దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టే ఆత్మగౌరవ పోరాటం. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉద్యమంలో అన్నీ పోగొట్టుకుని త్యాగాలకు సిద్దపడ్డ ఉద్యమకారులకు మాత్రం ఆత్మగౌరవం లభించలేదు. పార్టీ గుర్తించలేదు. కేసీఆర్‌ పట్టించుకోలేదు. పదవుల మాట దేవుడెరుగు.. కనీసం మర్యాద నోచుకోని దుస్థితి. అవహేళనలు, చీదరింపులతో దారుణ పరిస్థితులు ఎదుర్కొన్న ఉదంతాలెన్నో.

కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పడగానే ఇది ఇక నుంచి ఫక్తు రాజకీయ పార్టీ.. అని ప్రకటించడం వెనుక వ్యూహమే ఉద్యమకారులను పక్కన పెట్టడం. ఎన్నో పోరాటాలు మరెన్నో కేసులు, జైలు జీవితాలు.. అయినా స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత కూడా కనీస గుర్తింపుకు నోచుకోని దౌర్బాగ్య పరిస్థితి. అడిగి అడిగి వేసారి… చుట్టు తిరిగి తిరిగీ విసిగిపోయి… మన పార్టీయే అధికారంలోకి వచ్చింది ఇక మన బతుకులు మారుతాయనే సంబరం ఎన్నో రోజులు నిలవలేదు. పక్కన పెట్టేశారు. ఏం చేసుకుంటారో చేస్కోండనే విధంగా రెచ్చగొట్టే దోరణిలో వ్యవహరించారు ఎమ్మెల్యేలు. ఇక చేసేదేమీ లేక.. అలా అవమానాల మధ్య భారమైన బతుకులీడుస్తన్న సమయాన .. రేవంత్‌ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం.. 25వేల పింఛన్‌ ఇస్తామని ఆరు గ్యారెంటీల స్కీంలలో ప్రత్యేక స్థానం ఇవ్వడంతో మూలకు పడ్డ ఉద్యమకారుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు వీరంతా దరఖాస్తుల కోసం బారులు తీరారు. అవును.. అప్పుడు దొర పట్టించుకోలే. రేవంత్ తెలంగాణ వ్యతిరేకని దుమ్మెత్తిపోసిన చేతులే ఇప్పుడు చేతులు జోడించి నువ్వేరా మాకు అసలైన దిక్కు అంటూ మొక్కుతున్నాయి. కారణం.. వారి అస్థిత్వాన్ని కాపాడే ప్రయత్నం చేయడం. లాఠీల దెబ్బలు, జైలు జీవితాలు అనుభవించిన తెలంగాణ ఉద్యమకారులను వాస్తవంగా బీఆరెస్‌ పెద్దగా పట్టించుకోలే.

వారికి పదవులేమో గానీ పక్కన పెట్టి ఎవరి కోటరీ వారు నిర్మించుకున్నారు. ఉంటే ఉండండి.. లేకపోతే పార్టీ మారండి.. మాదే రాజ్యం అని విర్రవీగిన ఆ క్షణాలు గుర్తు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు వీరంతా. అందుకే రేవంత్‌ ఈ స్కీం పక్కాగా అమలు చేస్తే దొర దగ్గర పడ్డ అవమనాలకు ఇదే విరుగుడుగా భావిస్తున్నారు. పార్టీ మారేందుకూ సంకోచించడం లేదు.

You missed