మహా తీర్థయాత్రకు కేసీఆర్ బలగం… రేపు ప్రగతి భవన్ నుంచి ప్రయాణం..
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మహారాష్ట్ర పండరీపూర్, తుల్జాభవానీ దర్శనం..
బీఆరెస్ విస్తరణలో భాగం… ఎన్నికలకు ముందు దైవాశీస్సులు….
హైదరాబాద్- వాస్తవం ప్రతినిధి: బస్సెనక బస్సు కట్టి… కేసీఆర్ మహారాష్ట్రకు తన బలగంతో దైవదర్శనానికి బయలుదేరి వెళ్లనున్నారు. ఈనెల 27 న మహారాష్ట్రలోని పండరీపూర్‌లోని నిర్మలా విఠలేశ్వరుడి దర్శనంతో పాటు , తుల్జాభవాని దర్శనం చేసుకోనున్నారు. బీఆరెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసి సోమవారం ప్రగతి భవన్ నుంచి ఉదయం బయలుదేరి వెళ్లనున్నారు. అధినేత కేసీఆర్ రథసారథిలా ముందు బస్సులో బయలుదేరనుండగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మహారాష్ట్రలోని పండరీపూర్ విఠలేశ్వర్ ( విఠల్ రుక్ముని, పాండురంగా), తుల్జాభవానీ దైవదర్శనం చేసుకోనున్నారు. బీఆరెస్ విస్తరణంలో భాగంగా కేసీఆర్ మహారాష్ట్రపై గురి పెట్టారు. ఇక్కడ పార్టీ బలోపేతంపై ఆయన ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. సోలాపూర్‌లో తెలంగాణకు చెందిన పద్మశాలీలతో పాటు చాలా మంది మన వాళ్లు అక్కడ దాదాపు రెండు లక్షల మంది వరకు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. బీఆరెస్ పార్టీలో భారీ వలసలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తన బలగంతో మహారాష్ట్ర టూర్‌ను తన బలగంతో తీర్థయాత్రలతో ప్రారంభించడం ద్వారా శుభారంభంగా భావిస్తున్నారాయన. త్వరలో టికెట్లను కూడా ప్రకటిస్తారనే ఊహాగానాలు, ప్రచారాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఈ తీర్థయాత్రల ద్వారా దైవాశీస్సులు తీసుకుని, మంచి ముహూర్తం చూసుకుని ఒకేసారి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది.
ఇదీ మహారాష్ట్ర టూర్ షెడ్యూల్…
సోమవారం ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా కేసీఆర్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో కలిసి బస్సులు, కార్లలో బయలుదేరి వెళ్తారు.
మధ్యామ్నం ఒంటిగంటకు మహారాష్ట్రలోని ఉమర్గకు చేరుకుంటారు.. లంచ్ తర్వాత
మధ్యాహ్నం 4.30 గంటలకు ఉమర్గ నుంచి బయలుదేరి 6 గంటలకు సోలాపూర్ చేరుకుంటారు. అక్కడే నైట్ బస చేస్తారు.
మంగళవారం 27న ఉదయం 8 గంటలకు సోలాపూర్ నుంచి బయలుదేరి 9.30 గంటలకు పండరీపూర్ చేరుకుంటారు. అక్కడే దైవదర్శనం చేసుకుని పది గంటలకు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు.
అక్కడి నుంచి పండరీపూర్ తాలూక సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సర్కోలి నుంచి బయలుదేరి తుల్జాపూర్‌లోని ధారశివ్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడ తుల్జాభవానీ మాతా దర్శనం చేసుకుంటారు. 4.30 గంటలకు తుల్జాపూర్ నుంచి బయలుదేరి రాత్రి పదిగంటలకు హైదరాబాద్ ప్రగతిభవన్‌కు చేరుకుంటారు.