రాజకీయ నాయకుడవ్వాలనుకుంటున్నారా….
ప్రజలకు సేవ చేసి చిరస్థాయిలో నిలిచిపోవాలన్న కోరిక ఉందా ?
నలుగురికి మంచి చేయాలంటే రాజకీయం మేలనుకుంటున్నారా…
లేదా….
పొలిటికల్ లీడర్ అయ్యి సంపాదించాలనుకుంటున్నారా….
ఓ విజ్ఞాని మేలుకో…. ఒకప్పుడు రాజకీయ నాయకుడికి విలువ ఉండేది. గౌరవం ఉండేది. నాడు ఓటేసి వ్యక్తి ఆ నాయకుడి సేవా గుణాన్ని చూసి ఓటేసేవారు. నలుగురికి మంచి చేస్తారన్న నమ్మకంతో గెలిపించే వారు. ఆ వ్యక్తి వద్ద డబ్బు లేకున్నా అతని సేవా గుణాన్ని చూసి ఓటేసే వారు. గ్రామాల్లో ఈ సంప్రదాయం ఎక్కువగా ఉండేది. నేటికి అక్కడక్కడా కొన్ని గ్రామాల్లో ఇలా ఉంది. కానీ మారుతున్న ప్రజల జీవన శైలి, టెక్నాలజీ ప్రభావం, మనుషుల్లో పెరిగిపోయిన స్వార్థం… అప్పటికప్పుడు కలిగే ప్రయోజనం…. ఇలా రకరకాల కారణాలుండొచ్చు. అయితే నేటి రాజకీయాలు పూర్తిగా భిన్నమైపోయాయి. డబ్బుతో ముడిపడిపోయాయి. ఒక సామాన్యుడు నేటి రోజుల్లో రాజకీయంలో రాణించటం కష్టమైపోయింది. ధనం ఉంటేనే లీడర్… డబ్బులు వేదజల్లితేనే… ఓట్లు రాలుతాయి. రాను రాను దేశంలో అక్షరాస్యత పెరుగుతున్నా…. ప్రజల్లో మార్పు రావటం లేదు. ఓటు వేసే సమయంలో అవగాహన కొరవడుతోంది. ఆ ఓటు విలువను మరిచిపోతున్నారు.
ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో రాణించాలన్న ఆశ ఉంటుంది. వేరే ఏ రంగంలో రాణించాలన్నా టాలెంట్ ఉండాలి. కానీ రాజకీయంలో రాణించాలంటే… డబ్బే ఉండాలి. సామాన్యుడికి రాజకీయం చేయాలన్న కోరిక నేటి రోజుల్లో పుట్టక పోవటమే మేలు.. ఎందుకంటే అతని వద్ద డబ్బు లేకుంటే. అంతే సంగతులు.. ప్రస్తుతం బడా భూస్వాములు, వ్యాపార వేత్తలు, డబ్బు బాగా ఉన్న వారే పాలిటిక్స్ లోకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజకీయ పార్టీలు కూడా అలాంటి వారి కోసమే చూస్తున్నాయి. ఎవరు ఎక్కువ ఖర్చు చేస్తే… వారికే టికెట్లు ఇస్తున్నాయి. రాజకీయాల్లో తలపండిన వారు… చాలా కాలం నుంచి పార్టీలో ఉంది సీనియారిటీ ఉండి కొంత డబ్బు కలిగి ఉన్న వారి సంగతి వేరు…. కానీ ఓ సామాన్యుడు సమాజం మీద అవగాహన కలిగిఉండి… మంచి పాలన అందివ్వాలి అనుకునే వారికి ఇక్కడ చోటు లేదు. మరోవైపు రాజకీయంలోకి వచ్చి డబ్బు సంపాదించుకోవాలనుకునే వారూ నష్టపోవాల్సిoదే….
నేటి రాజకీయాలు ప్రజలను మభ్య పెట్టే విధంగా మారాయి. సామాన్యుల వీక్ నెస్ ను క్యాష్ చేసుకుని …. డబ్బుతో ఎర వేస్తూ…. తమ లక్ష్యం చేరుకుంటున్నారు. అనేక ఉచితాలు ప్రకటిస్తూ… గారడి చేస్తున్నారు.
ప్రజలకు సుపరిపాలన అందించే రాజకీయ పార్టీలు ఎక్కడున్నాయి. అసలు ప్రజలకు ఎలాంటి అవసరాలున్నాయి.? వారికి ఏం చేస్తే… సంతోషంగా ఉంటారు.? నేటి రోజుల్లో సామాన్య, మధ్యతరగతి జీవుల వార్షిక ఆదాయం ఎలా ఉంది? వారికి ఏం చేస్తే వారి ఆదాయం పెరుగుతుంది? ఇలా ఆలోచించే నేతలు ఎంత మంది ఉన్నారు. అలా ఉన్నా… అది సాధ్యపడుతుందా…? సామాన్య , మధ్య తరగతి వారు సంపాదించిన డబ్బు 70 శాతం విద్యా, వైద్యం కోసం వెచ్చించాల్సి వస్తోంది. ఒక్కటో తరగతి చిన్నారికి ప్రయివేటు బడుల్లో వేలల్లో ఫీజులు… 5వ తరగతి దాటితే ఇక లక్షల్లోనే…. ఇంటర్, ఇంజినీరింగ్ ఇలా పై చదువులు మంచి కార్పొరేట్ కాలేజీల్లో చదివించాలంటే అంతే సంగతులు.. చిన్న జబ్బోచ్చి ప్రయివేట్ ఆస్పత్రికి వెళితే… టెస్టుల పేరుతో దగా చేస్తున్నారు. రోగం వస్తే… సామాన్యుడు అప్పుల పాలవుతున్నారు. ఓ ప్రధాన పార్టీల నాయకులారా… మీ రాజకీయాలు మీకోసం కాకుండా సామాన్యుల కోసం చేయండి. విద్యా, వైద్యాన్ని ఉచితంగా ఇవ్వండి. అడగని వాటికి అవసరం లేని వాటికి ఇస్తూ… ప్రజలను సోమరులు చేస్తున్నారే తప్ప వారికి కలిగే ప్రయోజనం ఏమున్నది. నేటి రోజుల్లో అధికంగా ఖర్చవుతున్నది విద్యా , వైద్యం మీదే…. ఇది కట్టడి చేస్తే సామాన్యుడి ఆదాయం పెరుగుతుంది. వారి చేతుల్లో డబ్బు పుష్కలంగా ఉంటుంది. మార్పుకోసం ప్రయత్నంగా ఇది చెప్పాల్సి వచ్చింది.
ఇక ఇప్పుడు రాజకీయం డబ్బుతో ముడిపడిన అంశం. పైన అనుకున్నది రాజకీయ పార్టీలు అమలు చేస్తే మార్పు తధ్యం. కానీ అది అసాధ్యం. రాజకీయ పార్టీలకు ఎవరి లెక్కలు వారికున్నాయి. అందుకే డబ్బున్న వారే నేడు రాజకీయాల్లో రాణిస్తున్నారు. వారి ఆస్తులు గుట్టలు గుట్టలుగా పెంచుకుంటున్నారు. విద్యా సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, దండిగా డబ్బులున్నోల్లే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. వారికే రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. వారే నేతలుగా మారుతున్నారు. అలాంటి వారికి ప్రజా సమస్యలు ఏం తెలుస్తాయి. సామాన్యుడి గోస ఎలా అర్థమవుతుoది.
ఇక రానున్న ఎన్నికల్లో డబ్బులు ఏరులైపారాల్సిందే…. ఓటుకు వెయ్యి కాదు 5 వేలు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిందేమి ఉండదు. ఎందుకంటే ఓటర్ల మైండ్ సెట్ ను ఆ విధంగా మార్చేశారు నేటి నేతలు. అందుకే సామాన్యుడు రాజకీయాల్లో రాణించాలనుకోవటం, డబ్బు సంపాదించాలనుకోవటం వారిని వారు మోసం చేసుకున్నట్లే….
వ్యవస్థను మార్చటం ఎవరి వల్లా కాదు అనుకునే బ్రమలోంచి బయటపడే వరకు ధన రాజకీయానిదే పై చేయి. చదువుకున్న ప్రతి ఒక్కరు విజ్ఞతగా ఆలోచించిన రోజే… రాజకీయాల్లో మార్పు వస్తుంది. అది ఢిల్లీలో నిరూపితమైoది.
లెండి, మేలుకోండి, ఆలోచించండి, ఓటు అనే ఆయుధానికి పదును పెట్టండి. స్వార్ధ రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పండి. అర్ధ బలం ఉన్న రాజకీయ నాయకులకు ఓటుతో సమాధానం చెప్పండి. మార్పునకు నాంది పలకండి.
పీఆర్‌ఎస్
సీనియర్ జర్నలిస్టు…