పసుపు బోర్డు రాజకీయం మరోసారి కొత్త ఎత్తులను సంతరించుకొని ఎన్నికలవేళ రైతుల ముంగిటకు రానున్నట్లు బిజెపి వర్గాల్లో కొన్ని రోజులుగా అంతర్గతంగా జోరందుకున్నది. ప్రధాని నరేంద్ర మోడీ సభను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నిర్వహింపజేసి ఈ సభలో ప్రధానితో పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రకటన చేయించనున్నట్లు బిజెపి తోబాటు బయట రాజకీయ చర్చల్లోనూ వినిపిస్తున్నది. పసుపు బోర్డు హామీల కొనసాగింపు బాండ్ పేపర్ నుంచి ‘ప్రధాని బ్రాండ్’ దిశగా మలుపు తీసుకుంటున్నట్లు తాజా ప్రచార పరిణామాలను రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపును అందించిన బాండ్ పేపర్ హామీ రానున్న ఎన్నికల్లో బిజెపికి ఎదురు గాలి వీచేలా మారడంతో పసుపు బోర్డు హామీకి ఏకంగా ప్రధాని బ్రాండ్ ను అద్దే వ్యూహంలో అరవింద్ టీం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

పసుపు బోర్డు సాధిస్తానని.. లేదంటే తన పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి హామీ ఇచ్చిన అరవింద్ ఎంపీగా గెలిచాక పసుపు బోర్డు పై మాట తప్పాడనే విమర్శలను తీవ్రస్థాయిలో ఎదుర్కొన్నారు. అటు తరువాత నిజామాబాదులో స్పైస్ బోర్డు సంబంధిత కార్యాలయాన్ని ఏర్పాటు చేయించి దానిని పసుపు బోర్డు కంటే మించిన దానిగా చెప్పుకొచ్చాడు. పసుపు బోర్డు అంబాసిడర్ కారు లాంటిది అయితే తాను తీసుకొచ్చిన సెంటర్ బెంజ్ కారు లాంటిదని అభివర్ణించాడు కూడా. కానీ రైతులు అరవింద్ వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. మాట తప్పావని నిలదీశారు. ఇలా కాలం గడిచిపోయింది. ఎన్నికలు సమీపించాయి. ఇలాంటి తరుణంలో పసుపు బోర్డు కేంద్రం ఇవ్వనున్నట్లు, ఈ ప్రకటన స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడియే చేయబోతున్నట్లు సరికొత్త ప్రచారం జరుగుతున్నది .

జిల్లా బిజెపి వర్గాల్లో దీనిపై జరుగుతున్న చర్చ ప్రకారం ఆర్మూర్ లో ప్రధాని మోదీ సభ జరిగే అవకాశాలే ఉన్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ జరిగితే.. ప్రధాని వచ్చి పసుపు బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెళ్తారా..? లేక ఏర్పాటు చేస్తామని ఎన్నికలవేళ హామీ ఇచ్చి వెళతారా..? అనే ఆసక్తి మొదలవుతున్నది. ఒకవేళ ప్రధాని ఈ మేరకు ప్రకటిస్తే ఇప్పటివరకు తాను తెచ్చినట్లుగా అరవింద్ చెప్పుకుంటున్న బెంజ్ కారు లాంటి ఆఫీసును ఏమని పిలవమంటారో వేచి చూడాలి. ఈ వ్యవహారం అంతా రైతుల వద్ద బాండ్ పేపర్ లాగా విఫలయత్నంగా మిగిలి పోతుందా లేక రైతులు మరో హామీలో మునిగి పోవాల్సి వస్తుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

You missed