తెలంగాణ స‌ర్కార్ కొత్త‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప‌ది ల‌క్ష‌ల మందికి ఆస‌రా పింఛ‌న్‌ను మంజూరు చేసింది. ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న బాధితుల‌కు శుభ‌వార్త చెప్పింది. అంతా బాగానే ఉంది. కానీ దేవుడు వ‌ర‌మిచ్చినా పూజారి క‌రుణించ‌లేద‌న్న చందంగా క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఆస‌రా ల‌బ్దిదారుల నుంచి వెయ్యి చొప్పున వ‌సూలు చేస్తున్నార‌ని విశ్వ‌స‌నీయంగా తెలిసింది. కొత్త‌గా మంజూరైన వారికి ఆస‌రా కార్డును ప్ర‌భుత్వం అందించింది. కొంద‌రు అధికారిక కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. చాలా మంది కాలేదు. వీరంద‌రికీ స‌ర్పంచులు వేరే మ‌ధ్య‌వ‌ర్తితో ఫోన్‌లో చేయించి.. మీకు ఆస‌రా పింఛ‌న్ వ‌చ్చింది. కార్డు కోసం ఖ‌ర్చ‌వుతుంది. వెయ్యి రూపాయ‌లు పంపండి. ఫోన్ పే చేయండి అని ఫోన్ చేయించారు.

చాలా మంది మాకు ఫోన్ పే లేదు అని చెప్ప‌డంతో వేరే మ‌ధ్య‌వ‌ర్తికి ఇచ్చే విధంగా వెసులుబాటు క‌ల్పించారు. ఆ వెయ్యి చేతిలో ప‌డితే గానీ కార్డు చేతికి రాలేదు. ప‌నిలో ప‌ని పాత వారికి కూడా ఆస‌రా పింఛ‌న్ కార్డులు ఇస్తున్నారు. వీరి వ‌ద్ద నుంచి వ‌సూలు చేస్తున్నారు. అధికారుల మాత్రం ఎవ‌రికీ ఒక్క పైసా ఇవ్వొద్ద‌ని, నేరుగా మున్సిపాలిటీ లేదా పంచాయ‌తీ ఆఫీసుకు వెళ్లి కార్డులు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. కానీ స‌ర్పంచులు మాత్రం ఇదే అవ‌కాశంగా పింఛ‌న్ ల‌బ్దిదారుల నుంచి వెయ్యి చొప్పున వ‌సూలు చేసేశారు. పాపం.. అప్పులెన్నో చేసి కాంట్రాక్టు ప‌నులు చేస్తే బిల్లులు రాలేదాయే..! ఇదే అవ‌కాశమ‌ని ఆస‌రా పేరు చెప్పుకుని కొంత ఆస‌రా ప‌డుతున్నారు. అంతే..! ఎవ‌రి బాధ వారిది…

ఎవ‌రైనా ఆస‌రా పింఛ‌న్ కోసం పైస‌ల‌డిగితే చెప్పుతో కొట్టండ‌ని సంబంధిత శాఖాధికారి ఒక‌రు వాస్త‌వంతో మాట్లాడుతూ చెప్పారు.

You missed