మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆరెస్‌కు రాజీనామా చేసిన తరువాత ఆమె రాహుల్‌గాంధీ నిజామాబాద్‌ పర్యటన సదర్భంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరుదామని అంతా రెడీ చేసుకున్నారు. కానీ జిల్లాలోని నేతలంతా మూకుమ్మడిగా ఆమె రాకను అడ్డుకున్నారు. దీంతో అప్పుడే ఇది రాజకీయంగా పెద్ద చర్చకు తెర తీసింది. ఆనాటి నుంచి ఆకుల లలిత సరైన సమయం కోసం ఎదురుచూస్తూ వస్తున్నారు.

శుక్రవారం ఆకుల లలిత … కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో ఖర్గే సమక్షంలో పార్టీలో చేరడంతో ఇందూరు కాంగ్రెస్‌ రాజకీయాల్లో సర్వత్రా చర్చకు తెర లేపింది. ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. ఢిల్లీలో కూడా ఆమె రాకను అడ్డుకుంటున్నారని, ఆమె పార్టీలో చేరలేదనే ప్రచారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో జరిగింది. ఫోటోలు బయటకు వచ్చిన తరువాత గానీ ఎవరూ నమ్మని పరిస్థితి నెలకొన్నది. మొత్తానికి ఆమె పార్టీలో చేరడం ఖాయమైన నేపథ్యం అర్బన్‌ కాంగ్రెస్‌ను ఓ కుదుపు కుదిపింది.

ఆమె రాకను దాదాపు నేతలంతా వ్యతిరేకిస్తున్న సమయంలో వీరందరినీ కాదని, ఆమె పార్టీలో చేరడంతో అంతా అవాక్కయ్యారు. ఇది అర్బన్‌ కాంగ్రెస్‌ నేతలకే కాదు.. రేవంత్‌ రెడ్డికి కూడా షాక్‌నిచ్చింది. ఇక్కడి నేతల సూచనతో ఆమె రాకను అడ్డుకున్నది ఆయనే. కనీసం పీసీసీ చీఫ్‌కు సమాచారం లేకుండా ఢిల్లీ వెళ్లి ఆమె పార్టీలో చేరడం కూడా తీవ్ర చర్చకు తెర తీసింది.

You missed