ఇతనో నిత్యవిద్యార్థి…

రాజకీయాల్లో బిజీబిజీ…. పుస్తక పఠనమంటే ఎంతో క్రేజీ..

ఇప్పటికీ ఖాళీ సమయాల్లో నవలలు చదవడం జగన్ హాబీ…

తెలుగు, ఇంగ్లీష్‌ సాహిత్యంపై పట్టు… కాలేజీ రోజుల నుంచి అలవాటును అలా కంటిన్యూ చేస్తున్న యువనేత..

అసమర్థుని జీవయాత్ర… అన్ని తరాలకు ఎప్పటికీ మార్గదర్శకమేనని సమీక్ష..

కేశవరెడ్డి రచనా శైలంటే ఇష్టం…

సాహిత్యలోకానికి దూరమవుతున్న నేటి యువతరానికి ఈ యువనేత ఆదర్శప్రాయమే…

 

వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌:

సెల్‌ఫోన్‌ యుగంలో పుస్తకపఠనం ఓ చెరిగిపోయిన చేదు జ్ఞాపకమే అయింది. సాహిత్యప్రియులు తగ్గుతున్నారు. ఓటీటీలో కొత్త సినిమాలు వదలకుండా అన్ని చూసేస్తారు. కానీ నవలలు, కథలు చదవడం బోరు. ఒక తరం బాలమిత్ర, చందమామ కథలతో మధుర జ్ఞాపకాలను, నైతికత, విలువలను ఒంటబట్టించుకుంటూ పెరిగింది. తెలుగు భాష పట్టూ సాధించింది. కానీ ఇప్పుడా రోజులు పోయాయి. పుస్తకాలు డిస్కౌంట్‌లలో అమ్ముతామని మార్కెట్‌లో తిరిగినా ఎవరూ వాటిని చూడటం లేదు. చదవటం లేదు. ఇప్పుటి యువతకు రచయితలు తెలియదు. సినీ డైరెక్టర్లు తప్ప. నవలాకారుల నేపథ్యం తెలియదు. హీరో హీరోయిన్ల నహిట్లూ ఫట్లు తప్ప. నవలల పేర్లూ అంతకంటే తెలియదు. కొత్త సినిమాలు, విడుదల కాబోయే సినిమాలు, ఓటీటీలో వచ్చే సినిమాలు తప్ప. ఇప్పటి తరం అలా ఉంది మరి. సరే… ఇలాంటి వాతావరణంలో అసలు చదివేవాళ్లే లేరా..? సాహిత్య అభిమానులే కరువా..? అంటే ఉన్నారు. అదీ ఒక వయస్సుకు వచ్చిన వారు. ఉద్యోగంలో రిటైరయిన వాళ్లు. మానసిక ప్రశాంతత కోసం ఇప్పటికీ సాహిత్యం పట్ల మక్కువ తగ్గని వారు ఉన్నారు.

కానీ వీరందరిలో భిన్నంగా, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన యువకుడు ఒకడున్నాడు. అతను నిత్య విద్యార్థిగా ఉంటున్నాడు. రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నా… నిత్యం ప్రజలతో మమేకమవుతూ సమయానికి నిద్రాహారాలూ లేని సందర్భాలున్నా.. తనకున్న సాహిత్య అభిలాషను మాత్రం వదల్లేదా యువనేత. అతనే బాజిరెడ్డి జగన్‌. కాలేజీ రోజుల నుంచే తనకు అలవాటుగా ఉన్న పుస్తక పఠనాన్ని అతను ఇంకా వీడలేదు. మార్కెట్లో ఏ కొత్త పుస్తకం వచ్చినా తెచ్చి పెట్టుకుంటాడు. తన వద్ద ఏదో ఒక పుస్తకం అలా ఉండాలి. అదలా ఖాళీ దొరకగానే తన చేతుల్లోకి రావాలి. ఆ అక్షరాల వెంట ఆ కళ్లు పరుగులు తీయాలి. ఇప్పటికీ అదే అలవాటు. అదే సాహిత్య లోక విహారం. అందుకే జగన్‌ నేటి యువతరానికి ఆదర్శమని చెప్పేది. త్రిపురనేని గోపిచంద్‌ రాసిన అసమర్థుని జీవయాత్ర నవలా చదివారు. అది తననే కాదు అన్ని వయస్సుల వారిని కదిలిస్తుందంటారు. అందరూ ఆ పాత్రలో తమను తాము తరచి చూసుకుంటారంటారు. ఏ వయస్సు వారైనా తప్పక చదవాల్సిన పుస్తకమని ప్రత్యేకంగా దీనిపై ఓ సమీక్ష కూడా రాశారు. తెలుగు సాహిత్యంతో పాటు ఇంగ్లీష్‌ నవలల పైనా పట్టున్న జగన్‌లోని మరో కోణమే ఈ సాహిత్య అభిరుచి, అభిలాష. ఇది నేటి తరానికి మార్గదర్శనంగా ఉంటుంది. ఆదర్శంగా నిలుస్తోంది.


అసమర్థుని జీవయాత్ర.. నవలా సమీక్ష

  • కొంతమంది స్నేహితుల సలహా మేరకు అసమర్థుని జీవయాత్ర పుస్తకం చదివాను. ఈ నవల సీతారామారావు అనే ఒక పాత్ర యొక్క స్వగతం అని చెప్పుకోవచ్చు. ఈ పుస్తకం చదివిన తర్వాత నేను తెలుసుకున్నదేమిటంటే.. తెలుగులో దీన్ని మించిన సైకాలజికల్‌ థ్రిల్లర్‌ , మెంటిలేషనల్‌ గైడ్‌ మరొకటి లేదని. గోపిచంద్‌ గారు ఆ కాలంలోనే ఏ కాలంలోని మానవుడికైనా ఆపాదించుకునేలా, సంబంధం ఉందనిపించే విధంగా పాత్రను మలిచిన విధానం ప్రశంసనీయం. సీతారామారావు తనలో తను వేసుకునే ప్రశ్నలు- ఇచ్చుకునే సమాధానాలు దైనందిన జీవితంలో కొందరిని జ్ఞప్తికి తెచ్చినై. తనలాంటి వ్యక్తుల్లో వ్యక్తుల్లో ప్రజ్ఞ ఉన్నా.. సరైన సమయం వస్తుందని, దాని కోసం వేచి చూడాలని, ఊరికే చిన్న చిన్న విషయాలపై బుర్ర పాడు చేసుకోవద్దని దుప్పటితన్ని పడుకుంటాడు. అటువంటి వారికి ఈ పుస్తకం చదువుతుంటే ఖచ్చితంగా ప్రధాన పాత్ర జీవితంతో తమ జీవితాన్ని ఆపాదించుకుంటారు.
  • రియలైజ్‌ కూడా అవుతారు. అదే కాకుండా, చదివే ప్రతి ఒక్కరూ తమ హృదయాంతరాల్లో దాగి వున్న సీతారామారావుకు అర్జెంటుగా రామయ్య లాంటి మార్గదర్శి దొరికితే బాగుంటుందనిపిస్తుంది. సంకుచితంగా ఆలోచించి తను గీసుకున్న వృత్తంలోనే వుంటూ అదే జీవితమనుకునే మనిషి.. తను పెళ్లాడిన భార్య మీద, తన కన్నకూతురి మీద తన ఉదాసీన వైఖరిని రుద్దాలని చూస్తాడని స్పష్టంగా వివరించారు గోపిచంద్‌. రచయిత మనోవేదనకు గురైనాడో అనిపించింది ఈ పుస్తకం చదువుతున్నప్పుడు. రచయిత పాత్రగా మారిపోయినప్పుడే ఆ పాత్ర అంతరంగాన్ని అంత అక్యురేట్‌గా ఆవిష్కరించగలరని నా అభిప్రాయం. నిజంగా అసమర్దుని జీవయాత్రను రాస్తున్నప్పుడు గోపిచంద్‌ గారు ప్రసవ వేదన అనుభవించి ఉంటారు. ప్రపంచంలో అన్ని సిద్దాంతాలను ఆకళింపు చేసుకుని ఏమీ చేయలేని సీతారామారావుకు నేనిచ్చే బిరుదు నిష్కర్మయోగి. అటువంటి నిష్కర్మయోగి జీవిత చరమాంకాన్ని ఎంతో ఉత్కంఠభరితంగా అక్షర రూపాన్నిచ్చిన గోపిచంద్‌ గారి హ్యాట్సాఫ్‌.
  • ఈ రోజు పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా మొబైల్‌ ఫోన్లకు అలవాటు పడిపోయి, అనవసర విషయ పరిజ్ఞానాన్ని సముపార్జించి అన్నింటి మీద అభిప్రాయాన్ని ఏర్పర్చుకుని, జీవితం మీద ఒక రకమైన విరక్తిని మనసుల నిండా నింపుకుని, తమలో తామే మదన పడిపోవడం, ఆ తరువాత ఇంతేలా జీవితమంటే అని ఆత్మహత్యలకు పాల్పడడం కామన్‌ అయిపోయింది. పుస్తకం రాయబడిన 1947 లో అంతమంది ఉన్నారో లేదో కానీ, 2023లో సోషల్‌ మీడియా తారాస్థాయిలో జీవితాలను ప్రభావితం చేస్తున్న సమయంలో సమాజంలో సీతారామారావుల శాతం పెరిగిపోతున్నది. అందుకే ఈ పుస్తకాన్ని ప్రభుత్వం కాలేజీల్లో తెలుగు సబ్జెక్టులో తప్పనిసరి (నాన్‌ డిటైల్డ్‌ రూపంలో అయినా సరే) చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నవలా నాయకుడు సీతారామారావు చేసే అపాత్రదానాలు, స్వచ్చంధ సేవలు, తండ్రి గారి రాతియుగపు ఆదర్శాలను పితృవాక్పరిపాలనగా భావించి పునికిపుచ్చుకోవడం లాంటి గుణాలన్నీ కలగలిపి భావితరాలు గుర్తించుకోదగ్గ యాంటీ-హీరోగా కలకాలం గుర్తుండిపోతాడు. ఈ యాంటీ-హీరో మీ జీవితాల్ని కచ్చితంగా ప్రభావితం చేస్తానడంలో ఎటువంటి సందేహం లేదు.
  • – జగన్‌ బాజిరెడ్డి

You missed