అరికెల కాంగ్రెస్ రాజకీయం వెనుక మండవ
నర్సారెడ్డిని రూరల్‌లో అభ్యర్థిగా నిలిపేందుకు మండవ వెంకటేశ్వరరావు మధ్యవర్తిత్వం…
రేవంత్‌తో జరిపిన చర్చల్లో కీలకం మండవ….
రూరల్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు…
క్రియాశీల రాజకీయాలకు దూరం అంటూనే…తన అనుచరవర్గాన్ని కాంగ్రెస్ వైపు మళ్లిస్తున్న మండవ….
నిజామాబాద్ ప్రతినిధి- వాస్తవం..
ఒకప్పుడు మండవ వెంకటేశ్వరరావు ఒక వెలుగు వెలిగాడు. టీడీపీ జమానాలో ఆయనకు తిరుగులేదు. సీనియర్ నేతగా, మంత్రి పదవులు చేపట్టిన మండవ ఆ తర్వాత రాజకీయాల్లో కనుమరుగైపోయారు. కనిపించకుండా పోయారు. ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో కవితకు మద్దతుగా నిలిపించేందుకు , పాత దోస్తానా చనువుతో ఇంటికి వెళ్లి మరీ పార్టీలో చేర్చుకున్నారు. ఆయన కూడా కొన్ని ప్రాంతాల్లో మీటింగులో ప్రచారం చేశారు. కానీ ఏం ప్రయోజనం..? కవిత ఓటమి పాలయ్యింది. ఆ తర్వాత మండవకు మంచి అవకాశాలొస్తాయని ప్రచారం చేసుకున్నారు. రాజ్యసభ ఇస్తారనుకున్నారు. కనీసం ప్రభుత్వ సలహాదారుడిగానైనా చేస్తారనుకున్నారు.
కానీ, కవితే ఓడిన తర్వాత ఎవరికేమిటి చేసేది అనుకున్నారో ఏమో సీఎం…. ఆ తర్వాత మండవను పట్టించుకోలేదు. ఆ మాటకొస్తే నిజామాబాద్ లీడర్లనే పట్టించుకోలేదు. దీంతో మండవ వెంకటేశ్వరరావు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఓ దశలో రాజకీయంగా తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. ప్రస్తుత రాజకీయాల్లో తను ఇమడలేనని చాలా మంది తన సన్నిహితుల వద్ద చెబుతూ వచ్చారు. రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారట కదా అని చాలా మంది విలేకరులు రాసిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. నవ్వుకున్నారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. అసహనంగా ఫీలయ్యారు. తన రాజకీయ జీవితం ఇక ముగిసినట్టేనని కూడా చెప్పుకొచ్చాడు.
కానీ మళ్లీ ఆయన పేరు తెరమీదకు వచ్చింది. అరికెల నర్సారెడ్డి మూలంగా. అరికెల నర్సారెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరాడు. బీఆరెస్‌లో తనకి గుర్తింపు లేదని, పట్టించుకునే దిక్కు లేదని భావిస్తన్న నేతల్లో అరికెల ఒకడు. అందునా…. కచ్చితంగా ఈసారి రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కంకణం కట్టుకున్నవాడు. దీంతో రేవంత్‌రెడ్డితో ఉన్న పాత పరిచయాలను వాడుకున్నాడు. కానీ అందరికీ తెలియని, తెర వెనుక జరిగిన రహస్యమేమిటంటే… అరికెల కాంగ్రెస్‌లో జాయినింగ్ వెనుక ఉన్నది మండవ వెంకటేశ్వరరావు. తనే కర్త, కర్మ, క్రియగా దగ్గరుండి, మధ్యవర్తిత్వం వహించి రేవంత్‌ను ఒప్పించి అరికెలకు కాంగ్రెస్ ఎంట్రీ ఇప్పించారు. బీఆరెస్‌పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న మండవ ఈ విధంగా తన అనుచరుడికి కాంగ్రెస్‌లో లైఫ్ ఇవ్వాలనుకున్నారు. అందుకే కింగ్ కాలేకపోయినా.. కింగ్ మేకర్ పాత్రకు రెడీ అయ్యాడు. రాజకీయాలొద్దంటూనే.. తన సీనియారిటినీ బీఆరెస్‌ను దెబ్బ తీసేందకు ఉపయోగించాలనుకుంటున్నారు. ఇప్పుడు జరిగిందదే. త్వరలో మండవ వర్గం చాలా మంది కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉంది.