ఐపీఎస్ అధికారి ఆర్‌.ఎస్‌. ప్ర‌వీణ్‌కుమార్ ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తిన్న‌దా? అందుకే ఆయ‌న వీఆరెస్ తీసుకున్నాడా? ప్ర‌భుత్వానికి కొర‌క‌రాని కొయ్య‌లా మారుతున్నాడ‌ని సీఎం భావించాడా? చాలా ప్ర‌శ్న‌ల‌కు, అనుమానాల‌కు ప్ర‌వీణ్ కుమారే స్వ‌యంగా ప‌రోక్షంగా, న‌ర్మ‌గ‌ర్భంగా స‌మాధానాలిచ్చాడు. హెచ్ఎంటీవీకి ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చాలా విష‌యాల‌పై ఆయ‌న స్పందించాడు. చెప్ప‌క‌నే త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు. భావోద్వేగానికి లోన‌య్యాడు. త‌మాయించుకుందామ‌నుకున్నా.. కొన్ని ప్ర‌శ్న‌ల‌కు ఆవేశంగానే స‌మాధాన‌మిచ్చాడు. ఈ ప్ర‌భుత్వం త‌న‌కు పూర్తి స్వేచ్చ ఇచ్చింద‌ని చెప్తూనే… త‌న ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీశార‌నే విష‌యాన్నీ ప‌రోక్షంగా వెల్ల‌డించాడు. ఇటీవ‌ల జ‌రిగిన ద‌ళిత సాధికార‌త స‌మావేశానికి అంద‌రినీ పిలిచి త‌న‌కు ఆహ్వానం అంద‌క‌పోవ‌టం పై ఆయ‌న ఘాటుగా స్పందించాడు. పిల‌వ‌ని పేరంటానికి నేను వెళ్ల‌ను … చావ‌నైనా చ‌స్తాగానీ ఆత్మ‌గౌర‌వాన్ని చంపుకోను అని వ్యాఖ్యానించాడు. అత‌ని మాట‌ల వెనుక ఉన్న ఆవేద‌న వెల్ల‌డైంది. అప్ప‌టికే సీఎంకు, ప్ర‌వీణ్‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయింద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది. బ‌హుజ‌నుల‌కు రాజ్యాధికారం… స‌బ్సిడీలు, ఉచిత ప‌థ‌కాలు ఎంత‌కాలం .. మేమెప్పుడూ ఇలాగే ఉండాలా? మీదే పెత్త‌నమా..? మీరే ఉన్న‌త ప‌ద‌వుల్లో ఉంటారా? వ్యాపారాల్లో మీరే రాణిస్తారా? మేమెప్పుడు బానిస‌ల‌మా..? ఇలాంటి అభిప్రాయాలో ఉన్న ప్ర‌వీణ్ ప‌ట్ల ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉంటూ వ‌చ్చింది. గురుకులాల అభివృద్ది, విద్యార్థుల ప్ర‌తిభ పాట‌వాలు వెలికి తీసే విష‌యంలో ప్ర‌వీణ్ స‌క్సెస్ లాంటి మాట‌లు స‌హ‌జంగానే ఈ ప్ర‌భుత్వానికి కొంత కంట‌గింపుగా మారాయి.

పేరు, ప్ర‌తిష్ఠ‌, గుర్తింపు… ఇవ‌న్నీ ప్ర‌భుత్వం ఖాతాలో క‌దా ప‌డాలి. ఎవ‌రో అధికారి దీన్ని ఓవ‌ర్ టేక్ చేసి త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట కింద మార్చుకోవ‌డం ఏందీ? ఇక్క‌డే సీఎంకు న‌చ్చ‌లేదు. దూరం పెట్టాడు. అలా పెరిగిన గ్యాప్‌.. ప్ర‌వీణ్‌లో అణ‌గారి ఉన్న భావ‌జాలానికి మ‌రింత మేల్కొల్పింది. ఇక తాను చేయాల్సిన భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ పై దృష్టి పెట్టాడు. ద‌ళితుల‌కు తెలంగాణ‌లోనే కాదు.. దేశంలో కూడా ఇంకా ఎలాంటి ప్ర‌యోజ‌నం చేకూర‌లేద‌ని, అభివృద్ధి చెంద‌లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చాడు. ద‌ళిత ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌ను ఈ ప్ర‌భుత్వం చిన్న‌చూపు చూస్తుంద‌నే విష‌యాన్ని ఆయ‌న ప‌రోక్షంగా ఒప్పుకున్నాడు. అది మొద‌టి నుంచి ఓ కుట్ర‌లా అమ‌లు చేస్తున్నార‌ని చెప్పాడు. ద‌ళిత‌బంధు ప‌థ‌కంపై తానిప్పుడే స్పందించ‌న‌ని అన్న ఆయ‌న‌.. అంత‌కు ముందు ఓ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ పింఛ‌న్లు, స‌బ్సిడీలిచ్చి ఇంకెన్ని రోజులు మ‌భ్య‌పెడ్తార‌ని మాట్లాడాడు. మేమిక్క‌డే ఉంటాం… మీరు మాత్రం అన్నీ అనుభ‌వించండి …. ఓ రెడ్డి, ఓ వెల‌మ అధికారిని ఎవ‌రూ కులం పేరుతో ప్ర‌స్తావించ‌రు… ఎస్సీ, ఎస్టీలైతే కులం పేరుతో పిల‌వ‌ట‌మెందుకు?

ఆయ‌న వేసిన ప్ర‌శ్న‌లను, చేదు అనుభ‌వాల జ్ఞాప‌కాల‌ను చూస్తే ఈ ప్ర‌భుత్వంలో ఆయ‌న ఆత్మ‌భిమానం దెబ్బ‌తిన్న‌ద‌నే విష‌యం అర్థమ‌వుతున్న‌ది.

You missed