మొన్నటి వరకు ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ అనేది తేలలేదు. ఆ మాటకొస్తే ఇంకా కూడా దీనిపై క్లారిటీ రాలేదు. బీజేపీ, కాంగ్రెస్‌లు సమయం కోసం చూస్తున్నాయి. ఎవరెవరిని లాగాలో గాలం వేస్తున్నాయి. బీఆరెస్‌ మాత్రం సిట్టింగులకే సీట్లు అని ప్రకటించడంతో ఎవరికి వారే పోటీకి సిద్దం అయ్యారు. కానీ కొంత మందికి సీట్లు రావడం కష్టమే అని కూడా పరోక్ష సిగ్నల్‌ ఇచ్చాడు కేసీఆర్‌. దీంతో ఎవరికి వారే లోలోన భయంతో ఉన్న బయటకు మాత్రం టికెట్‌ మాకే, పోటీలో నేనే అంటూ ప్రచారం మొదలుపెట్టినంత పనిచేస్తున్నారు. కానీ ప్రతిపక్షాల నుంచి ఎవరు తమ ప్రత్యర్థి అనేది తేలక తలగోక్కుంటున్నారు.

ఆర్మూర్‌లో మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ బీజేపీ నుంచి ప్రత్యర్థి ఎవరో క్లారిటీ వచ్చేసింది. వాస్తవంగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ముందే అభ్యర్థులను డిసైడ్‌ చేసే సంస్కృతి లేదు. పరోక్షంగా పక్కా వీరికే అని మాత్రం కొన్ని స్థానాల్లో చెప్పగలుగుతారు. కానీ అధిష్టానం ప్రకటించే వరకు అధికారికంగా చెప్పుకుని జనాల్లోకి పోయే సీన్‌ ఉండదు. కానీ ఆర్మూర్‌లో తన రూట్‌కు భిన్నంగా బీజేపీ ముందే అభ్యర్థిని ప్రకటించేసింది.

పైడి రాకేశ్‌రెడ్డి మొన్ననే పార్టీలో చేరాడు. ఈరోజు భారీ ర్యాలీ తీశారు ఆర్మూర్‌ నియోజకవర్గంలో. ఇక్కడ ప్రధానంగా స్పీచుల్లో పోచమ్మ ముందు పోటేలు కట్టేసినట్టే అని సామెత రిపీట్‌ అయ్యింది. డిస్కషన్‌కు వచ్చింది. దీనికి కారణం మొన్న కవిత మాక్లూర్‌ బీఆరెస్‌ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో జీవన్‌రెడ్డి గురించి మాట్లాడుతూ చెప్పిన సామెత ఇది. ఆమె ఉద్దేశం.. జీవన్‌ రెడ్డి మీద ఎవరు పోటీకి నిలిచినా పోశమ్మ ముందు పొట్టేలును కట్టేసినట్టే.. అంటే బలైనట్టే.. ఓడినట్టేనని అర్థం. ఇప్పుడు ఇది బీజేపీ నాయకులు కూడా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తాము పొట్టేల్లము కాబోమంటున్నారు. కొదమసింహాలవుతామంటూ కొత్తభాష్యమెత్తుకున్నారు. ఇప్పుడు ఆర్మూర్‌ నియోజవకర్గంలో ఇదే హాట్‌ టాపిక్‌. ఎవరు పొట్టేలు..? ఎవరు పోశమ్మ..? ఎన్నికలెప్పుడో గానీ పోశమ్మ.. పొట్టేలు.. ఓ ఆర్మూర్‌ …రాజకీయ కథ రసకందాయంలో పడింది. మున్ముందు మరెన్ని సవాళ్లు, ప్రతిసవాళ్లు నడుస్తాయో.. రాష్ట్రంలోనే ఇప్పుడు ఆర్మూర్‌ రాజకీయం హాట్‌ టాపిక్‌ అయ్యింది.

 

 

 

 

 

You missed