బీడీ కటాఫ్ డేట్ ఎత్తేసి ఏడాదవుతుంది. ప్రభుత్వం జీవో ఇచ్చింది వదిలేసింది. అప్పటి వరకు 2014 ఫిబ్రవరి 28 వరకు పీఎఫ్ కార్డులున్న వారికి మాత్రమే బీడీ పింఛన్ వచ్చింద. ఏడాది క్రితం గవర్నమెంట్ ఈ కటాఫ్ డేట్‌ను ఎత్తేసి కేవలం పీఎఫ్ కార్డుంటే చాలు పింఛన్ ఇచ్చేస్తామని జీవో తెచ్చింది. అప్పట్నుంచి కొత్త పీఎఫ్ కార్డులు మార్కెట్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. పదివేలకు పైగా వసూళ్లు చేసి కొంత మంది టేకేదార్లు పీఎఫ్ కార్డులు ఇచ్చేశారు.పీజీలు, డిగ్రీలు చేసిన వారికి కూడా ఇప్పుడు బీడీ పీఎఫ్ కార్డులొచ్చేశాయి. దీంతో వీరంతా కలెక్టరేట్లకు క్యూ కట్టారు. దరఖాస్తు చేసుకోవడానికి.
ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణిలో ఇవే దరఖాస్తలు కుప్పలు తెప్పలుగా. ఉత్తర తెలంగాణలో అత్యధికంగా బీడీలు చేసేవారు నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత కోరుట్ల, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, కామారెడ్డిలలో ఉన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ్నుంచి లక్షమంది వరకు బీడీ పింఛన్ తీసుకునేందుకు పీఎఫ్ కార్డులతో రెడీగా ఉన్నారు. ఎ పీఎఫ్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, ఆదాయ ధ్రువీకరణ… సమర్పించి దరఖాస్తులు చేసుకున్నారు. బీడీ పింఛన్ పేరుతో దోచుకునే వాళ్లు దోచేసుకున్నారు. కానీ ఇక్కడ దరఖాస్తులు మాత్రం అలాగే పేరుకుపోయాయి. వాటిని పట్టించుకునేవారు లేరు.
ఇక ఇప్పుడు ఎన్నికల సీజనాయే. ఇక రాజపోతాయా అనే ధీమాతో ఉన్నారు ఈ లక్షమంది. ఇందులో నిజంగా బీడీలు చేస్తూ పీఎఫ్ కార్డులు కలిగి ఉన్నవారూ ఉన్నారు. కొత్తగా పీఎఫ్ కార్డులతో పుట్టుకొచ్చివారే చాలా మంది ఉన్నారు. ఈ లెక్క తేలాలంటే ఎంక్వైరీ చేయాలే. అదిప్పుడు సాధ్యమా..? అందులో ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. తాజాగా కమ్మర్‌పల్లి మండలంలో జరిగిన ఓ సభలో ఎమ్మెల్సీ కవిత బీడీ పింఛన్లు త్వరలో అందరికీ వస్తాయి..బెంగ పడకండి అని హామీ ఇచ్చేసరికి.. బీడీ పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వీరిందరిలో కొత్త ఆశలు చిగురించాయి.