పొద్దున్నే ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప‌ల‌క‌రింపు ఫోన్‌లో.
” హాయ్ సీను ఎలా ఉన్నావు..?”

క్షేమ స‌మ‌చారాలు, పండుగ శుభాకాంక్ష‌లు.. క‌ష్ట‌సుఖాలు అన్నీ చ‌ర్చించుకున్నాక‌..
టాపిక్ డైవ‌ర్ట్ అయ్యింది.

బ‌తుకు దెరువు ముచ్చ‌ట మీద సాగిన సంభాష‌ణ కాస్త‌.. మీడియా పోక‌డ‌లు రాష్ట్ర రాజ‌కీయాల వైపు సాగాయి.

“తీన్మార్ మ‌ల్ల‌న్నలా దిగ‌జారి జ‌ర్న‌లిజం చేయాల‌ని లేదు నాకు” అన్నాడు.

నేను వింటున్నాను. అత‌ను చెబుతున్నాడు.

“స్వార్థం కోసం జ‌ర్న‌లిజాన్ని తాక‌ట్టు పెట్టి.. డ‌బ్బులు సంపాదించాల‌ని లేదు….”

మ‌ళ్లీ వెంట‌నే … టాపిక్ మార్చాడు.

“నువ్వేమ‌న్నా అను.. నా దృష్టిలో కేసీఆర్ హీరో…!”

ఇప్పుడు ఖంగుతిన‌డం నా వంతైంది.

“ఎందుక‌లా అనిపిస్తుంది..?”
అని అడుగుతాన‌నుకున్నాడు. కానీ అడ‌గ‌లేదు నేను. అడ‌గ‌కున్నా.. నా మౌనం అదే స‌మాధానాన్ని కోరుకుంటుంద‌ని గ్ర‌హించాడు.
“ఎందుకంటే… ?”
చెప్పేందుకు ఉద్యుక్తుడ‌వుతున్న‌ట్టు ఆ గొంతు కొంచెం గంభీరంగా మారింది.

“కేసీఆర్ ఇంత‌పూర్తైనా ప‌రిపాలిస్తున్నాడు. వేరే పార్టీల‌కు ఈ ఛాన్స్ వ‌స్తే రాష్ట్రం ఆగ‌మ‌య్యేది.”

“ఎందుక‌లా అనుకుంటున్నావు..?”
మ‌ళ్లీ నా ముఖం మీద ప్ర‌శ్నార్థ‌క సింబ‌ల్‌ను ప‌సిగట్టిన‌ట్టున్నాడు.

“బీజేపీ ఓ మ‌త‌త‌త్వ పార్టీ. అది అధికారంలోకి వ‌స్తే అవే గొడ‌వ‌లు. ప్ర‌శాంత‌త ఉండ‌దు ప్ర‌జ‌ల‌కు.”

“ఇక కాంగ్రెస్ …. ఎవ‌రికి ఏ నిర్ణ‌యాలు తీసుకోవాలో తెలియ‌దు. వాళ్ల‌లో వాళ్లే కొట్టుకు చ‌స్తారు. ఇక జ‌నాల‌కు వాళ్లు చేసేదేముంటుంది…?”

వింటున్నాను. చెబుతూ పోతున్నాడు.

“టీఆరెస్‌లో అలా కాదు. కేసీఆర్ ఓ నియంత‌లా ఉంటాడు. ఒక్క‌డే నిర్ణ‌యం తీసుకుంటాడు. ఒక్క‌డు చెప్పింది మిగిలిన వాళ్లు వినాలె. చాలా సార్లు ఈ విధానం ప్ర‌జ‌ల‌కు మేలే చేస్తుంద‌ని అనుకుంటున్నాను.”

“కేసీఆర్‌కు నేనేమీ వీరాభిమానిని కాను. ఆ మాటకొస్తే అభిమానిని కూడా కాదు.”

నేను డౌట్ ప‌డుతున్నానేమో అని అత‌నే ఆ డౌట్‌ను క్రియేట్ చేసుకుని స‌మాధాన‌మూ ఇచ్చుకున్నాడు.

నేనేం మాట్లాడ‌క‌పోయే స‌రికి, కల్పించుకున్నాడు.

“ఏందీ ఏం మాట్లాడ‌త‌లేవు…? అస‌లు నువ్వేమ‌నుకుంటున్నావు..?”

“నేనేమీ అనుకోవ‌డం లేదు.. ఇప్ప‌టికైతే..”

నా ముక్త‌స‌రి స‌మాధానంతో అత‌ను సంతృప్తి ప‌డ‌లేదు.

“నేను వ‌చ్చేసారి కూడా టీఆరెస్సే వ‌స్త‌ద‌ని అనుకుంటున్నా..” అన్నాడు.

“అవునా.. ?” అన్నాను.

“మ‌రి నువ్వేమ‌నుకుంటున్నావు..?”

“ఇప్పుడేం ఊహించ‌లేను..” అన్నాను.

“బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఓట్లు చీల్చి.. అంతిమంగా టీఆరెస్‌కే మేలు చేస్తాయి. మ‌ళ్లీ టీఆరెస్‌కే ఇక్క‌డ అధికారం..”
అన్నాడు క్లారిటీ ఇస్తూ.

“ఇది నా అభిప్రాయం కాదు.. నా అంచ‌నా…? కాదంటావా..? ”
మ‌ళ్లీ ఓ క్వ‌శ్చ‌న్.

నా నుంచి ష‌రా మామూలుగా స‌మాధానం లేదు.

You missed