(వాస్తవం- ఎక్స్‌క్లూజివ్..)
దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:
ఎన్నికల ముందు హడావుడిగా కేసీఆర్ సర్కార్ వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. హుటాహుటిన టెండర్లు పిలిచి పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నది. ఎన్నికల వేల నిధులు వరదలా వచ్చి వాలాయి. ఇక పనులు ప్రారంభం కావడమే లేటు. ఆలోపు ఎన్నికల కోడ్ వచ్చింది. మళ్లీ టీఆరెస్ సర్కారే వస్తుందని.. ఆ వెంటనే ఈ పనులన్నీ చేయొచ్చని టెండర్లు దక్కించుకున్న బీఆరెస్ పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు అనుకున్నారు. ఫలితాల కోసం ఎదురుచూశారు. కానీ ఊహించని షాక్..! కేసీఆర్ సర్కార్‌కు ఘోరమైన ఎదురుదెబ్బ. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డది. కానీ ఇంతకు మించిన షాక్ ఏంటంటే.. ఆ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టు సీఎం రేవంత్ వీటన్నింటినీ క్యాన్సిల్ చేయడం.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల పనులు ఆపేశారు. వీటిని చేయరాదంటే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా కామారెడ్డి, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తయ్యాయి. అగ్రిమెంట్ చేసుకుని ఇక పనులు ప్రారంభించడమే తరువాయి అనుకున్న బీఆరెస్ లీడర్లు, ఆ పార్టీ అనుబంధ కాంట్రాక్టర్లకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల ముందు తమ పార్టీకి లబ్ది చేకూరేలా, ఎన్నో పనులను క్రియేట్ చేశారు. అప్పటికప్పుడు శాంక్షన్స్ ఇచ్చేశారు సిట్టింగు ఎమ్మెల్యేలు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, బ్రిడ్జిలు, కమ్యూనిటీ హాళ్లు, కుల సంఘ భవనాలకు ప్రొసీడింగులు కూడా ఇచ్చేశారు.
కానీ ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క సంతకంతో ఇవన్నీ నిలిచిపోయాయి. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. భవిష్యత్తులో కూడా ఈ పనులను చేసేది లేదు. సాంక్షన్స్ ఇచ్చేది లేదు. టెండర్లు పిలిచేది లేదు. అసలు వాటి జోలికే వెళ్లేది లేదు. అంతే..! అవన్నీ బీఆరెస్ నేతల ఇంట్రెస్టెడ్ వర్కులన్న మాట. వాటిని మన నిధులతో ఎందుకు చేయాలి…? అలా చేస్తే పేరు వారికే కదా..? అనేది రేవంత్ సర్కార్ యోచన. అందుకే వీటినన్నింటినీ రద్దు చేసి పారేశారు.
ఒక్క నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోనే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో చేయాల్సిన పనులను ఒక్క పెన్ను పోటుతో క్యాన్సిల్ చేసిన రేవంత్ సర్కార్.. మిగిలిన జిల్లాలో కూడా ఇదే పద్దతిని అవలంభించింది. దీంతో ఓవైపు ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న బీఆరెస్ సిట్టింగులకు, ఈ పరిణామం మరింత మింగుడు పడనిదిగా తయారయ్యింది.