రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా…
రక్త బంధం విలువ నీకు తెలియదురా..
చాలామంది ఎమ్మెల్యేలు తెలవ కుండొచ్చు కని సాయిచంద్ అందరికీ తెలుసు.
ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు తెలంగాణ సభ. అప్పటికే రాత్రి అయింది. విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతున్నరు. ఇంతలో ఓ యువకుడు మైక్ అందుకొని..
రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా
రక్త బంధం విలువ నీకు తెలియదురా
నుదుటి రాతలు రాసే ఓ దేవ దేవా
తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా..
…అని మిట్టపల్లి సురేందర్ రాసిన పాట పాడుతుంటే అందరి కండ్లల్ల నీళ్లు తిరిగినయి. అప్పటికే ఎందరో అమరులైండ్రు. వారి తల్లుల కడుపు కోతను గానం చేస్తుంటే..అక్కడికెళ్లి ఎవరూ కదల్లేక పోయారు. పాడింది సాయి చంద్ అనే కళాకారుడు అని అప్పుడే తెలిసింది. అప్పటినుంచి ఇప్పటిదాకా సాయి చంద్ అనగానే నాకైతే ఆ పాటే..ఆ జ్ఞాపకమే యాదికొస్తది. తెలంగాణ ఉద్యమం కోసం పాటలై గర్జించి.. తెలంగాణ వచ్చాక టీఆరెస్ కు పాటల కోటైండు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎక్కడ మీటింగ్ పెట్టినా వాళ్లు వచ్చే వరకు ఆట పాటలతో సభను నడిపింది సాయి చందే. చాలామంది ఎమ్మెల్యేలు తెలవ కుండొచ్చు కని సాయిచంద్ అందరికీ తెలుసు. నిరుడు ఎమ్మెల్సీ అవుతున్నాడని ప్రచారమైతే.. ఎందుకో రాలేదు. కార్పొరేషన్ పదవిలో ఉన్నా…కళాకారుడిగానే పార్టీ సభల్లో కనిపించేవాడు.
పాలమూరు పాటగాడు సాయి చంద్ కు నివాళి…😥
Raghu Bhuvanagiri