బీజేపీ రెండడుగులు వెనక్కి… కాంగ్రెస్‌ మూడడుగులు ముందుకు..

మారుతున్న రాజకీయ సమీకరణాలు..

బీజేపీపై తగ్గుతున్న నమ్మకం… ఊపంతా కాంగ్రెస్‌ వైపు… అందుకు బీఆరెస్‌ తన ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌నే ఎంచుకుంది…

పోటాపోటీగా పథకాలు రచిస్తున్న ఈ రెండు పార్టీలు… తప్పనిసరి అధికారంలోకి రావాలనే యోచన.. ఆచితూచి టికెట్ల పంపిణీ…

అధికార పార్టీలో సిట్టింగులకు ఎసరు… కాంగ్రెస్‌లో టికెట్ల కోసం ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు లైన్లో..

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మార్చేసింది. ఎవరు కాదన్నా.. ఔనన్నా… ఇదే ఇప్పుడు పబ్లిక్‌ టాక్‌గా మారింది. మొన్నటి వరకు బీజేపీ తమకే అధికారం అనుకుంది. ఎంపీ అర్వింద్‌ అయితే తమ పార్టీ టికెట్‌ కోసం కొట్టుకుంటున్నారని కూడా చెప్పుకొచ్చాడు వేదికల మీద. కానీ సీన్ రివర్స్‌. కర్ణాటక ఫలితాల తర్వాత ఒక్కసారిగా సీన్‌ రివర్స్‌ అయ్యింది. బీజేపీపై మొహం మొత్తింది. వ్యతిరేకత పెరిగిందంటూ ఎవరికి వారే ఏ నలుగురు కలిసినా ఇదే ముచ్చట. మీడియా కాదు.. పార్టీలు కాదు.. ప్రజలే బీజేపీ గాలి తీసేస్తున్నారు. కాంగ్రెస్‌ ఊపు పెంచేస్తున్నారు. దీంతో మొన్నటి వరకు కాంగ్రెస్‌కు అభ్యర్థులే కరువు అనే స్థితి నుంచి నేనంటే నేను అని పోటీ పడే రేంజ్‌కు చేరుకుంది ఆ పార్టీ పరిస్థితి. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితను అరెస్టు చేస్తున్నంత బిల్డప్ ఇచ్చింది కేంద్రం. కానీ కొండంత రాగం తీసి .. అన్నట్టుగా దీన్నీ అటకెక్కించింది.

అంటే కవిత తప్పు చేయలేదని ఒప్పుకోవాలి లేదా .. తామే కాంప్రమైజ్‌ అయ్యామని అంగీకరించాలి. ఈ రెండింటినీ బీజేపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో బయట ప్రజల్లోనే కాదు స్వపక్షంలో కూడా పార్టీ క్రేజ్‌ తగ్గుతున్నది. ఊపు పడిపోతున్నది. గాలి వ్యతిరేకంగా వీస్తున్నది. అదే సమయంలో కాంగ్రెస్‌ పుంజుకుంటున్నది. మొన్నటి వరకు ఇరవై స్థానాలు కూడా రావని, వచ్చినా ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిలకడగా నిలబడరని అమ్ముడుపోతారనే అపప్రద కాంగ్రెస్‌కు ఉండేది.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అధికారం చేజిక్కంచుకునే మ్యాజిక్‌ ఫిగర్‌ సొంతం చేసుకున్నా ఆశ్చర్యం లేదని స్థితికి ఎదగింది. దీంతో ఇక పార్టీ ఫిరాయింపులకు చాన్స్‌ ఎక్కడ ఉంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అందుకే ఇప్పుడు బీఆరెస్‌ పార్టీ బీజేపీని వదిలేసింది. కాంగ్రెస్‌పై గురి పెట్టింది. వాస్తవంగా కాంగ్రెస్‌ పుంజుకోవడం బీఆరెస్‌కు అనుకూల అంశమే. ఓట్ల చీలికల మధ్య చాలా చోట్ల బలపడి గెలిచేది బీఆరెస్సే. అందుకే నేను కొట్టినట్టు చేస్తాను.. నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అన్నచందంగానే కాంగ్రెస్ బలోపేతం కావాలనే కోరిక మదిలో, బయట అధినేత కేసీఆర్‌కు ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్‌ను బొంద పెట్టింది కేసీఆరే. కానీ బీజేపీకి ఇది ఆయువుపట్టుగా మారి బీఆరెస్‌కు కొరకరాని కొయ్యగా తయారయ్యింది. తను చేసిన తప్పు తెలుసుకున్న కేసీఆర్‌కు.. కర్ణాటక ఫలితాలు కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు.. కాంగ్రెస్‌ బలం పుంజుకోవడం సంతోషాన్నిచ్చింది. ఎన్నికల సమాయానికికి దీనికి మరింత ఊపు తెస్తాడు కేసీఆర్‌.

You missed