ఇందూరు నుంచి కాంగ్రెస్ రెండు సీట్లు గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి జిల్లా పెద్దన్నగా అంతా తానై వ్యవహరిస్తారని భావించినా ఆయనకు అంత సీన్ లేదని అధిష్టానానికి అర్థం అయ్యింది. అందుకే కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కన్వీనర్, ఖమ్మం మాజీ ఎంపీ ఉల పొంగులేని శ్రీనివాస్‌రెడ్డిని రంగంలోకి దింపింది. నిజామాబాద్ అర్బన్ నుంచి ఆకుల లలితకు గాలం వేశాడు పొంగులేటి. అర్బన్ కాంగ్రెస్ టికెట్ ఇస్తామని మధ్యవర్తిత్వం నడిపినట్టు తెలిసింది. ఇప్పటికే బీఆరెస్‌లో లలితకు ఎమ్మెల్సీ ఇస్తామనే హామీ ఉంది. అయినా ఎక్కడో లలితకు పార్టీలో అసంతృప్తి ఉంది. దీంతో ఆమె అర్బన్ నుంచి పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తందనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఆకుల లలితను పార్టీలోకి గుంజాలని చూస్తోంది.
మధుయాష్కీ, మహేష్ కుమార్ గౌడ్‌లకు కూడా ఆకుల లలిత పార్టీలోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నారు. మధుయాష్కీ, మహేష్‌లు ఆర్మూర్ నుంచి ఎవరికో ఒకరికి టికెట్ ఇస్తే.. నిజామాబాద్ పార్లమెంటు బరిలో ఇద్దరు బీసీలకు ఇచ్చినట్టు అవుతుందనే లెక్కలు వేసుకుంటున్నారు. కానీ ఆకుల లలిత నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇంకా ఆమె వేచి చూసే దోరణినే అవలంభిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బోధన్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్‌ను విబేధించి… బయటకు రావడానికి సిద్దంగా ఉన్న బోధన్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ భర్త, కౌన్సిలర్ తూము శరత్ రెడ్డితో కూడా పొంగులేటి సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. తూము శరత్ రెడ్డి తనతో పాటు పదుల సంఖ్యలో కౌన్సిలర్లను తీసుకొని కాంగ్రెస్‌లో చేరేందుకు సంసిద్దమయ్యాడు. విచిత్రమేమిటంటే.. షకీల్ ఓటమికి కంకణం కట్టుకున్న శరత్‌రెడ్డితో ఇప్పటి వరకు సుదర్శన్‌రెడ్డి కనీసం మాట్లాడలేదు. బలవంతంగా అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టుగానే ఉంది పరిస్థితి.
బీజేపీలోకి వెళ్దామంటే.. తనతో పాటు ఎంఐఎం కార్పొరేటర్లు కూడా చాలా మంది వచ్చేందుకు సిద్దమయ్యారు. బీజేపీ అంటే వీరంతా రాకుండా ఆటంకం కలుగుతుందని, తూము శరత్‌రెడ్డి కాంగ్రెస్‌నే ఎంచుకున్నాడు. దీంతో పొంగులేటితో జరిగిన చర్చలు సఫలమయినట్టుగానే భావిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల్లో కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని అధిష్టానం భావిస్తోంది. అందుకే మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి డమ్మీగా భావించి పొంగులేటిని రంగంలోకి దింపాడు రేవంత్‌రెడ్డి. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందూరు పాలిటిక్స్ పై సీరియస్‌గా నజర్ పెట్టాడు.