కాంగ్రెస్‌ నుంచి పోటీకి ఆర్మూర్‌ నుంచి పోటీ చేసే ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నుంచి మొదలుకొని వినయ్‌రెడ్డి, ధర్మపురి సంజయ్‌, ఈరవత్రి అనిల్‌… ఇప్పుడు తాజాగా డాక్టర్‌ మధుశేఖర్‌ కోసం చూస్తోంది కాంగ్రెస్‌. గత కొంతకాలంగా బీఆరెస్‌ నాయకుల వైఖరితో విసిగిపోయి అసంతృప్తితో ఉన్నాడు మధుశేఖర్‌. తనకు ఎమ్మెల్సీ ఇస్తామని గత ఎన్నికల్లో మాటిచ్చి తీసుకొచ్చారు.

కానీ ఆ తర్వాత పట్టించుకున్న నాథుడు లేడు. ఏవో ప్రోగ్రాంలకు చుట్టపుచూపుగా పిలిచి స్టేజీల మీద మర్యాదతో మాట్లాడి పంపడమే తప్ప తనకు పదవీయోగాన్ని మాత్రం కల్పించలేకపోయారు జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డిలు. ఇక లాభం లేదని తన సొంత దారి తను చూసుకోవాలనే యోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అనుచరుల ఒత్తిడి కూడా పెరుగుతూ వస్తోంది. ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్‌ .. ఆర్మూర్ బరి నుంచి పోటీ చేస్తావా..? రా మా పార్టీలోకి అని రారామమ్మంటూ ఆహ్వానిస్తోంది.

గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసిన అనుభవం మధుశేఖర్‌కు ఉంది. దీనికి తోడు చేయూత స్వచ్చంధ సంస్థ ద్వారా పలు ఉచిత వైద్య సేవలు అందించి అందరి మన్ననలు పొందారు. ఎస్సీ సామాజికవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. తను ఇప్పుడు సైలెంటుగా ఉంటే ఇక తన రాజకీయ భవిష్యత్తు శూన్యమేననే అభిప్రాయానికి ఆయన వచ్చినట్టు తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్‌ నుంచి పిలుపు రావడం, అనుచరుల ఒత్తిడి పెరగడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట. ఇప్పుడు మధుశేఖర్‌ ఆర్మూర్‌ పొలిటికల్‌ చౌరస్తాలో ఉన్నాడు. ఎటుపోవాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు. త్వరలో ఏదో ఒక నిర్ణయం మాత్రం కచ్చితంగా తీసుకునేలా కనిపిస్తోంది.

You missed