ప్రజారాజ్యం పార్టీ వారి బంధాన్ని కలిపింది. స్నేహబంధంగా ఏర్పడింది. ఈరవత్రి అనిల్‌… గోర్త రాజేందర్‌. వీరిద్దరూ అప్పట్నుంచి ఇప్పటి దాకా స్నేహితులు. బాల్కొండ నుంచి పీఆర్పీ నుంచి టికెట్‌ తీసుకుని గెలిచిన ఈరవత్రి అనిల్ ఇప్పుడు ఆర్మూర్‌ కాంగ్రెస్‌ నుంచి గోర్త రాజేందర్‌కు టికెట్ ఇప్పించాలనే యత్నంలో ఉన్నాడు. దీని కోసం మధ్యవర్తిత్వం నెరుపుతున్నాడు. అయితే ఇక్కడ నుంచి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన వినయ్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నాడు. వినయ్‌రెడ్డికి కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ఫుల్‌ సపోర్టుగా ఉన్నాడు. అసలు గోర్త రాజేందర్‌ను క్యాండిడేట్‌గానే ఆయన చూడటం లేదు.

ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీలో లేడు. ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. నియోజవకర్గంపై అవగాహన లేదు అంటూ అధిష్టానానికి నివేదిస్తున్నాడు మానాల మోహన్‌రెడ్డి. వినయ్‌రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసి పద్దెనిమిదివేల ఓట్లు సాధించినవాడు… నియోజకవర్గంలో క్యాడర్ కలిగి ఉన్నవాడు.. కాంగ్రెస్‌లోకి వస్తే మేలు జరుగుతుందనే వాదన వినిపిస్తూ వస్తున్నాడు. దీంతో ఇప్పుడు బాల్కొండ కేంద్రంగా ఆర్మూర్‌ టికెట్ బీసీకా.. రెడ్డికా ..?? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే అనిల్‌ బాల్కొండ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకోగా… మోహన్‌రెడ్డి కూడా బాల్కొండ నుంచే దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇక్కడ సునీల్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నది.

అయితే నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇద్దరు బీసీలకు టికెట్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ యోచిస్తున్నది. ఇప్పటికే నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం బీసీలకే ఫైనల్ అయ్యింది. అభ్యర్థి పేరే తరువాయిగా ఉంది. ఇక రెండో బీసీ టికెట్ ఆర్మూర్‌కు ఇద్దామనుకున్నారు. దీంతో మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన గోర్త రాజేందర్‌కు ఆశలు పుట్టాయి. ఇక్కడ నుంచి ఈరవత్రి అనిల్‌ సహకారంతో పార్టీ టికెట్‌ ఆశిస్తున్నాడు. శనివారం పార్టీలో చేరాడు. కానీ అతనికి టికెట్‌ ఇచ్చే యోచనలో అధిష్టానం లేనట్టుగా తెలుస్తోంది. ఆర్మూర్‌లో పెద్ద బహిరంగ సభ పెట్టాలని వినయ్‌రెడ్డి యోచిస్తున్నాడు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని పిలిపించుకుని..ఒక రకంగా తానే అభ్యర్థిననే సంకేతం ఇవ్వాలని భావిస్తున్నాడు.

త్వరలో ఈ సభను పెట్టేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. వినయ్‌రెడ్డి కూడా జీవన్‌రెడ్డిని అన్ని విధాలుగా సత్తా ఉన్నోడేం కాదు… దీంతో కాంగ్రెస్‌కు అంతకుమించి గత్యంతరం కూడా ఏమీ లేకుండా పోయింది. రెండో బీసీ టికెట్‌ ఇవ్వదలిస్తే బాల్కొండకు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో అనిల్‌ బాల్కొండ ఖరారు చేస్తూ సునీల్‌కు సున్నం పెట్టినట్టే అవుతుంది. కానీ ప్రశాంత్‌రెడ్డి గెలుపు మరింత నల్లేరు మీద నడకే అవుతుంది. దీంతో ఏమి చేయాలో అధిష్టానానికి పాలు పోవడం లేదు. ఈరవత్రి అనిల్‌కు బాల్కొండలోనే అంత సీన్‌లేదు… ఇక ఆర్మూర్‌లో ఫైరవీ చేస్తే అధష్టానం వింటుందా..? అనేది ఆ పార్టీలోని ఓ వర్గం చేస్తున్న వాదన.

You missed