ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అనుకోని అతిథులు వస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా పెద్ద తలకాయలు ఇక్కడి నుంచి పోటీ చేయడంతో పలు నియోజకవర్గాలకు క్రేజ్‌ పెరిగింది. మొదట సీఎం కేసీఆర్‌ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాను వార్తల్లో నిలిపారు. కామారెడ్డి నుంచి తను పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన మరుక్షణం నుంచి ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతూ వచ్చాయి. టికెట్ల విషయంలో ప్రతిపక్షాలు తీవ్ర జాప్యం చేస్తూ వచ్చాయి.

మొత్తానికి శుక్రవారం కాంగ్రెస్‌ రెండో జాబితాను భారీ కసరత్తు తరువాత విడుదల చేసింది. కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ నేపథ్యంలో అక్కడి నుంచి షబ్బీర్‌ను నిజామాబాద్‌ అర్బన్‌కు షిఫ్ట్ చేసి రేవంత్‌ను పోటీలో నిలిపారు. దీంతో కామారెడ్డి మరింత వార్తల్లో కేంద్రబిందువుగా మారింది. ఇక్కడ అర్బన్‌లో అనుకోని అతిథిగా షబ్బీర్‌ రావడం ఎవరూ ఊహించని పరిణామం. బాన్సువాడ నుంచి ఏనుగు రవీందర్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న రోజే క్యాండిడేట్‌గా ప్రకటించబడ్డాడు.

ఎల్లారెడ్డి నుంచి మదన్‌మోహన్‌రావు, జుక్కల్‌ నుంచి లక్ష్మీకాంతరావు అభ్యర్థిత్వాలను అధిష్టానం ఫైనల్ చేసింది. నిజామాబాద్‌ రూరల్ అభ్యర్థి విషయంలో ఇంకా ఊగిసలాటే కొనసాగుతుండగా…. భూపతిరెడ్డికే ఇస్తారని ఆ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేయడమే ఈ అనూహ్య మార్పులకు కారణంగా చెప్పవచ్చు. కామారెడ్డి నియోజకవర్గం ఇప్పుడు కీలకంగా మారింది. ఇక్కడ సీఎం కేసీఆర్‌ మెజారిటీ విషయంలో సర్వత్రా చర్చకు వస్తున్న నేపథ్యంలో మేమేన్న తక్కువా అంటూ రేవంత్‌ పోటీకి దిగాడు.

మీరంతా పొలిటికల్‌ టూరిస్టులు… నేనే గెలుస్తా అంటూ వెంకటరమణారెడ్డి కత్తులు దూస్తున్నాడు. అర్బన్‌లో షబ్బీర్‌కు మైనార్టీ మంత్రమే ప్రధానంగా పనిచేయనుంది. ఆ తరువాత మున్నూరుకాపుల బలం తోడవనుంది. ఈ క్రమంలో చాలా చోట్ల పోటీ గట్టిగానే ఉండే అవకాశం ఉంది.

 

 

You missed