బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ మార్పు ఆ పార్టీని మరింత ప్రశ్నార్థకంలో పడేసింది. ఇప్పటికే కర్ణాటక ఫలితాల హవాతో కాంగ్రెస్‌కు మంచి వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో ఈ మార్పులు బీజేపీలో కొత్తగా ఊపు తెచ్చేవి కాకపోగా.. మరింత దిగజార్చేవిగా ఉన్నవి. పార్టీ అధ్యక్ష బాధ్యతలు కిషన్‌రెడ్డికి ఇవ్వడం పట్ల చాలా మంది నేతలకు మింగుడు పడలేదు. బండి సంజయ్‌ దూకుడు మాస్‌కు బాగా దగ్గర చేసింది. యూత్‌ను అట్రాక్ట్‌ చేసింది. పార్టీని వీడి పోవాలనే నేతలెందరినో ఆయన బుజ్జగింపు ఆపుకున్నాడు.

భవిష్యత్ మనదేనని .. సరైన న్యాయం చేస్తానని మాటిస్తూ అందరినీ కాపాడుకుంటూ వచ్చాడు. ఎప్పటి నుంచో బండి సంజయ్‌ మార్పుపై కథనాలు వస్తూనే ఉన్నాయి. కానీ బీసీ మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన బండి సంజయ్‌ను మార్చితే బీసీల్లో మరింత వ్యతిరేకత పార్టీ పట్ల ఏర్పడుతుందని అధిష్టానం భావించింది. దీంతో ఆయన పదవి జోలికి వెళ్లలేదు. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌తో కూడా ఈ మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. వాస్తవంగా బండికి పార్టీ రాష్ట్ర పగ్గాలు ఇవ్వడం చాలా గొప్ప విషయం.

దాన్ని అంతో ఇంతో నిలుపుకుంటూ వచ్చాడు బండి. మాటలో స్పష్టత లేకున్నా దూకుడుగా ప్రవర్తించి.. సమయానుసారం, సందర్బానుసారం తనదైన శైలిలో స్పందించడం, పార్టీ కార్యకర్తలను, నాయకులను కాపాడుకోవడంలో ఆయనకు మంచి పేరుంది. కానీ కిషన్‌ రెడ్డిని ఓ మేథావి వర్గంగా చూస్తారు. ఆయన ప్రెస్‌మీట్లకే పరిమితమవుతాడే తప్ప రాష్ట్ర వ్యాప్తంగాఉన్న పార్టీ పట్ల ఆయనకు సరైన అవగాహన,అనుభవం లేదనే చెప్పాలి. ఇప్పటికే బీసీలు పార్టీకి దూరమవుతున్నారనే అపవాదును మూటగట్టుకున్న బీజేపీ బండిని తొలగించి మరింతగా బీసీలతో గ్యాప్‌ పెంచుకున్నది. మరోవైపు కిషన్‌రెడ్డి నియామకం పట్ల చినజీయర్‌ చక్రంతిప్పారనే ప్రచారం చాలా సర్కిళ్లలో జోరందుకున్నది. బీఆరెస్‌, బీజేపీకి మధ్య ఇప్పటికే పెరిగి ఉన్న అగాథం..ఇప్పుడు కిషన్‌ రెడ్డి సారథ్యంలో సంబంధాలు మెరుగుపడతాయనే అభిప్రాయాన్నీ ఆ పార్టీ నేతలే వ్యక్తం చేయడం గమనార్హం.

You missed