బీజేపీ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఒకడుగు ముందుకు నాలుగ‌డుగులు వెన‌క్కి అన్న‌ట్టుగా త‌యార‌య్యింది. ఏదో ఇంత ఊపు వ‌చ్చింద‌ని సంబ‌ర‌ప‌డ్డారో లేదో అప్పుడే లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. పెద్ద నాయ‌కులు త‌మ పార్టీలోకి వ‌ల‌స‌లు వ‌స్తార‌ని భావించారు. అదంతా ఇప్పుడు భ్ర‌మేన‌ని తేలింది. వ‌చ్చే వ‌ల‌స నాయ‌కుల మాటేమో గానీ, ఉన్న త‌మ‌కే మ‌ర్యాద‌, ఆత్మ‌గౌర‌వం దిక్కులేకుండా పోయింద‌ని నేత‌లు ఎవ‌రికీ చెప్పుకోలేక‌, ఏడ్వ‌లేక‌, మింగ‌లేన స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఇదంతా నిన్న‌టిమొన్న‌టి వ‌రకు లోలోప‌ల జ‌రుగుతున్న తంతు. ఎప్పుడైతే అమిత్ షా వ‌చ్చి తుక్కుగూడ‌లో మీటింగు పెట్టి…. బండి సంజ‌య్‌ను ఆమాంతం మోసేశాడో… సంజ‌య్ ఒక్క‌డు చాలు కేసీఆర్‌కు అని కితాబిచ్చాడో… ఇగో ఇక్క‌డే అసంతృప్తి వ‌ర్గానికి మ‌రింత కాలింది. అసంతృప్తుల్లో ప్ర‌ధానంగా ముందు వ‌రుస‌లో ఉన్న‌ది వీ6, వెలుగు అధినేత, బీజేపీ కోర్ క‌మిటీ స‌భ్యుడు, మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త వివేక్ వెంక‌ట‌స్వామి. ఈయ‌న అసంతృప్తి ఎంత‌లా పెరిగిపోయిందంటే.. మొన్న‌టి వ‌ర‌కు బీజేపీ మీద ఈగ వాలితే స‌హించ‌ని వివేక్‌.. ఇప్పుడు త‌నే స్వ‌యంగా త‌న పేప‌ర్ వెలుగులో బీజేపీలో అసంతృప్తి సెగ‌లు అంటూ వండి వార్చిన వంట‌కాల వార్త‌లు అచ్చేయిస్తున్నాడు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

ఈట‌ల రాజేంద‌ర్ గెలుపులో కీల‌కంగా ఉన్న వివేక్‌…. ఈట‌ల‌ను కూడా బీజేపీలో పెద్ద నాయ‌కుడి హోదాలో చూడాల‌నుకున్నాడు. బండి సంజ‌య్‌తో స‌మాన‌మైన గౌర‌వం ద‌క్కాల‌ని భావించాడు. కానీ ఈట‌ల‌ను బండి సంజ‌య్ మొత్తం దూరం పెట్టేశాడు. దీంతో ఈట‌ల వ‌ర్గం మొత్తం బీజేపీకి అంటీ ముట్ట‌న‌ట్టుగా ఉంటోంది. నల్లాల ఓదేలును బీజేపీలోకి తీసుకువ‌చ్చేందుకు ఈట‌ల అన్ని సిద్దం చేసిన త‌ర్వాత ..ఈ నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వయం లేక‌పోవ‌డంతో చివ‌ర‌కు న‌ల్లాల ఓదేలు కాంగ్రెస్ గూటికి చేరాడు.
బీజేపీకి ఉన్న ఏకైక మీడియా స‌పోర్టు వీ6, వెలుగు. ప్ర‌జాధ‌ర‌ణ‌లో ఈ రెండూ ముందున్నాయి. కాస్తో కూస్తో ప్ర‌జ‌ల నాడి ప‌ట్ట‌గ‌లిగి, తెలంగాణ యాస‌, భాష‌ను ప‌లికించి ఆక‌ట్టుకోవ‌డంలో ముందుంది. అవ‌స‌ర‌మైన ప్ర‌తీ సంద‌ర్బంలో బీజేపీ కి అనుకూల క‌థ‌నాలు, లైవ్‌లు, ఇంట‌ర్వూల‌తో పార్టీకి ఊపు తెచ్చింది. బ‌లాన్ని పెంచింది. వివేక్ వ‌ల్ల పార్టీకి మేలు జ‌రిగిందే కానీ, త‌న‌కు రావాల్సిన గౌర‌వం, మ‌ర్యాద రాలేద‌ని తీవ్ర అసంతృప్తితో ర‌గ‌లిపోతున్నాడాయ‌న‌.

అమిత్ షా మీటింగులో త‌న పేరు ప్ర‌స్తావ‌న లేక‌పోవ‌డం.. క‌నీసం మ‌ర్యాద‌, గౌర‌వం ద‌క్క‌క‌పోవ‌డం… బండి సంజ‌య్ ఒక్క‌డినే ఆకాశానికెత్త‌డం.. ఈట‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం… ఇవ‌న్నీ వివేక్ అసంతృప్తి అగ్ని జ్వాలల‌కు ఆజ్యం పోసిన‌ట్ట‌య్యింది. దీంతో ఇక ఉండ‌బ‌ట్ట‌లేక‌… అందులో ఇమ‌డం క‌ష్ట‌మ‌నే అభిప్రాయానికి వ‌చ్చిన వాడిలా వెలుగులో నెగిటివ్ వార్త‌లు కుమ్మేస్తున్నాడు. ఇది ఎంత వ‌ర‌కు వెళ్తుందో తెలియ‌దు. ఆ పార్టీలో వివేక్ ఇంకా ఎంత కాలం ఉంటాడో తెల్వ‌దు. ఏ పార్టీలోకి పోతాడో తెల్వ‌దు… ఆ త‌ర్వాత పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంటుందో తెలియ‌దు. ఇప్పుడన్నీ ప్ర‌శ్న‌లే. వీటికి స‌మాధానాలు త్వ‌ర‌లోనే దొర‌క‌నున్నాయి.

You missed