే అంశాలు బోధన్‌లో రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆయేషా వెల్పేర్‌ ట్రస్ట్‌ పేరుతో ఆమె బుధవారం హెల్త్‌ క్యాంపు కూడా నిర్వహించబోతున్నారు. ఇదంతా రాజకీయంగా ఎంట్రీ కోసమేనంటున్నారు ఆమె సన్నిహితులు.

You missed