ఎవరిని నిందించాలి?

మిత్రుడు గుంటిపల్లి వెంకట్ జగిత్యాల ప్రాంత జర్నలిస్ట్ జమీర్ స్మరణ లో రాసిన రైట్ అప్ చూసిన తర్వాత యాజమాన్యాలపై ఎక్కుపెట్టాల్సిన బాణాలను యూనియన్లు సంక్షేమ చర్యల వైపు సరిపెట్టుకుంటున్న క్రమం లో కొంచెం మిట్ట వేదాంతమే నయినా కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తున్నది.

వరదల్లో గల్లంతై మృతి చెందిన జమీర్ మాత్రమే కాదు గ్రామీణ ప్రాంతాల్లో, ఆ మాట కొస్తే తెలంగాణ రాష్ట్రం లో పనిచేసే జర్నలిస్టుల్లో 98 శాతం పాత్రికేయులు, మీడియా మిత్రులు ఖానిగీ ఉద్యోగాలే చేస్తున్నారు.

పల్లెటూళ్లలో వెట్టిచాకిరీకి ప్రతీకగా పేర్కొనబడే జీతగాళ్ల ఉద్యోగాలకు కూడా అనేక సార్లు అప్పు పత్రాలో, ఒప్పుదల పత్రాలో, ప్రామిసరీ నోట్ లో రాసుకునే ఆనవాయితీ ఉంది.

జర్నలిస్టులు మాత్రం అలా కాదు. రేపటినుంచి పని చెయ్యి అంటూ మౌఖిక ఆర్డర్ల మీద పనికెక్కుతారు. పనికెక్కిన క్షణం నుంచీ నిరాఘాటం గా, నిరంతరాయం గా వార్తాసేకరణే పరమావధిగా పనిచేస్తూ, కుటుంబాల ముందు బిజీ మనుషులుగానో, పిల్లలముందు బాధ్యతలేని తండ్రులుగానో, తల్లులుగానో నమోదవుతారు. అలా వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలకు , చాకిరీకి వచ్చే నెలసరి ఆదాయం ఏంటో తెలిసిన వాళ్ళు ఆయా పాత్రికేయులను తాత్కాలిక ప్రయోజనాలకోసం లంచగొండులుగానో, అవినీతిపరులుగానో మారుస్తుంటారు.

ఇలా మారిన వాళ్ల జీవన శైలి పట్టాలు తప్పిన రైలు ప్రయాణం లా మారుతుంది. అనేక సార్లు ప్రమాదాలకు గురవుతుంది. అరాచక జీవన విధానం, అలవాట్లలోనూ, క్రమశిక్షణ పైనా తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఇది ఉపోద్ఘాతం గా చెప్పుకుంటూ పోతే ఈ జీవన శైలిని మార్చడానికి ఏమయిన ప్రయత్నం చేయవచ్చా… చేస్తే ఎవరు చెయ్యాలి . ఆ మార్పు ఆచరణలోకి రావడానికి పాత్రికేయులకు ఎవరి అండ అవసరం. ఆ అండ గా ఉన్న శక్తులు విలేకరుల పక్షాన ఉంటూ ఎవరి పై వత్తిడి చెయ్యాలి.. ఇవన్నీ సమాధానాలు కోరుకుంటున్న ప్రశ్నలు.

ఓ ఏడాది పాటు వెట్టిచాకిరీ చేయించుకున్న ఒక పత్రిక యాజమాన్యం జీతం అడగ్గానే నువ్వు మాకు పనిచేసినట్టు ఏం దాఖలాలున్నాయి అని ఏడాదిన్నర క్రితం నన్ను ఎగతాళిగా ప్రశ్నించింది. నిజానికి నా బై లైన్లే ఆ యాజమాన్యానికి మూతోడ్ జవాబులు.

అయితే నేను ఆ యాజమాన్యం పై నిరసన వ్యక్తం చేసే స్థితిలేదిక్కడ. తెల్లవారి నుంచే నా కొత్త ఉద్యోగం వేట లో నేను చేరాలి కాబట్టి నాకు పోరాటం చెయ్యగలిగే స్థోమత ఉండదు.

జమీర్ మృతి చెందాడు. అనేక మంది మిత్రులు ఆయన విధి నిర్వహణ లో చనిపోయాడు కాబట్టి ఆయన పనిచేస్తున్న ఛానల్ యాజమాన్యాన్ని ఆయనకుటుంబానికి ఆర్థికం గా సహాయకారిగా నిలువగలిగే మద్ధతు ఇవ్వాలని డిమాండ్ చేసారు.

మిత్రులు అలా అడుగుతున్న క్రమం లో ప్రభుత్వ ఆర్థిక సహాయం, కుటుంబానికి ప్రభుత్వ తోడ్పాటు అంశాలు ప్రధానమయ్యాయి.
నిజానికి యాజమాన్యాలు తమ ఉద్యోగులను ఉద్యోగులుగా, చివరికి తాత్కాలిక ఉద్యోగులుగానైనా గుర్తించాలని ఎప్పుడయినా మన పక్షాన ఉండాల్సిన యూనియన్లను సంఘటితంగానో అసంఘటితంగానో మనం ప్రయత్నించాలనుకున్నామా.

ప్రభుత్వాల ఇళ్ళ స్థలాలు, ప్రభుత్వాల అక్రెడిటేషన్ల గురించి ప్రయత్నిస్తున్న స్థాయిలోనే మన యూనియన్లు ఒకసారి యాజమాన్యాల మెడలు వంచే కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఆ ప్రక్రియకు జమీర్ లాంటి విధినిర్వహణలో సర్వాన్నొడ్డి అన్నీ కోల్పోయిన కుటుంబాల కేస్ తో ఆరంభిస్తే మనకు జీతాల కోసం, హక్కుల కోసం యాజమాన్యాల పై వత్తిడి తీసుకురాగలిగే జస్ట్ రైట్ కోసం మనం ముందడుగు వేయగలమేమో కదా….?

P V Kondal Rao

You missed