ఎమ్మెల్యేలు స్థానికంగా అందుబాటులో లేకపోవడం.. కార్యకర్తలు, నాయకులు ఫోన్ చేసినా స్పందించకపోవడం తదితర వ్యవహార శైలి పార్టీకి నష్టం కలిగించింది. ఇది కొన్ని చోట్ల జరిగింది. ఈ నష్టనివారణకు పూనుకున్నారు ఎమ్మెల్సీ కవిత. మళ్లీ జిల్లాలో పార్టీ క్లీన్ స్వీప్ చేసే దిశగా తీసుకెళ్లేందుకు ఆమె పోస్టుమార్టం మొదలుపెట్టింది. దీనికి బోధన్ నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టింది. శుక్రవారం బోధన్ ఎమ్మెల్యేతో నవీపేట మండల పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆమె సుధీర్ఘంగా భేటీ అయ్యారు. సమస్యలపై ఆరా తీస్తూనే.. రిపోర్టు నోట్ చేసుకుంటూనే తానున్నానని వారి చెప్పే ప్రయత్నం చేశారు.
మళ్లీ బోధన్‌లో గులాబీ జెండా ఎగరాలనే సంకల్పంతో పనిచేయాలని సందేశం ఇస్తూనే… గ్రామ స్థాయిలో ఒకరిని ఇన్చార్జిగా నియమిస్తూ వారికి నిరంతరం తాను అందుబాటులో ఉంటానని, స్థానికంగా పార్టీకి ఉన్న లోటుపాట్లు లోపాలను సరిదిద్దాలను ఆమె ఉపదేశించారు. ఇలా బోధన్ నియోజవకర్గంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీపై రివ్యూ చేయనున్నారు. ఎమ్మెల్యే షకీల్ దుందుడుకు వైఖరి, ఎంఐఎంతో కయ్యానికి కాలుదువ్వి రచ్చరచ్చ చేసుకోవడం పార్టీకి నష్టం జరిగినట్టుగా అధిష్టానం భావిస్తోంది.
దీన్ని సీరియస్‌గా తీసుకున్నది. అందుకే కవిత మొదటగా బోధన్‌పై ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత అర్బన్, ఆర్మూర్‌లపైనా ప్రధానంగా కవిత దృష్టి కేంద్రీకరించనున్నట్టు తెలుస్తోంది. అర్బన్‌లో కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు తలోదిక్కుగా ఉన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ వీడేందుకు కూడా కొందరు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీని, కార్యకర్తలు, నాయకులను కాపాడుకునేందుకు ఆమె రంగంలోకి దిగనున్నారు. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత వల్ల వేరే పార్టీలవైపు చూస్తున్న కార్యకర్తలు, నాయకులకు తానున్నాననే భరోసా ఇచ్చేందుకు కవిత సిద్దమయ్యారు.
నిజామాబాద్ జిల్లాలో ఐదింటికి ఐదు నియోజకవర్గాలను గెలిపించుకునే అంశాన్ని ఆమె చాలెంజింగ్‌గా తీసుకున్నారు. పొలిటికల్ కామెంట్లకూ, కౌంటర్లకూ పదను పెట్టారు. ఆమె కార్యాలయ నెంబర్‌ను విడుదల చేసి నిరంతరం జనాలకు అందుబాటులోకి వచ్చారు. ఇక నియోజకవర్గాల వారీగా పోస్టుమార్టానికి సిద్దమయ్యారు. ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.