కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేయడమేమో గానీ అక్కడ బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి హీరో అవుతున్నాడు. ప్రజల నాలుకల్లో నానుతున్నాడు. ఎందుకంటారా..? మొన్నటికి మొన్న తను కేసీఆర్‌పై గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చాలెంజ్‌ చేసి రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు తెరలేపాడు. ఇప్పుడేమో సొంతంగా తన డబ్బులతో ఓ మేనిఫెస్టోను తయారు చేసి రిలీజ్‌ చేశారు. అదీ నూట యాభై కోట్లతో. ఇప్పటికే వంద కోట్ల వరకు నియోజకవర్గంలోని వివిధ పనులకు ఖర్చు చేసి ఎన్నికలకు రెడీ అయి కూర్చున్న రమణారెడ్డి… ఇప్పుడు సొంత మేనిఫెస్టోను తయారు చేసి ఏ మండలానికి ఏమేమీ చేస్తానో కూడా ప్రకటించడం మరోసారి సంచలనం సృష్టించింది.

కేటీఆర్‌ ఇక్కడ కేసీఆర్‌ గెలుపు కోసం చమటోడుస్తున్న వేళ…. ఊరికో మేనిఫెస్టో అమలు చేస్తామని ప్రకటించడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పట్టింది. ఇదేందీ… స్వయంగా ఉద్యమ నేత కేసీయారే పోటీ చేస్తున్నా.. ఇంతలా శ్రమపడాలా..? ఇంతలా భయపడాలా..? ఇంతలా ఖర్చు పెట్టాలా..? మరీ ఊరికో మేనిఫెస్టోనా..? అని కొందరు చర్చించుకున్నా .. అది పట్టించుకునే పరిస్థితిలో కేటీఆర్‌ లేడు. ఎవరమనుకుంటే మాకేందీ..? భారీ మెజారిటీ రావాలె.. అంతే. ఈ దెబ్బకు వాస్తవంగా ప్రతిపక్షాలు డీలా పడాలా..! మాతో కాదురా నాయన మీతో పెట్టుకోవడమని అస్త్ర సన్యాసం చేయాలె. కానీ ఈ రమణారెడ్డి అలా చేయడం లేదు. ఇదే మంచి తరుణం అనుకున్నాడు.

మొన్నటికి మొన్న రాజకీయ సన్యాసం అస్త్రం సంధించి అందరి దృష్టిని ఆకర్షించిన అతను.. ఇప్పుడు సొంత పైసలతో … అదీ 150 కోట్లతో ప్రజలకు విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పిస్తానని ప్రకటించడం ఓ విశేషమే. ఇది బీజేపీ పార్టీని కాదని చేసిందే. తను బీజేపీని ఓ ప్లాట్‌ ఫామ్‌గా మాత్రమే భావిస్తున్నాడు. రేపు ఆ పార్టీ టికెట్‌ ఇవ్వకున్నా.. సొంతంగా పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అసలే అక్కడ బీఆరెస్ నేతలది తలోదారి. వారిని గాడిలో పెట్టేందుకు కేటీఆర్‌ తండ్లాడుతున్నాడు. మరోవైపు ఇలా బీజేపీ అభ్యర్థి రూపంలో మరో తలనొప్పి. మొత్తానికి కామారెడ్డి రాజకీయాలు రాష్ట్ర వ్యాప్త చర్చలో భాగమయ్యాయి.

You missed