ఈ లాక్‌డౌన్‌ టైమ్‌లో చదివిన మరో పుస్తకం అయిన్‌ రాండ్‌ – ఫౌంటెన్‌ హెడ్‌. రెంటాల శ్రీవెంకటేశ్వరరావు అనువాదం చేసిన క్లాసిక్‌ నవల ఇది. దాదాపు ఏడాది కిందట అంటే గత లాక్‌డౌన్‌ కాలాన ఈ నవలని అనువాదం చేసిన సంగతి ఓ సారి మాటల సందర్భంలో చెప్పారు. విమర్శకునిగా వారంటే నాకు అభిమానం, గౌరవం. అప్పట్లోనే ఈ పుస్తకం చదవాలనుకున్నా. ఇపుడు కుదిరింది. అయిన్‌రాండ్‌ని అనువాదం చేయడం అంత సులువు కాదు. ఎలా చేయగలిగారో కదా అనుకున్నా. అంతేగాక అబ్బురమనిపించింది. ఓ క్లాసిక్‌ను తెలుగులోకి తీసుకొచ్చినందుకు ఆనందమేసింది. నిజంగా ఇపుడు ఆనందం, ఆశ్చర్యం. అద్భుతం అనిపిస్తుంది. అందుకు ముందుగా రెంటాల వారికి ధన్యవాదాలు, అభినందనలు, నమస్సులు. వారి అనువాదం సరళ సుందరంగా ఉంది. హాయిగా చదివించింది. ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా ముందుకు తీసుకెళ్ళింది. దీని వెనుక వారి శ్రమ చిన్నదేం కాదు. ఎన్ని రాత్రులు, ఎన్ని వందల గంటలు ఈ అనువాదంలో తలమునకలయ్యారో కదా! ఈ నవల రాయడానికి అయిన్‌ రాండ్‌కు ఏడేళ్ళ కాలం పట్టిందట. నిజమే… ఈ నవలా రచన అంత సులువు కాదు. ఒక తాత్విక భావధారని అందించడానికి నవలాప్రక్రియని ఎంచుకోవడమే సాహసం.

ఈమధ్యనే రాంగోపాల్‌ వర్మ- నా ఇష్టం – చదివినపుడు అయిన్‌రాండ్‌ గుర్తుకొచ్చింది. ఆ నవలలోని కథానాయకుడు హోవార్డ్‌ రోర్క్‌ ప్రబావం గురించి ఆ పుస్తకంలో చెప్పాడాయన. ఆ మాటలు చదివాక రెంటాల వారి అనువాదం చేసిన సంగతి స్ఫురణ కొచ్చింది. కొన్నాళ్ళ కిందట మా తమ్ముడు ఆ పుస్తకం నవోదయ నుంచి తీసుకొచ్చాడు. అది ఆఫీసులో ఉండిపోయింది. ఈమధ్య ఓ ఉదయం వెళ్ళి తీసుకొచ్చాను. నాలుగురోజులలో వరుసగా చదివాను – కొన్నిసార్లు వేరే రాతపనులు చేస్తున్నప్పటికీ మనసంతా ఈ పుస్తకం చుట్టూరా, ముఖ్యంగా హోవార్డ్‌ రోర్క్‌ – డోమినిక్‌ల చుట్టూరానే తిరుగాడింది. అంతగా ఉద్విగ్నతకు లోను చేశాయి ఈ నవలలోని పాత్రలు.

కొన్నేళ్ళ కిందట మొదటిసారి మాటల మధ్యలో మిత్రుడు కస్తూరి మురళీకృష్ణ అయిన్‌ రాండ్‌ గురించి ప్రస్తావించాడు. అపుడు తను ఒక వ్యాసం రాసినట్టు కూడా గుర్తు. నాకు తెలిసిన ఒక ఎడిటర్‌కు కూడా అయిన్‌ రాండ్‌ ఫిలాసఫీ అంటే ఇష్టం. కానీ అతను రోర్క్‌ లాంటివాడు కాదు, ఈ నవలలోని టక్కరి ఎల్స్‌వర్త్ టూహ్లీ లాంటి వాడు. ఈ నవల చదవుతుంటే తెలుగునాట నేలబారు విన్యాసాలు చేసే రచయతలు, నటులు, సోకాల్డ్‌ మేధావులు, థర్డ్‌రేటు ఎడిటర్లు, జర్నలిస్టులు కళ్ళముందు కదలాడారు. సరే ఆ సంగతి అలా వదిలేద్దాం… తెలుగులో అపుడపుడు ఫీచర్స్‌ పేజీలలో చిరు వ్యాసాలు వస్తుండేవి అయిన్‌ రాండ్‌ గురించి. అయిన్‌ రాండ్‌ని చదవకుండానే ఆమె తాత్విక భావజాలం గురించి ప్రతికూల, సానుకూల అభిప్రాయాలు వ్యక్తం చేసేవారిని గమనించా. (నిజానికి అయిన్‌ రాండ్‌ గురించే కాదు, ఎవరి గురించయినా ఎవరో చెప్పగా విని మాట్లాడేవారు ఎక్కువ.) వాటిని పక్కనపెట్టి ఈ నవలలోకి ప్రయాణించాలి. రచయిత్రి ఊహాశాలిత, సృజనాత్మక కౌశలం, పాత్రలను, సన్నివేశాలను, సందర్భాలను రూపుదిద్దిన సంవిధానం పరమ ఆకర్షణీయం. ఇతివృత్తం గురించి కానీ… ఇందులోని కథ ఇదని గానీ ఇక్కడ చెప్పడం లేదు. పాఠకుల్ని ఉద్విగ్న మనస్కులని చేసి లాక్కుపోయే నవలా నిర్మాణం ఆకట్టుకుంటుంది. ఆ నిర్మాణం, అల్లిక వచనరచనలు చేసే వారిని మరింత ముగ్థులను చేస్తుంది.

ఇక్కడ అయిన్‌ రాండ్‌ భావజాలం గురించి మాట్లాడటం లేదు. ఈ నవలలోని ఆలోచనాధార గురించి కూడా ఏం చెప్పబోవడం లేదు. చదివాక ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవడం మంచిదంటాను. కానీ చదవాలి. అనువాదం ఎంత అందంగా చేయవచ్చునో తెలుసుకోడానికి రచయితలు, కవులు చదవాలి. అయిన్‌ రాండ్‌ ఆలోచనాధారని తెలుగులోకి తీసుకురావడంలో రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు చూపిన కౌశలం తెలుసుకోడానికి ఈ నవల చదవాలి. కొన్ని ఆంగ్ల వాక్యాలను తెలుగు చేయడానికి వారు చూపిన ప్రతిభను గమనించడానికి చదవాలి. అనువాద క్రమాన సరికొత్త పదజాలాన్ని సృజించినందుకు మెచ్చుకోవాలి.
ఈ నవల ఆద్యంతం ఆసక్తకిరంగా చదివించింది. తెలుగు భాష మీద ఎంత సాధికారత ఉన్నప్పటికీ ఈ నవలని అనువాదం చేయడం అంత సులువు కాదు. కానీ వారి శ్రమ సఫలమైంది. అయిన్‌ రాండ్‌ గురించి విని చదవాలనుకున్నవారికి అందించిన గొప్ప కానుక ఈ పుస్తకం. ముఖ్యంగా ఆర్కిటెక్చర్‌ నేపథ్యంగా ఈ నవల రాయడం వలన దానికి సంబంధించిన పదజాలం తెలుగులో సరికొత్తగా, సరళమైన రీతిన సృష్టించుకోవాలి. ఆర్కిటెక్చర్‌ పరిభాషను అర్థవంతంగా సమకూర్చుకొని ప్రయోగించాలి. తెలుగులో చదువుతున్న పాఠకునికి ఇది అనువాదమనిపించకుండా ఉండాలి. దీనికి తగినట్టుగానే రెంటాలవారు చాలా జాగ్రత్త లు తీసుకున్నారు. పాత్రల పేర్లు తప్ప అంతా సహజంగా సాగింది అనువాదం. ఎక్కడా ఎలాంటి సంక్లిష్టత, అసంబద్ధత లేదు. ముఖ్యంగా వాక్యనిర్మాణం ఉల్లాసంగా వుంది. కొన్ని వాక్యాలు, పదాలు వినూత్నంగా వుండి అలరిస్తాయి.

  • ఆమె ముఖంలో విరస ప్రశాంతి ఉంది
  • అవి అతనిలో విరస క్రౌర్య భావనని మిగిల్చాయి
  • ఒక మార్మిక సహాయంతో ప్రేరణ పొంది…
  • రహస్య విచారం
  • శ్రేష్ఠ బాస్టర్ఢ్‌
  • అది ఒక భౌతిక ఉగ్రత్వపు హింసావీచి…
  • మన ఊహాత్మక నాగరికత
  • మనోహరమైన దయ
  • కలవరపెట్టేంత నిష్కాపట్యం
  • భరించలేనంత అసభ్యత యొక్క గెలుపుకి ప్రతినిధి
  • శుభ్ర నిర్దాక్షిణ్య సమర్థత
  • అదంతా చెయ్యడంలో ఒక విషవినోదం కనిపించింది
  • బాధలో ఆమెకి ఒక దుస్సంతృప్తి దొరికింది.
  • న్యూయార్క్‌లో అంత అసుందర భవనం ఉండకూడదు
  • అది ఆమె అందం కాదు. దురుసైన సొగసూ కాదు
  • అది అతనికి తెలిసిన ఉదాసీనత కాదు, అది వికర్షణ.
    ఈవిధంగా వాక్యనిర్మాణంలో, పదజాలంలో విరుపులు, మెరుపులు, ప్రయోగాలు అనేకం.
    అయిన్‌ రాండ్‌ రచనాశైలిలోనే సంభాషణలు, వాక్యాలు, విభిన్నమైన వ్యక్తీకరణలు సరికొత్తగా దర్శనమిస్తాయి. వాటి అర్థమూ, సారాంశమూ చెడకుండా తెలుగు చేయడానికి రెంటాల వారు నూటికి నూరు శాతం శ్రమించారు. ఆ ప్రయత్నం ఫలించింది. వారి అనువాద సృజన తెలుగు భాష సౌందర్యాన్ని ఇనుమడింపజేసింది. ఈ నవల లో అయిన్‌ రాండ్‌ కొటబుల్‌ కొట్స్‌ లాంటి వాక్యాలు ఎన్నో రాసింది. వాటిని ఒకచోట చేర్చి పుస్తకంగా అచ్చు వేయడానికి గోదావరి ప్రచురణల వారు ప్రయత్నిస్తే మంచిది. అది మరింత ఉపయుక్తం. ఎందుకంటే ఆమె ఆలోచనలలో, సృష్టించిన సన్నివేశాలలో, సంభాషణలలో ఎంతో లోతు, గాఢత, భావశబలత ఉంటాయి. పాఠకునిలో ఆత్మవిశ్వాసాన్ని, స్వతంత్ర ఆలోచనని పురి గొల్పడానికి ప్రేరణగా నిలుస్తాయి.

తన భావజాలాన్ని. ఆలోచనాధారని జనంలోకి తీసుకెళ్ళడం కోసమే అయిన్‌ రాండ్‌ ఈ నవల రాసింది. నాన్‌ ఫిక్షన్‌ రచనని ఫిక్షన్‌గా సృజించి పాఠక మెదళ్ళకు ఎక్కించడానికి చేసిన సుందర ప్రయత్నమిది. వ్యక్తి స్వేచ్ఛ, సామూహికవాదం, స్వేచ్ఛాలోచన, మానవుని స్వతంత్రత, ఇచ్ఛ, స్వార్థం, పరహితం, తత్వబోధనలలోని డొల్లతనం, నిజాయితీ, మనుషుల కపటత్వం, బతుకంతా ఎవరికో బకాయి పడ్డట్టుగా పడి మూలిగే మనుషుల ధోరణి గురించి వివరంగా, విపులంగా ఆమె వ్యక్తం చేసిన భావాలు చర్చోపచర్చలకు దారితీశాయి. అందుకే అయిన్‌ రాండ్‌ ఆలోచనలని తెలుసుకోవాలి. అందుకోసమే ఈ నవల చదవాలి.

ముఖ్యంగా పత్రికా రంగం మీద, ఎడిటర్ల మీద, కాలమిస్టుల మీద, పత్రికా యజమానుల తీరు మీద, వారి కౌటిల్యం, నీచత్వం, భ్రష్టత్వం కళ్ళకు కట్టినట్టుగా రాశారామె. ఒక జర్నలిస్టుగా వెన్నుముక లేని ఎడిటర్లనీ, ఇన్‌చార్జిలనీ, వాక్యం రాయడం తెలియని బ్యూరో చీఫ్‌ల టక్కరితనాలనీ, నీచమైన లౌక్యాలనీ దగ్గరగా చూశాను. కానీ ఈ వంకరతనాలన్నిటినీ ఎనభై ఏళ్ళ కిందటనే అయిన్‌ రాండ్‌ చూశారు. కేవలం మాటలు చెప్పి నెట్టుకొచ్చే దుర్బల, ఇంబెసైల్ జర్నలిస్టులు ఎందరో ఈ నవల చదువుతుంటే గుర్తుకొచ్చారు. జర్నలిస్టులే కాదు కవులు, కథకులు, సంకలనకర్తలు,, నాటకరాయుళ్ళు ఎందరో కనిపిస్తారు… ఇతరుల ఆలోచనల మీద పడి బతికే పరాన్న జీవులు తమ బతుకులనే కాదు ఇతరుల ప్రతిభనీ, సంకల్పశక్తినీ, సృజనాత్మక ప్రతిభని దెబ్బతీయడానికి తమ కాలాన్నంతా వెచ్చిస్తారు. ఇంతకన్నా రసహీనత ఏమయినా ఉంటుందా?. కానీ ఇలాంటివారిని 1930ల కాలంలోనే అయిన్‌ రాండ్ చూశారు. ఈనవల చదువుతుంటే కె.ఎన్‌.వై.పతంజలి – పెంపుడు జంతువులు – గుర్తుకొచ్చింది. నిజానికి పెంపుడు జంతువులు అన్నది చిన్నమాట.

తన ఆలోచనలతో పాఠకులని ప్రభావితం చేయడం కోసం రచయిత్రి ఎంతగా తపన చెంది ఈ నవలని రచించారో, రచనా క్రమంలో ఎలాంటి భావోద్వేగాలకు లోనయ్యారో చెప్పనలవి కానిది. ఆర్కిటెక్చర్‌ నేపథ్యంగా నవల రాయాలంటే దాని గురించి సంపూర్ణంగా తెలిసి ఉండాలి. అందుకోసం ఓ ఆర్కిటెక్చర్‌ కంపెనీలోనే ఆమె పని చేసింది. ఆ రంగాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసింది. 1943లో మొదటి సారి అచ్చయి మిలియన్ల కాపీలు అమ్ముడయిన ఈ నవలని రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు అనువాదం చేయగా 2019లో తెలుగులో గోదావరి ప్రచురణల వారు ముద్రించారు. ఈ నవల అచ్చయ్యే నాటికి అయిన్‌ రాండ్‌ వయసు 38 సంవత్సరాలు. 31వ ఏట ఈ నవల రాయడం ఆరంభించి ఏడేళ్ళ కాలంలో పూర్తి చేశారు. దీనిని ముద్రించడానికి పన్నెండు మంది ప్రచురణకర్తలు నిరాకరించారు. చివరకు మరొక ప్రచురణకర్త ద్వారా వెలుగు చూసింది. 845 పేజీలున్న ఈ నవలా పఠనం ఆద్యంతం ఆసక్తికరం.
ఒక క్లాసిక్‌ నవలని తెలుగులోకి అనువాదం చేయడం సాధ్యమేనని తమ అనువాదం ద్వారా రెంటాల వారు నిరూపించారు. తెలుగు వచనంలోని సౌందర్యం, సారళ్యం, సున్నితత్వం, సొగసుదనం రూపు కట్టించారు. కనుకనే రెంటాల శ్రీవెంకటేశ్వరరావు అనువాదం కోసం ఈ నవల చదవాలి. వచనరచనలోని ప్రయోగపరత్వం కోసం చదవాలి. ఏమైనా ఒక వైవిధ్యమైన, విశిష్టమైన పఠనానుభవం ఇస్తుందన్నది మాత్రం గ్యారంటీ. ఒక బృహత్‌ రచనని తెలుగువారికి అందించిన రెంటాల శ్రీవెంకటేశ్వరరావు గారికి, పుస్తకాన్ని ప్రచురించిన గోదావరి ప్రచురణలవారికి ధన్యవాదాలు, అభినందనలు.

గుడిపాటి వెంకట్, సీనియర్ జర్నలిస్ట్

You missed