భూముల ధరలు ఆమాంతం పెంచేశారు. ఇదిప్పటి మాట కాదు.. కానీ క్రయవిక్రయాలు అంతలా పెరగలేదు. క్రమేణా అవి జీరోకు వచ్చేశాయి. ఎన్నికల ఏడాది కావడంతో పాట్ల కొనుగోళ్ల ప్రక్రియ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఏడాది కిందటదాకా… అంతకు ముందు ప్రధాన రోడ్ల వెంబడి ఉన్న పడావు భూములు.. కొన్ని వ్యవసాయం చేసుకునే భూములు కూడా రియల్ ఎస్టేట్ పాలయ్యాయి. ధరలు పెంచి ఇవ్వడంతో అమ్ముకున్నారు. అంతకు మించి ధర నిర్ణయించి వెంచర్లు చేసి ప్లాట్లుగా చేసినా.. . అంతగా వర్కవుట్ కాలేదు. దీంతో ప్లాట్లు పడావు పడుతున్నాయి. ఇవన్నీ గమనించిన రైతు.. పడావు భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మకానికి పెట్టడానికి ముందుకు రావడం లేదు.
వ్యవసాయం చేసుకోవడమే బెటర్ అనుకుంటున్నాడు. అందుకే పడావు భూములకు అచ్చుకడుతున్నారు. కొత్తగా వ్యవసాయం విస్తీర్ణం పెరుగుతుంది. ఇది వానాకాలం సీజన్ కావడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోర్ల మీద ఆధారపడి ఉన్న పంటల భూములతో పని లేకుండా కొత్తగా సాగులోకి వచ్చే పడావు భూములన్నీ వానాకాలం సీజన్‌తో కళకళలాడనున్నాయి. ప్రభుత్వం వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వడం… ప్రకృతి ప్రకోపానికి పంటలు బలైనా ప్రభుత్వం ఆదుకునేందుకు సిద్దంగా ఉన్న నేపథ్యం.. వరి ధాన్యం కొనుగోళ్లు.. చెల్లింపులు ఇవన్నీ కూడా రైతుల్లో ఓ ధీమాను నింపుతున్నాయి. రాను రాను భూములకు మరింత రేటు పెరిగే అవకాశం ఉండటంతో… సీజన్ లేక వెలవెలబోతున్న రియల్ ఎస్టేట్‌కు భూములను బలిచేసే బదులు.. వ్యవసాయం చేసుకోవడం బెటరని రైతాంగం భావిస్తోంది.
దీంతో వ్యవసాయం విస్తీర్ణం పెరిగిపోతున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఎన్నికలు ముగిసిన తర్వాతే మళ్లీ రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు భూముల క్రయవిక్రయాల్లో పెద్దగా కదలిక ఉండేలా లేదు. అయినా ధరలు మాత్రం నిలకడగానే ఉన్నాయి. పెంచిన రేట్లు దించేందుకు రియల్ వ్యాపారులు ఇష్టపడటం లేదు. వారికి భూములు అమ్మేందుకు రైతులూ మొగ్గుచూపడం లేదు.