దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

ఉద్యమకారులను గుర్తించి వారికి 250 గజాల స్థలాన్ని, చనిపోయిన కుటుంబాలకు 25వేల పింఛన్‌ను ఇస్తామన్న రేవంత్‌ సర్కార్‌కు జేజేలు పలికారు ఉద్యమకారులు. ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీల్లో ఉద్యమకారులకిచ్చే స్కీంను కూడా చేర్చి దరఖాస్తులు తీసుకున్నారు. చాలా మంది కేసులు వివరాలు పోలీసుల నుంచి సేకరికంచి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మందికిపైగా దరఖాస్తులు చేసుకోగా.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వంద మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో పోలీసులు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టడంతో జైళ్ల పాలయిన వారు చాలా మందే ఉన్నారు. వారందరూ బీఆరెస్‌తోనే నడుస్తూ వచ్చారు మొన్నటి వరకు. కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఉద్యమకారులను గుర్తిస్తామని ప్రచారం చేసింది. వారికి ఇంటి స్థలం, పింఛన్‌ ఇస్తామని చెప్పడంతో కాంగ్రెస్‌కు సపోర్ట్‌ చేశారు. కేసీఆర్‌ తమను ఇన్నాళ్లూ పట్టించుకోలేదని మనోవేదన, ఆగ్రహం వారిలో నిబిడీకృతమై ఉన్నాయి.

మొత్తానికి కాంగ్రెస్‌ సర్కార్‌ వచ్చింది. ఆరు గ్యారెంటీల్లో ఉద్యమకారులకూ స్థానం ఇచ్చారు. అందరూ దరఖాస్తు చేసుకున్నారు. పోరాడినం.. ఇది మా హక్కు… మాకు ప్రభుత్వం ఇచ్చే ఆత్మగౌరవం అనుకున్నారే తప్ప ఎవరూ సంశయించలేదు. కేసుల వివరాలు తోడారు. పాత ఫోటోలు వెతికి బయటకు తీశారు. దరఖాస్తు చేసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. గత పాలకుల మాదిరిగా ఏదో చేస్తామని చెప్పి ఏళ్లకు ఏళ్లు కాలం గుడుపుతూ మోచేతికి బెల్లం పెట్టే పనికి ఇక చాన్స్‌ ఇవ్వమంటున్నారు ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కరిపె రాజు.. రేవంత్‌కు నెల రోజుల టైమ్‌ ఇచ్చాడు. ఫిబ్రవరి ఒకటి లోగా దరఖాస్తు చేసుకున్న ఉద్యమకారులకు ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేయకపోతే ఆందోళన చేస్తామని అల్టిమేటం జారీ చేయడం ఇప్పుడు చర్చకు తెర తీసింది.

కేసీఆర్‌ ఏమీ చేయలేదు.. మేమంతా అన్యాయానికి గురయ్యాం…రేవంత్ ఇది గ్రహించాడు. మంచిదే. మాటిచ్చాడు. స్వాగతించాం. కానీ ఆ మాట నిలబెట్టుకునేందుకు నెలలు, సంవత్సరాలు అవసరం లేదంటున్నారు. ఓ నెల రోజులు చాలంటూ గడువుకు ఇచ్చేశారు. ఇదో పెద్ద లెక్క కాదు. చేయాలనుకుంటే నెల రోజుల్లో చేసేయొచ్చు. గత పాలకుల్లా మాటలకే పరిమితమైతే దాని పర్యవసానాలు కూడా అలాగే ఉంటాయని హెచ్చరిస్తున్నారు ఉద్యమకారులు. ప్రచారంలో చాలా మాటలు చెప్పారు. అధికారంలోకి రాగానే వెంటనే పథకాలు అమలు చేస్తామన్నారు. కానీ అలా జరగలేదు. ఇదీ అలాగే పెండింగ్‌లో పెట్టేందుకు అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా తమ పథకాల సాధనకు మళ్లీ ఉద్యమాలకు సిద్దమవుతున్నారు ఇందూరు ఉద్యమకారులు.

You missed