కేటీఆర్‌కు ఎవ‌రు స‌ల‌హాలిస్తారో తెలియ‌దు కానీ.. ప్ర‌తిప‌క్షాల‌ను కౌంట‌ర్ చేయ‌బోయి చాలా సంద‌ర్భాల్లో త‌న‌కు తానే ఎన్ కౌంట‌ర్ అవుతూ ఉంటాడు. టీఆరెస్ హామీల అమ‌లు పై బీజేపీ చేప‌ట్టిన ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మం పై కేటీఆర్ తాజాగా చేసిన ఓ ట్వీట్ వైర‌ల్ అవుతున్న‌ది. బీజేపీని ఆత్మ సంర‌క్ష‌ణ‌లో ప‌డేసేందుకు సెటైరిక‌ల్‌గా ఓ కామెంట్ చేసాడు కానీ.. ఒక్క వేలు బీజేపీ వైపు చూపిస్తే, మిగిలిన నాలుగు వేళ్లు త‌మ‌వైపే చూపుతున్నాయ‌న్న విష‌యాన్ని ఆయ‌న విస్మ‌రించాడు.

ముందు మోడీ ఇస్తాన‌న్న 15ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఆ ద‌ర‌ఖాస్తులో ఆడ‌గండి.. బీజేపీని నిల‌దీయండి అనే అర్ధం వ‌చ్చేలా ఆయ‌న ట్వీట్ ఉంది. వాస్త‌వంగా మోడీ 15ల‌క్ష‌ల వ్య‌వ‌హారం పాత చింత‌కాయ ప‌చ్చ‌డి. దీన్ని ప్ర‌జ‌లు ఏనాడో మ‌రిచిపోయారు. వారి క‌ళ్ల ముందు కేసీఆర్ హామీలిచ్చి అమ‌లు చేయ‌కుండా పెండింగ్‌లో ఉంచిన విష‌యాలే క‌నిపిస్తున్నాయి. రెండోసారి అధికారం చేప‌ట్టేందుకు కేసీఆర్ చాలా హామీల‌నే ఇచ్చాడు.

అందులో చాలా మ‌ట్టుకు ఇప్ప‌టికీ అమ‌లు కాలేదు. డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నుంచి మొద‌లు పెడితే, నిరుద్యోగ భృతి, ఖాళీ స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ. 5ల‌క్ష‌లు, కొత్త పింఛ‌న్లు, పాత పింఛ‌న్ల‌కు మోక్షం, రుణ‌మాఫీ త‌దిత‌ర ప‌థ‌కాలు అమ‌లు కావాల్సి ఉంది. ఇవ‌న్నీ పెండింగ్‌లో పెట్టి కొత్త‌గా ద‌ళిత బంధును భుజానికెత్తుకున్నాడాయ‌న‌.

చేయాల్సిన‌వి క‌ళ్ల ముందు ఎన్నో ఉండ‌గా.. త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోస‌మో, ప్ర‌తిప‌క్షాల‌ను దెబ్బ‌తియ‌డం కోస‌మో, ఫ‌క్తు రాజ‌కీయాలు న‌డ‌ప‌డం కేసీఆర్‌కు అల‌వాటుగా మారింది. ఇప్ప‌టికే ప్ర‌జావ్య‌తిరేక‌త పెరుగుతున్న‌ది. నాయ‌కుల పై విశ్వాసం స‌న్న‌గిల్లుతున్న‌ది. ఈ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల‌ను ఆత్మ సంర‌క్ష‌ణ‌లో ప‌డేయాలంటే వారు చేసిన ప్ర‌జా వ్య‌తిరేక విధానాలు చాలా ఉన్నాయి. వాటిని ఎండ‌గ‌ట్టొచ్చు.

త‌మ సంక్షేమ ప‌థ‌కాలు లేటైనా కానీ ఇచ్చి తీరుతామ‌నే విశ్వాసాన్ని ప్ర‌క‌టించ‌వ‌చ్చు. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ద‌ర‌ఖాస్తుల ద్వారా తీసుకున్న సంక్షేమ ప‌థ‌కాలన్నీ అమ‌లు చేసి ఆద‌ర్శంగా ఉండ‌డ‌ని వ్యంగ్యంగా చెప్ప‌వ‌చ్చు. బీజేపీ వేస్తున్న ఉచ్చులో ఇలా చిన్నా పెద్ద తేడా లేకుండా నేత‌లంద‌రూ ఒక్కొక్క‌రుగా ఇరుక్కుంటున్నారు. చిన్న వారిని పెద్ద‌గా చేస్తున్నారు. పెద్ద‌గా ఉన్న వారు త‌మంట తాముగా కుంచించుకుపోయి చిన్న‌గా మారుతున్నారు.

 

You missed