సంజయ్‌ను ఆర్మూర్‌కు పంపుదాం…!

అర్బన్‌లో మరొక బీసీకి ఇద్దాం…

అధిష్టానంతో కాంగ్రెస్‌ మంతనాలు…

ఆర్మూర్‌లో ధర్మపురి సంజయ్‌ పోటీ చేస్తే మున్నూరుకాపు ఓట్లు పడతాయనే అంచనా..

ఇద్దరు రెడ్ల మధ్య బీసీ క్యాండిడేట్‌గా సంజయ్‌ బయటపడొచ్చు…

తమ ఆలోచనలను అధిష్టానంతో షేర్‌ చేసుకున్న జిల్లా కాంగ్రెస్‌ నేతలు…

జిల్లా కాంగ్రెస్‌లో మారుతున్న సమీకరణలు… అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి….

డీఎస్‌ తనయుడు ధర్మపురి సంజయ్‌ను అర్బన్‌ నుంచి తప్పించేందుకు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. రేవంత్‌తో అర్బన్‌ నుంచి టికెట్‌ కన్ఫాం చేసుకుని వచ్చాడనే ప్రచారం బాగా ఉంది. డీఎస్‌ కూడా జీవిత చరమాకంలో తన పెద్ద కొడుకును ఎమ్మెల్యేగా చూడాలనే కోరికతో ఉన్నాడు. అందుకే తన పాత పరిచయాలతో సంజయ్‌ను కాంగ్రెస్‌లో చేర్పించి అర్బన్‌ నుంచి టికెట్‌ కోసం సూత్రప్రాయమైన హామీని తీసుకున్నాడు. కానీ సంజయ్‌ పార్టీలోకి రావడం.. అదీ ఇక్కడ అర్బన్‌ నుంచి పోటీ చేయడాన్ని జిల్లా కాంగ్రెస్‌ నేతలెవ్వరికీ ఇష్టం లేదు. ఆది నుంచి ఈ విషయంలో అధిష్టానంతో విభేదిస్తూ వస్తున్నారు.

కానీ రేవంత్‌ మాత్రం డీఎస్‌కు ఇచ్చిన హామీతో ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అర్బన్‌లో మున్నూరుకాపులు ఎక్కువగా ఉండటం, ముస్లిం మైనార్టీల్లో డీఎస్‌కు, అతని తనయుడికి కొంచెం పట్టు ఉండటంతో ఎన్నికల్లో బయటపడతాడనే సమీకరణ మొన్నటి వరకు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అర్బన్‌ను సంజయ్‌కు అప్పగించేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు జిల్లా కాంగ్రెస్‌ నేతలు. దీంతో అధిష్టానం వద్ద ఈ విషయమై సీరియస్‌గా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ అధష్టానం భావిస్తోంది.

అర్బన్‌ కచ్చితంగా బీసీకే ఇవ్వాలనుకుంటున్నారు. కానీ సంజయ్‌కు మాత్రం ఇవ్వొద్దని, అతన్ని అసవరమైతే, తప్పని పరిస్థితుల్లో పోటీ చేయించాలని భావిస్తే ఆర్మూర్‌కు పంపాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. అక్కడ మున్నూరుకాపు ఓట్లు ఎక్కువగా ఉండటం, బీఆరెస్‌, బీజేపీల నుంచి ఇద్దరు రెడ్లే పోటీలో ఉండటంతో బీసీ కార్డు బాగా పనిచేస్తుందనే అంచనాలను అధిష్టానానికి చేరవేశారు. అర్బన్‌లో కన్నా సంజయ్‌ ఆర్మూర్‌లో ఎక్కువ ప్రభావాన్ని చూపుతాడనే అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చినట్టు తెలిసింది. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి మరో బీసీని అకామిడేట్‌ చేద్దామనే ఆలోచనను వారు అధిష్టానం ముందు ఉంచారు. కానీ ఇప్పటి వరకు ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయంలో ఇప్పటికైతే ఇతమిత్థంగా ఎవరూ అభ్యర్థుల పై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. బోధన్‌లో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పోటీ చేస్తాడని మాత్రం కచ్చితంగా చెప్పగలుగుతున్నారు.

నిజామాబాద్‌ రూరల్‌లో భూపతిరెడ్డికే ఎక్కువగా చాన్స్‌ ఉందని ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నా.. ఇక్కడ అరికెల తన పాత టీడీపీ పరిచయాలను ఉపయోగించుకుని కచ్చితంగా టికెట్ తెచ్చుకునే విషయంలో శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాడు. మండవ సపోర్టు అరికెలకు బలంగా ఉంది. అదే అతనికి టికెట్‌ను తెచ్చిపెడుతుందనే ఆశాభావంలో అరికెల ఉన్నాడు. ఈ రెండు నియోజకవర్గాలు తప్ప ఎక్కడా ఇంకా కచ్చితమైన అభిప్రాయాన్ని అభ్యర్థుల విషయంలో వెల్లడించలేకపోతున్నారు స్థానిక నేతలు. బాల్కొండ నుంచి సునీల్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నాడని, అతనికే టికెట్‌ అని ప్రచారం చేస్తున్నా.. దీన్ని ఖండిస్తున్నాయి జిల్లా కాంగ్రెస్‌ వర్గాలు. పార్టీలో చేరినంత మాత్రాన సునీల్‌కు టికెట్‌ ఇస్తారని కాదని, చివరి నిమిషం వరకు ఇది సస్పెన్స్‌లోనే ఉంటుందని చెబుతున్నారు.

 

 

 

You missed