అరికెల వెనుక ఆంధ్ర శక్తులు…

కాంగ్రెస్‌ రూరల్‌ టికెట్‌ నర్సారెడ్డికే…

మండవ మధ్యవర్తిత్వం… చంద్రబాబు దౌత్యం… రేవంత్‌ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌…

ఇంకా ఊహాలోకంలోనే విహరిస్తున్న నగేశ్‌రెడ్డి, డాక్టర్‌ భూపీతి రెడ్డి…

ప్రచారరథంలో ప్రచారం షురూ చేసిన నగేశ్‌ రెడ్డి… ఇంటింటికి తిరిగేందుకు రెడీ అయిన డాక్టర్‌ సాబ్‌….

పుంజుకోని బీజేపీ… కాంగ్రెస్‌లో అరెకెలను స్వీకరించని ఆశావహులు… అంతిమంగా బీఆరెస్‌కే మేలు….

టికెట్ల లొల్లి అప్పుడే స్టార్ట్‌ అయ్యింది. బీఆరెస్ సిట్టింగులకే ఈసారీ టికెట్లిస్తామని చెప్పినా.. ఎవరికి ఇస్తుందో.. చివరకు ఎవరికి ఎసరు పెడుతుందో తెలియని తికమక, ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉండగా… బీజేపీ, కాంగ్రెస్‌లు మాత్రం ఇంకా సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నాయి. అయితే నిజామాబాద్‌ జిల్లా విషయానికి వస్తే బీఆరెస్‌ నుంచి సిట్టింగులకే అనే ప్రచారమే ఉంది. ఎవరిని తప్పిస్తారో తెలియదు. ఇక బీజేపీలో అర్వింద్ హవా నడుస్తుంది. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించే క్రమంలో సక్సెస్‌ అయిన అర్వింద్‌… జిల్లాపై మొత్తం తన పెత్తనాన్ని నిలబెట్టుకునేందుకు రెడీ అయ్యాడు.

ఇప్పుడు ఇదంతా చెప్పడం దేనికంటే.. రూరల్‌ నియోజకవర్గం నుంచి అరికెల నర్సారెడ్డికి టికెట్‌ కన్‌ఫాం అయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మొన్నటి వరకు ఇక్కడి నుంచి డాక్టర్‌ భూపతిరెడ్డికే టికెట్‌ అని ప్రచారం ఉంది. భూపతిరెడ్డిపై కొంత సానుభూతి కూడా ఉండే. కానీ మధ్యలో అర్వింద్‌ను కలవడం.. పార్టీ టికెట్‌ ఆశిస్తే తను ఇప్పుడే చెప్పలేనని చెప్పినట్టు బాహాటంగానే అర్వింద్‌ మీడియాకు చెప్పడంతో భూపతిరెడ్డికి కాంగ్రెస్‌లో పరపతి తగ్గింది.

మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్‌ కాట్‌పల్లి నగేశ్‌ రెడ్డి కూడా రూరల్‌ టికెట్‌ ఆశించాడు. ఏకంగా ప్రచార రథాన్నే రెడీ చేసుకుని గురువారం నియోజకవర్గంలో తిరగడం కూడా స్టార్ట్‌ చేశాడు. తనకే టికెట్‌ ఇవ్వలనే సంకేతం అధిష్టానికి ఇద్దామని. కానీ ఎవరికీ తెలియని, అంతు చిక్కని విషయం,బయట బాహాటంగా చెప్పలేని అంశం ఏంటంటే…. అరికెలకు టికెట్‌ కన్ఫాం చేసేశారు. అదేంటీ.. నిన్న మొన్న పార్టీలో చేరిన అరికెలకు ఎలా టికెట్‌ ఇస్తారు..? అని ఆశ్చర్యపోవడం తథ్యం. తిరుగుబాటు బావుటా చడనున్నాం. సహాయ నిరాకరణా చూడనున్నాం. ఇదంతా తెలిసిందే. కానీ దీని వెనుక ఎవరున్నారు. అరికెలకు రూరల్‌ టికెట్‌ ఎలా సాధ్యమయ్యింది..? రేపు ఇదే ప్రశ్న అందరి నోటా చర్చకు రానుంది.

మం్న డవ వెంకటేశ్వరరావు అరికెలకు టికెట్‌ ఇప్పించుకునే విషయంలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో రేవంత్‌రెడ్డితో మాట్లాడి టికెట్‌ ఇప్పించుకునేలా చేశాడు మండవ. దీంతో ఇప్పటి వరకు ఊహాలోకంలో, భ్రమల్లో తేలియాడుతున్న డాక్టర్ భూపతిరెడ్డి, కిషన్‌ రెడ్డిల ఆశలకు గండిపడినట్టయ్యింది. ఈ విషయం జిల్లా పార్టీ అధినాయకత్వానికి కూడా ఇంకా క్లారిటీ చెప్పలేదు. అతను కూడా సర్వేల ఆధారంగా ఇంకా భూపతిరెడ్డి పేరే చెబుతూ వస్తన్నాడు. కానీ అరికెల మాత్రం తనకు పెద్దల నుంచి వచ్చిన ఆశీర్వాదం, టికెట్ కన్ఫర్మేషన్‌తో జోరు మీద ఉన్నాడు. అందరినీ కలుస్తున్నాడు. వీలైనంత మందిని బీఆరెస్‌ నుంచి గుంజాలని చూస్తున్నాడు. ఇక్కడి నుంచి ఈసారి బాజిరెడ్డి గోవర్దన్‌ కాకుండా అతని తనయుడు బాజిరెడ్డి జగన్‌కు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే తమ గెలుపు సునాయసంగా ఉంటుందని ఎవరికి వారే అంచనాలు వేస్తున్నారు.

కానీ బాజిరెడ్డి గోవర్దన్‌కు ఉన్న ఇమేజ్‌.. బీఆరెస్‌కు ఉన్న తిరుగులేని పట్టు ముందు అరికెలే కాదు.. ఎవరూ నిలబోరనేది ఇప్పుడు సర్వేలు చెబుతున్న నిజాలు. మొత్తానికి నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో టికెట్ల లొల్లి హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు జిల్లాలో కాంగ్రెస్‌ నుంచి బోధన్‌లో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పేరు మాత్రం ఖరారుగా ఉండే. ఇప్పుడు రూరల్‌ లిస్టులో అరికెల పేరు చేరింది. బీజేపీ నుంచి ఆర్మూర్‌ నుంచి రాకేశ్‌ రెడ్డి పేరు మాత్రమే అనధికారంగా ఓకే చెసినట్టు ప్రచారం జరుగుతోంది. అంతకు మించి ఎక్కడా ఎవరూ అభ్యర్థులను ఖరారు చేయలేదు. కానీ ఎన్నికల వేడి మాత్రం రాజుకుంది. రాజకీయం రసకందాయంలో పడింది.

You missed