ఇప్పుడు కొత్తగా జమిలి ఎన్నికల వార్తలు వైరల్ అవుతున్నాయి. బీజేపీ క్రమంగా బలహీనపడుతూ , కర్ణాటకా ఫలితాలతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలపడుతున్న నేపథ్యంలో…అత్యసవర పార్లమెంటు సమావేశాలు పెట్టి మూడు బిల్లులకు ఆమోదం తెలిపాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఒకటి జమిలీ ఎన్నికలు వెళ్లాలని బీజేపీ భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. త్వరలో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమి పాలైతే.. పార్లమెంటు ఎన్నికల్లో ఇక కోలుకోలేని దెబ్బ పడుతుందని కేంద్రం భయపడుతోందనే వాదన వినిపిస్తున్నారు.
దీనికి తోడు మోడీ పట్ల కొంత వ్యతిరేకత ఉన్నా.. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుందనే అంచనాల్లో కూడా ఆ పార్టీ శ్రేణులున్నాయి. జమిలీ ఎన్నికలు జరిగితే .. అసెంబ్లీకి కూడా అయాచితంగా ఓట్లు పడి కొన్ని సీట్లు గెలవచ్చని, ప్రాంతీయ పార్టీలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెక్ పెట్టి .. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయొచ్చనేది కేంద్రం వ్యూహంగా ప్రచారం చేస్తున్నారు. కానీ అంతసీన్ లేదు. అసలు అసెంబ్లీ ఫలితాలకు, పార్లమెంటు ఎన్నికలపై ప్రభావానికి పొంతన లేదు. సంబంధమే లేదు. గత ఎన్నికల చరిత్ర చూసుకుంటే ఇవే చెబుతున్నాయి. అసెంబ్లీలో బీజేపీని చిత్తుగా ఓడించినా.. కేంద్రంలో మోడీ ఉండాలనుకుంటే పువ్వు గుర్తుకే ఓటేస్తారు. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏమాత్రం పట్టించుకోరు ఓటర్లు.
అలాగే ఇప్పుడు ప్రచారం జరుగుతున్న జమిలీ.. అంటే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒక్కసారి పెట్టినా.. రెండు ఓట్లు ఒకే పార్టీకి పడతాయని భావించడం కూడా మూర్ఖత్వమే. ఎందుకంటే గతంలోనే ఓటరు ఎంతో చైతన్యవంతంగా ఓటేశాడు. అసెంబ్లీకి ఓ పార్టీకేస్తే.. పార్లమెంటుకు మరో పార్టీకి వేశాడు.కేవలం ఓ ఐదారు శాతం మాత్రమే ఇంట్లో చెప్పిన మాటలను బట్టో, ప్రభావితం చేయడాన్ని బట్టో రెండు ఓట్లు ఒకే పార్టీకి వేస్తారు తప్ప.. గంప గుత్తగా అసెంబ్లీ, పార్లమెంటు ఏ ఒక్కపార్టీ రెండ్రెండు ఓట్లు వేయరు. వేర్వేరుగానే పడతాయి. ఎవరి ఆలోచన వారిదే. కేంద్రంలో రాహుల్ ఉండాలి అనుకుంటే… పార్లమెంటు ఓటు చేతికి పడుతుంది.. రాష్ట్రంలో కేసీఆర్ ఉండాలి అనుకుంటే అసెంబ్లీ ఓటు కారుకే పడుతుంది. ఈ చరిత్ర కేంద్రానికి తెలియని కాదు. ఇవన్నీ ప్రచారాలు మాత్రమే. అయితే బీఆరెస్ మీద వ్యతిరేకంగా ఉన్న సెక్షన్ జమిలీ ఎన్నికలు జరగుతాయి అని బాగా ప్రచారం చేస్తోంది. దీనికి ఓ వాదనను కూడా జోడిస్తోంది. కేసీఆర్ పాలన టైమ్ అయిపోగానే.. మళ్లీ ఓ మూడు నెలల పాటు జమిలీ కోసం ఆగాల్సి వస్తుంది.. అప్పుడు అధికారం చేతిలో ఉండదు.. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు ప్రచారం చేయలేక నీరుగారి పోతారు.. విపరీతమైన ఖర్చు పెట్టాలి… అలా బీజేపీ .. కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకుని ఇటు కాంగ్రెస్‌ను, అటు బీఆరెస్‌ను కట్టిడి చేసి తను బలోపేతం కావాలని చూస్తోంది.. అనే ప్రచారాన్ని వైరల్ చేస్తున్నారు.
కానీ.. ఇవన్నీ ప్రచారాలే. అంచనాలే. ప్రాక్టికల్‌గా ఇదంతా సాధ్యం కాదు. క్షేత్రస్థాయిలో ఓటరును అంత తక్కువ అంచనా వేయడం.. కేంద్రం ఇలా ఆలోచించి ముందడుగు వేస్తోంది.. ముందు జాగ్రత్త తీసుకుంటుంది..అనే వాదనలు.. విశ్లేషణలూ ఉత్తవే. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ గాలి కబుర్లు. మాటలతో మభ్యపెట్టి భయపెట్టే దోరణి… బీజేపీ బలపడాలనే దింపుడుకళ్లెం ఆశలాంటిదే అని చెప్పాలి.