వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌:

అసలే అంతంత మాత్రంగా బీడీ కార్మికుల బతుకులు. చాలీచాలని ఆకు,తంబాకుతో శ్రమదోపిడీకి గురవుతూ ఆరోగ్యం గుల్ల చేసుకుంటున్న బీడీ కార్మికులకు దేశాయి బీడీ కంపెనీ ఓ గుదిబండలా తయారయ్యింది. బీడీ కంపెనీ తయారీ నుంచి మెల్ల మెల్లగా తప్పుకునే క్రమంలో అది ఇంతకు ముందే విస్తరించి ఉన్న స్నాక్స్‌ తయారీ కంపెనీని తెలంగాణకు కూడా విస్తరించాడు. రెండు, మూడు నెలల కింద కుర్‌ కురే స్నాక్స్‌ను పిటారా పేరుతో దేశాయి బ్రదర్స్‌ లిమిటెడ్‌ తెలంగాణలో మ్యానుఫ్యాక్షరింగ్‌ మొదలు పెట్టింది. అంతకు ముందు ఈ కంపెనీ గుజరాత్ ఇతర రాష్ట్రాలకే పరిమితమయ్యేది. ఇప్పుడు దీన్ని తెలంగాణకూ తెచ్చారు.

కానీ దీన్ని అడ్వర్టయిజ్‌మెంట్‌ చేయాలంటే కోట్లు కావాలి. అదేమీ అక్కర లేకుండా తమ చెప్పుచేతల్లోనే ఉన్న బీడీ కార్మికులకు టార్గెట్‌ చేసి ఈ కంపెనీ పిటారా పేరుతో కుర్‌ కురే స్నాక్స్‌ను వారి నెత్తికి అంటగడుతోంది. టార్గెట్లు పెడుతోంది. ఉత్తర తెలంగాణలో బీడీ కార్మికులు అధికంగా ఉంటారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా, ఉమ్మడి వరంగల్‌, ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బీడీ కార్మికులున్నారు. ఇందులో అత్యధికంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనే బీడీ కార్మికులున్నారు. టేకేదార్లు, ప్యాకర్లు, బీడీ కార్మికులు అంతా కలిపి దాదాపు లక్ష మంది వరకు ఉంటారు. టేకేదార్లకు ఈ కంపెనీ ఈ కుర్‌ కురేలను అంటగడుతున్నది. నెలకు ఇన్ని ప్యాకెట్లు అమ్మాల్సిందేనని టార్గెట్‌ పెడుతోంది. ఇక ఇక్కడ నుంచి ప్రారంభమైన ఈ టార్గెట్ చైన్ ఖార్ఖానాలకు చేరుతుంది. అక్కడ ఖార్జానాలో బీడీఆకు, తంబాకు వేసే దగ్గర బీడీ కార్మికులకు అంటగట్టేదాకా వెళ్తుంది.

బీడీలు చేసేప్రతీ కార్మికురాలు నెలకు వంద రూపాయల వరకు విలువ చేసే కుర్‌కురే ప్యాకెట్లు కొనాలన్నమాట. ఒకవేళ కొనకపోతే… బీడీఆకులో తేడా… తంబాకులో తేడా… లెక్కింపులో మతలబు లాంటి కుట్రలకు కూడా వెనుకాడటం లేదట. స్వయంగా ఈ విషయాలను బీడీ కార్మికుల యూనియన్లకు తెలిసినా ఎవరూ కిమ్మనరు. మనకెందుకులే ఈ లొల్లి అన్నట్టుగా గప్‌చుప్‌గా ఉండటంతో కార్మికులంతా దేశాయి బీడీ కంపెనీ బిజినెస్‌ కూలీలుగా మారుతున్నారు. పిటారా కుర్‌కురే కంపెనీకి సేల్స్‌ ప్రమోటర్లూ అవుతున్నారు. వారే వినియోగదారులూ అవుతున్నారు. ఇదీ జరుగుతున్న తంతు. దీనిపై నూర్జహాన్‌ సంబంధిత అధికారులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.

You missed