దశాబ్ది ఉత్సవాలపై ఉద్యోగుల నిరసనాస్త్రం…

ఆత్మగౌవరాన్ని ప్రభుత్వం గుర్తించలేదని ఆగ్రహం…

ఉత్సవాల ముగింపు తర్వాత ప్రత్యేకంగా ఓ సమావేశం…

ఉద్యమంలో తమ గురుతులను యాది చేసుకునేందుకు తమకు తామే ఓ వేదిక…

సర్కార్‌పై ఉన్న ఆగ్రహం…. దశాబ్ది ఉత్సవాలతో మరింత రెట్టింపు…

పెరుగుతున్న గ్యాప్‌… పూడ్చేందుకు ప్రయత్నించని ప్రభుత్వ పెద్దలు..

దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న వేడుకలు కొన్ని సెక్షన్లకు ఆగ్రహం తెప్పించాయి. అందులో ఉద్యమకారులున్నారు. ఉద్యోగులున్నారు. ప్రజలూ ఉన్నారు. అవును… అంతలా ఏమి సాధించాలని సంబురాలు చేసుకుంటున్నారని ప్రతిపక్షాలే కాదు.. ప్రజలూ అడుగుతున్నారు. రైతుబంధు రాని నిరుపేదలకు ఏం చేశారు..? అసలు ఇండ్లే దిక్కులేని వారి కోసం ఏం పట్టించుకున్నారు. డబుల్ బెడ్‌ రూం ఇండ్ల కోసం కండ్లు కాయలు కాచేలా చూసినా ఇవ్వలేదే..! ఐదు లక్షలన్నారు జాగా ఉంటే కట్టుకోవడానికి. అది మూడు లక్షలకు చేశారు. అదీ దిక్కులేదు. మరి ఆ జాగా కూడా లేనోళ్లకు కొత్తగా ఇళ్ల స్థలాలంటున్నారు… అసలు గవర్నమెంట్‌ జాగాలున్నాయా..? ఇది అయ్యేదేనా…? దళితబంధు ఎంతమందికిచ్చారు..? బీఆరెస్‌ పేరుతో దేశానికి ఏదో చెప్పుకోండి మీ ఇష్టం.. కానీ మేమంతా మాత్రం మీరనుకున్నంత సంతృప్తిగా లేం. ఆ మాటకొస్తే దరిద్రంలోనే ఉన్నాం.

ఆత్మగౌరవం కోసం పాకులాడుతున్నాం. మళ్లీ పోరాడేందుకూ సిద్దమవుతున్నాం. ఇవీ ప్రభుత్వం మీద పరోక్ష, ప్రత్యక్ష అసంతృప్తి సెగలు. దశాబ్ది వేడుకలు దీనికి వేదికయ్యాయి. ప్రజల మాటటుంచండి… ప్రధానంగా ప్రభుత్వంలో కీలకభూమిక పోషించే ఉద్యోగులు మనసులు రగిలిపోతున్నాయి. ఎందుకో తెలుసా…? ఆరు దశాబ్దాల పోరాటంలో మా పాత్ర ఎనలేనిది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత చేసుకుంటున్న దశాబ్ది ఉత్సవాల్లో మా ఉనికేది..? మాకు గుర్తింపేది..? మా ఉద్యమజాడల గురుతులు ఏవి..? ఓ రోజు మాకు కేటాయించొద్దా.?? మాకు కొన్ని శాలువాలు కప్పి గౌరవించేందుకు కూడా సమయం లేదా..? మాకు అంత సీన్‌ లేదని యూజ్‌ అండ్ త్రోగా చూస్తున్నారా..? ఇలా ఎన్నో ఆగ్రహావేశాలు.

చర్చోపచర్చలు. ఏ ఇద్దరు ఉద్యోగులు కలిసినా ఇదే ముచ్చట. మరేం చేద్దాం. ఎవరికి చెబుతాం..? ఎవరికి చెప్పినా.. మన గోస వినేనాథుడు లేడు. పెద్ద సారు ఇప్పుడు దేశం మీద ఫోకస్‌ పెట్టాడు. చిన్నసారు మాట వినేవారెవ్వరూ. కవితమ్మకు చెబితే లాభం లేదు. ఇలా వరుసగా వేడుకలు చూస్తూ చూస్తూ…. ఆ వేడుకల్లో ఆంధ్ర అధికారులు.. ఉద్యమంతో సంబంధం లేని ఉద్యోగులు.. తెలంగాణ ఉద్యమం గురించి స్పీచ్‌లు ఇస్తుంటూ వారి రక్తం మరిగిపోతుంది. అంతే..చివరకు డిసైడ్‌ అయ్యిందేమిటంటే…. మన ఆత్మగౌరవం కోసం మనమే ఓ వేదిక ఏర్పాటు చేసుకుందాం. ఏ కార్యక్రమం నిర్వహిద్దాం. ఈ వేడుకలు ముగియగానే తరువాతి రోజు మనదే ఉంటుంది. మనం కలుద్దాం. మన యాది మనం చెప్పుకుందాం. పులి తన చరిత్ర తాను చెప్పుకోకపోతే.. వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుంది..? మనం చరిత్రహీనులుగా ఎందుకు మిగలాలి..? ఇప్పుడు ఇదీ వారి ఘోష… ఆగ్రహావేశం. ధర్మాగ్రహం. అందుకే ఈనెల 22న జిల్లాల వారీగా ఎవరికి వారు ఉద్యోగులు ఉద్యోగుల ఆత్మగౌరవ కలయిక పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంతేమరి… తమ ఉనికే ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు మౌనాన్నే ఆశ్రయించాలనుకుంటే… ఉనికిలోకి లేకుండా పోతాం… ఇదే చేస్తున్నారిప్పుడు ఉద్యోగులు…

 

You missed