ఎన్నికలు ఇక వారం పది రోజులున్నాయనగా గుడిల్లో ఓట్లేయించుకోవడ కామన్‌ మన నాయకులు. మీకు కుల సంఘం భవనాలు కావాలా..? మీ కులానికి నిధులు కావాలా..? ఏమడిగినా ఇస్తారు. కానీ అనుమానం. అవతలోడు కూడా ఇస్తే. వాడి దగ్గరా తీసుకుని మాకు ఓట్లేయకపోతే. అందుకు కొంత మంది నాయకులు వాళ్ల కులదైవాల మీద ప్రమాణం చేయించుకుంటారు. హమ్మయ్య ఇక ఆ కులం ఓట్లు మనకే అని ఊరట చెందుతారు. కానీ ఇవన్నీ ఎన్నికలు మరీ సమీపించిన తరుణంలో. ఇప్పుడు ఇందూరులో ఓట్ల కోసం ఒట్ల రాజకీయం షురూ అయ్యింది. నిజామాబాద్‌ జిల్లాలో ఎప్పడూ వార్తల్లో ఉండే ఓ నియోజకవర్గంలో అధికార పార్టీ నేత ఏకంగా కుల సంఘాల నేతలు, ప్రజల చేత ఓట్లేయించుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

పార్లమెంటు ఎన్నికల్లో బాండుపేపర్ బ్రాండ్‌ను తీసుకొచ్చాడు అర్వింద్‌. ప్రజలు గుడ్డిగా నమ్మారు. ఇదో కొత్త ట్రెండ్‌. బహుశా దేశంలోనే ఎవరికీ ఈ ఆలోచన వచ్చి ఉండదు కాబోలు. మన అర్విందుకు వచ్చిందో ఎవరన్నా ఆరితేరిన కురువృద్ధ నేత సలహానో తెలియదు కానీ.. బాండు పేపర్‌ పాలిటిక్స్‌ భలే పనిచేసింది. తనును గెలిపిస్తే వెంటనే పసుపు రైతులు చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డును తీసుకొస్తానని అందులో రాసి దస్తఖత్‌ చేసి వదిలాడు జనాల్లోకి. అదప్పుడు వైరల్‌. అర్వింద్‌ను గెలిపించి పెట్టిన ఓ కీలక ఒట్టు. నేతలే ఒట్టేసుకుని ఇలా జనాలను మోసం చేయడం ఒకత్తయితే… ఇప్పుడు ఆ జనాల చేతే మన నేతలు ఒట్లేయించుకుంటున్నారు.

ఏ ఊకో అన్న.. అబద్దం చెప్తమా..? మీకే ఏస్తమే..? అని ఎంత చెప్పినా.. ఉహూ అంటున్నాడాట ఆ సదరు నేత. నాకెందుకో ఫలానా మల్లయ్య, ఎల్లయ్య మీద నమ్మకం లేదే… జర అంతా కలిసి గుడి మెట్లెక్కరాదుర్రి.. జర ఒట్టేపిచ్చుకుంటే మనకు కూడా అనుమానం ఉండదు కదా… వెంటనే మీరడిగిన పని పూర్తి చేయించే బాధ్యత నాది…. మీ మీదొట్టు.. అని నమ్మబలుతున్నాడట. ఇదండీ సంగతి. పైకి నాకే మెజారిటీ, నేనే గెలుస్తా.. వేల మెజారిటీతో బయటపడతానని ఎంత చెప్పినా… లోపల భయం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటివి చేయకపోతే పాణం నిమ్మళంగా ఉండదు. రాత్రి నిద్రా రాదు. ఓటమి భయం వెంటాడుతుంది. రాజకీయాలంటే మజాకా మరి. ఆర్మూర్‌లోనైతే జీవన్‌ రెడ్డి యాదాద్రి టూర్‌కు శ్రీకారం చుట్టాడు. పుణ్యం పురుషార్థం.. దైవ దర్శనం చేయించాడు మా ఎమ్మెల్యే అని ప్రచారం… రేపు ఓట్లు నాకే అనే గ్యారెంటీ రెండూ రావట్టే. ఎలా ఉంది ఐవిడియా… మరి రాజకీయాల్లో ఆరి తేరాలంటే మాటలే కాదు.. ఇలాంటి చేతలూ ఉండాలి సుమా..!

You missed