తెలంగాణలో మ‌రో రెండు ప‌త్రిక‌లు, ఒక కొత్త టీవీ చాన‌ల్ రాబోతున్నాయి. క‌రోనా దెబ్బ‌కు ఇప్పుడున్న ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియా క‌కావిక‌ల‌మైన విష‌యం తెలిసిందే. చాలా మంది ఉద్యోగుల‌న్నీ అన్ని ప‌త్రిక‌ల్లో పీకేసీ రోడ్డున ప‌డేశారు. ఖ‌ర్చును త‌గ్గించుకుంటున్నారు. జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ల త‌ర్వాత మీడియా ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మార‌నుంది. ఈ సంధికాలంలో ఓ రెండు కొత్త ప‌త్రిక‌లు రాబోతున్నాయి. ఓ టీవీ చాన‌ల్ కూడా పెట్టే యోచ‌న‌లో ఉన్నారు. పార్టీల వారీగా మీడియా విడిపోయి ఎవ‌రికి వారే క‌వ‌రేజీ ఇచ్చుకుంటున్న సంద‌ర్భంలో ఆయా పార్టీలు మీడియాలో త‌మ స్థాన బ‌ల‌మెంతో తేల్చుకున్నారు.

ఇప్పుడు అత్య‌వ‌స‌రంగా కాంగ్రెస్‌కు ఈ అవ‌స‌రం వ‌చ్చింది. రేవంత్‌రెడ్డి పీసీసీ ఛీప్ అయిన త‌ర్వాత తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు కొంత జీవ‌మొచ్చింది. కానీ మీడియాలో స్పేస్ అనుకున్నంత లేదు. ఆంధ్ర‌జ్యోతి ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తున్నా.. రాధాకృష్ణ‌ను న‌మ్మే ప‌రిస్థితులో కాంగ్రెస్ లేదు. సాక్షి, ఈనాడు కేసీఆర్‌ను కాద‌ని అడుగు ముందుకేసే ప‌రిస్థితుల్లో లేవు. వెలుగు బీజేపీ ప‌త్రిక‌. ఇక త‌మ‌కే ఓ మీడియా లేద‌నేది కాంగ్రెస్ పెద్ద‌లు పెద్ద లోటుగా భావిస్తున్నారు.

మాజీ ఎంపీ విశ్వేశ్వ‌ర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు ముహుర్తం ఖ‌రారైంది. త్వ‌ర‌లో ఆయ‌న కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్నారు. రేవంత్ రెడ్డి, విశ్వేశ్వ‌ర్ రెడ్డిలు ఇద్ద‌రు క‌లిసి ఓ ప‌త్రిక‌తో పాటు, ఓ టీవీ చాన‌ల్‌ను ఏర్పాటు చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా తెలిసింది. వీటితో పాటు మ‌రో ప‌త్రిక రానుంది. దీనికి మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ నేత ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్ నేతృత్వంలో ఈ ఆలోచ‌న‌లు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. తీన్మార్ మ‌ల్ల‌న్న సైతం ఈ ప‌త్రిక ఆవిర్భావంలో కీల‌క భూమిక పోషిస్తున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది.

కేసీఆర్ ఈ సారి కూడా మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్నాడ‌ని రేవంత్ ప్ర‌చారం చేస్తున్నాడు. అందుకే పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌లో త‌మ‌కంటూ ఓ మీడియా హౌజ్‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆరెస్ ప్ర‌వీణ్ కుమార్ కూడా సొంత మీడియా ఉంటే త‌న వాయిస్ మ‌రింత బ‌లంగా వినిపించొచ్చ‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ని తెలుస్తున్న‌ది.

You missed