తెలంగాణ యూనివర్సిటీ పరువును బజారుకీడ్చి రచ్చ రచ్చ చేసిన వైస్ ఛాన్స్‌లర్ పై సర్కార్ కొరఢా ఝుళిపించింది. మొన్న ఎమ్మెల్సీ కవిత ఈ విషయంపై ప్రత్యేకంగా కొంత మంది ఈసీ మెంబర్లతో, విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. పరిస్థితులు చక్కదిద్దుతానని ఆమె మాటిచ్చారు. సరిగ్గా వారం తిరగకముందే ఈసీ తీర్మానాల్లో కీలకమైన ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్‌మెంట్ టీములు మెరుపు దాడులు చేశాయి. కీలకమైన ఫైళ్లు స్వాధీనం చేసుకున్నాయి. హార్డ్ డిస్కులను స్వాధీన పరుచుకున్నాయి. ఈ టీములు వచ్చాయని తెలిసిన వెంటనే వీసీ తన పర్సనల్ సెక్రటరీతో పరారయ్యాడు.
దీంతో అధికార టీములు సినీ ఫక్కీలో వీసీ కారును వెంబడించి మరీ కామారెడ్డి చేరువలో పట్టుకున్నాయి. అతని కారులో ఉన్న విలువైన ఫైళ్లను స్వాధీన పరుచుకున్నాయి. వీసీని తిరిగి వర్సిటీకి రప్పించి కూర్చోబెట్టారు. ఈ మెరుపు దాడులు జిల్లా వ్యాప్తంగానే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఎట్టకేలకు వీసీ ఆగడాలకు, పరువు తీసే చర్యలకు ఇక ముకుతాడు పడినట్టేనని భావిస్తున్నంతా. గతంలో ఎక్కడా లేని విధంగా వీసీ రవీందర్ గుప్తా వర్సిటీ పరువును గంగలో కలిపాడు. అక్రమాలకు పాల్పడ్డాడు. ఎవరైనా ప్రశ్నిస్తే తాను ప్రజాప్రతినిధులకు మూడు కోట్లు చెల్లించి వచ్చానంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగడం పరిపాటిగా మారింది.
దీంతో ఈ అంశం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. రాజకీయ జోక్యం లేకుండా ప్రశాంత వాతావారణంలో నడవాల్సిన వర్సిటీని అక్రమాలకు ఆలవాలంగా మార్చి కంపు కంపు చేసి వదిలేశాడు వీసీ. దీంతో ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవిత రంగంలోకి దిగారు. సీఎం కేసీఆర్‌కు ఇక్కడ విషయాలన్నీ చెప్పారు. ఇవాళ ఆమె సీఎంతో చాలా సేపు ఉన్నారు. కీలక విషయాలపై చర్చించారు. ఇందులో వీసీ టాపిక్ కూడా వచ్చింది. దీనిపై డిస్కషన్ జరిగిన కొన్ని గంటలకే ఏసీబీ, విజిలెన్స్ రంగంలోకి దిగడం గమనార్హం. ఇక వీసీ పీడ విరడైనట్టేనని భావిస్తున్నారంతా.